IPL 2021 SRH vs PBKS: మహ్మద్ షమీ మ్యాజిక్ స్పెల్... డేవిడ్ వార్నర్, కేన్ విలియమ్సన్ అవుట్...

By Chinthakindhi RamuFirst Published Sep 25, 2021, 9:48 PM IST
Highlights

మొదటి రెండు ఓవర్లలో 2 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు కీలక వికెట్లు తీసిన మహ్మద్ షమీ... స్వల్ప లక్ష్యఛేదనలో డేవిడ్ వార్నర్, కేన్ విలియంసన్ విఫలం...

ఐపీఎల్ 2021 సీజన్‌లో ఇప్పటికే ప్లేఆఫ్ రేసు నుంచి తప్పుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్, ఆఖరి స్థానంలోనే ముగించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. బౌలర్లు అద్భుతంగా రాణించడంతో పంజాబ్ కింగ్స్‌ను 125 పరుగులకి పరిమితం చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్...

అయితే 126 పరుగుల టార్గెట్‌తో బరిలో దిగిన సన్‌రైజర్స్‌కి మొదటి ఓవర్‌లోనే షాక్ తగిలింది. ఫేజ్ 1లో కెప్టెన్సీ కోల్పోయి, ఫేజ్ 2లో ఫామ్‌లోకి రావడానికి తెగ కష్టపడుతున్న డేవిడ్ వార్నర్, మహ్మద్ షమీ వేసిన మొదటి ఓవర్ మూడో బంతికే అవుట్ అయ్యాడు...

షమీ బౌలింగ్‌లో కీపర్ కెఎల్ రాహుల్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 2 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది సన్‌రైజర్స్. ఆ తర్వాత 6 బంతులాడి కేవలం 1 పరుగు చేసిన కెప్టెన్ కేన్ విలియంసన్, మహ్మద్ షమీ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. 2.2 ఓవర్లలో 10 పరుగులు చేసిన సన్‌రైజర్స్, రెండు కీలక వికెట్లు కోల్పోయింది.

2 ఓవర్లలో ఓ మెయిడిన్ ఓవర్ వేసిన మహ్మద్ షమీ, కేవలం 2 పరుగులిచ్చి 2 వికెట్లు తీసి సెన్సేషనల్ స్పెల్‌ వేశాడు... సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈ సీజన్‌లో అందుకున్న ఒకే ఒక్క విజయం పంజాబ్ కింగ్స్‌పైనే. ఫస్టాఫ్‌లో పంజాబ్‌పై విజయం అందుకున్న సన్‌రైజర్స్, ఆ తర్వాత మరో విజయాన్ని రుచి చూడలేక వరుస పరాజయాలతో ప్లేఆఫ్ రేసు నుంచి తప్పుకున్న మొట్టమొదటి జట్టుగా నిలిచింది...

2020 ఐపీఎల్‌లో ఈ రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో సరిగ్గా 125/7 స్కోరు చేసిన పంజాబ్ కింగ్స్, ఆ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ను 104 పరుగులకి ఆలౌట్ చేసి విజయాన్ని అందుకోవడం విశేషం...

click me!