IPL 2022 CSK vs PBKS: అంబటి రాయుడు ఒంటరి పోరాటం వృథా... చెన్నైకి మరో ఓటమి...

By Chinthakindhi RamuFirst Published Apr 25, 2022, 11:31 PM IST
Highlights

ఐపీఎల్ 2022 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కి ఆరో ఓటమి... అంబటి రాయుడు 78 పరుగులతో ఒంటరి పోరాటం వృథా... పంజాబ్ కింగ్స్ చేతుల్లో 11 పరుగుల తేడాతో ఓడిన చెన్నై సూపర్ కింగ్స్... 

ఐపీఎల్‌ 2022 సీజన్‌లో ఫైవ్ టైం ఛాంపియన్ ముంబై ఇండియన్స్‌ని ఫోర్ టైం టైటిల్ విన్నర్ చెన్నై సూపర్ కింగ్స్ ఫాలో అయ్యేలా కనిపిస్తోంది. గత మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై గెలిచి ప్లేఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకున్న చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పోరాడి ఓడింది. అంబటి రాయుడు అద్భుత హాఫ్ సెంచరీతో ఒంటరి పోరాటం చేసినా చెన్నైని విజయతీరాలకు చేర్చలేకపోయాడు. 

భారీ లక్ష్యఛేదనలో సీఎస్‌కేకి శుభారంభం దక్కలేదు. రాబిన్ ఊతప్ప 7 బంతులాడి 1 పరుగు మాత్రమే చేసి సందీప్ శర్మ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. వన్‌డౌన్‌లో వచ్చిన మిచెల్ సాంట్నర్ 15 బంతుల్లో ఓ ఫోర్‌తో 9 పరుగులు చేసి అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు.

Latest Videos

బీభత్సమైన ఫామ్‌లో ఉన్న శివమ్ దూబే, 7 బంతుల్లో ఓ ఫోర్‌తో 8 పరుగులు చేసి రిషీ ధావన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 27 బంతుల్లో 4 ఫోర్లతో 30 పరుగులు చేసిన రుతురాజ్ గైక్వాడ్... రబాడా బౌలింగ్‌లో అవుట్ కావడంతో 89 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది సీఎస్‌కే..

రాహుల్ చాహార్ వేసిన ఓవర్‌లో సిక్సర్‌తో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న అంబటి రాయుడు, సందీప్ శర్మ వేసిన 16వ ఓవర్‌లో హ్యాట్రిక్ సిక్సర్లు, ఓ ఫోర్‌తో 23 పరుగులు రాబట్టాడు.

39 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్సర్లతో 78 పరుగులు చేసిన అంబటి రాయుడు... కగిసో రబాడా బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అర్ష్‌దీప్ సింగ్ వేసిన 17వ ఓవర్‌లో, కగిసో రబాడా వేసిన 18వ ఓవర్‌లో ఆరేసి పరుగులు మాత్రమే రావడంతో ఉత్కంఠ రేగింది...

చెన్నై సూపర్ కింగ్స్ విజయానికి చివరి 2 ఓవర్లలో 35 పరుగులు కావాల్సి వచ్చింది. అర్ష్‌దీప్ సింగ్ వేసిన 19వ ఓవర్‌లో 8 పరుగులు మాత్రమే రావడంతో ఆఖరి ఓవర్‌లో సీఎస్‌కే విజయానికి 27 పరుగులు కావాల్సి వచ్చాయి... 

రిషి ధావన్ వేసిన ఆఖరి ఓవర్‌లో మొదటి బంతికే భారీ సిక్సర్ బాదాడు ఎమ్మెస్ ధోనీ. ఆ తర్వాతి బంతికి వైడ్ రూపంలో మరో పరుగు వచ్చింది. రెండో బంతికి పరుగులేమీ రాలేదు. 

మూడో బంతికి ఎమ్మెస్ ధోనీ భారీ షాట్‌కి ప్రయత్నించి బెయిర్‌స్టోకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 8 బంతులాడిన ధోనీ ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 12 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. అప్పటికే సీఎస్‌కే విజయానికి ఆఖరి 3 బంతుల్లో 20 పరుగులు కావాల్సి వచ్చాయి...

నాలుగో బంతికి సింగిల్ రాగా ఐదో బంతికి సిక్సర్ బాదిన రవీంద్ర జడేజా, ఆఖరి బంతికి సింగిల్ తీశాడు. దీంతొ 188 పరుగుల లక్ష్యఛేదనలో 176 పరుగులకి పరిమితమైన చెన్నై సూపర్ కింగ్స్ 11 పరుగుల తేడాతో ఓడింది. 

అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్, నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 187 పరుగులు చేసింది. మయాంక్ అగర్వాల్ 21 బంతుల్లో 2 ఫోర్లతో 18 పరుగులు చేసి మహీశ్ తీక్షణ బౌలింగ్‌లో దూబేకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. మయాంక్, శిఖర్ ధావన్ ఇద్దరూ స్లోగా ఇన్నింగ్స్ మొదలెట్టడంతో పవర్ ప్లే ముగిసే సమయానికి 37 పరుగులు మాత్రమే చేయగలిగింది పంజాబ్ కింగ్స్...


ఆ తర్వాత ఐపీఎల్‌లో 6 వేల పరుగులు పూర్తి చేసుకున్న శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ తర్వాత ఈ ఫీట్ సాధించిన రెండో బ్యాటర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు...

విరాట్ కోహ్లీ, ఐపీఎల్‌లో 6402 పరుగులు చేసి టాప్‌లో ఉండగా శిఖర్ ధావన్ 6 వేలకు పైగా పరుగులతో రెండో స్థానంలో నిలిచాడు. రోహిత్ శర్మ 5746 పరుగులతో, డేవిడ్ వార్నర్ 5668 పరుగులతో తర్వాతి స్థానాల్లో నిలిచారు...

2017లో శిఖర్ ధావన్ 3300+ పరుగులతో ఉన్న సమయంలో రోహిత్ శర్మ దాదాపు 4 వేల పరుగులు (3986) పరగుులు చేయగా... నాలుగేళ్ల తర్వాత గబ్బర్ 6 వేల పరుగులు చేరగా... రోహిత్ అతనికి 300 పరుగుల దూరంలో నిలవడం విశేషం.. 

అలాగే చెన్నై సూపర్ కింగ్స్‌పై 1000+ పరుగులు పూర్తి చేసుకున్నాడు శిఖర్ ధావన్. రోహిత్ శర్మ, కేకేఆర్‌పై 1018 పరుగులు చేయగా, డేవిడ్ వార్నర్, పంజాబ్ కింగ్స్‌పై 1005 పరుగులు చేసి టాప్‌లో ఉన్నారు...

అలాగే సీఎస్‌కేతో మ్యాచ్‌లో 11 పరుగుల వద్ద టీ20 క్రికెట్‌లో 9 వేల పరుగులను కూడా పూర్తి చేసుకున్నాడు శిఖర్ ధావన్... టీమిండియా తరుపున 68 టీ20 మ్యాచులు ఆడిన ధావన్, 1759 పరుగులు చేశాడు. టీమిండియా తరుపున విరాట్ కోహ్లీ టీ20ల్లో 10392 పరుగులు చేసి టాప్‌లో ఉండగా రోహిత్ శర్మ 10048 పరుగులతో తర్వాతి స్థానంలో ఉన్నాడు. 

శిఖర్ ధావన్, భనుక రాజపక్ష కలిసి మూడో వికెట్‌కి 110 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 32 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 42 పరుగులు చేసిన రాజపక్ష, బ్రావో బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. 

7 బంతుల్లో ఓ ఫోర్, 2 సిక్సర్లతో 19 పరుగులు చేసిన లియామ్ లివింగ్‌స్టోన్ కూడా బ్రావో బౌలింగ్‌లోనే పెవిలియన్ చేరాడు. 3 బంతుల్లో ఓ ఫోర్‌తో 6 పరుగులు చేసిన బెయిర్‌స్టో.. ఇన్నింగ్స్ ఆఖరి బంతికి రనౌట్ అయ్యాడు.

59 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 88 పరుగులు చేసిన శిఖర్ ధావన్ నాటౌట్‌గా నిలిచాడు. 

click me!