IPL2021 DC vs RR: చిత్తుగా ఓడిన రాజస్థాన్ రాయల్స్... ప్లేఆఫ్స్‌కి ఢిల్లీ క్యాపిటల్స్..

By Chinthakindhi RamuFirst Published Sep 25, 2021, 7:18 PM IST
Highlights

ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాట్స్‌మెన్‌ను స్వల్ప స్కోరుకే కట్టడి చేశామనే ఆనందం, రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్లలో ఎక్కువసేపు నిలవలేదు. 155 పరుగుల టార్గెట్‌ను ఛేదించలేక 33 పరుగుల తేడాతో ఓడింది ఆర్ఆర్. మరోవైపు సీజన్‌లో 8వ విజయాన్ని అందుకున్న ఢిల్లీ, 2021లో ప్లేఆఫ్స్‌కి అర్హత సాధించిన మొదటి జట్టుగా నిలిచింది...

155 పరుగుల టార్గెట్‌తో బరిలో దిగిన రాజస్థాన్ రాయల్స్, 17 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది... 3 బంతుల్లో 1 పరుగు మాత్రమే చేసిన లియామ్ లివింగ్‌స్టోన్, ఆవేశ్ ఖాన్ బౌలింగ్‌లో రిషబ్ పంత్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. మొదటి ఓవర్‌ ఆఖరి బంతికి తొలి వికెట్ కోల్పోయిన రాజస్థాన్, ఆ తర్వాతి బంతికి జైస్వాల్ వికెట్ కోల్పోయింది... 


4 బంతుల్లో 5 పరుగులు చేసిన యశస్వి జైస్వాల్, నోకియా బౌలింగ్‌లో పంత్‌కే క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు...  6 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది రాజస్థాన్ రాయల్స్. 10 బంతుల్లో 7 పరుగులు చేసిన డేవిడ్ మిల్లర్, రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్‌లో భారీ షాట్‌కి ప్రయత్నించి స్టంపౌట్ అయ్యాడు...

డేవిడ్ మిల్లర్ వికెట్ తీసిన రవిచంద్రన్ అశ్విన్, టీ20 కెరీర్‌లో 250 వికెట్లు పూర్తిచేసుకున్నాడు. భారత బౌలర్లలో అమిత్ మిశ్రా 262, పియూష్ చావ్లా 262 వికెట్లతో రవచంద్రన్ అశ్విన్ కంటే ముందున్నారు...
24 బంతుల్లో ఓ సిక్సర్‌తో 19 పరుగులు చేసిన మహిపాల్ లోమ్రోర్, రబాడా బౌలింగ్‌లో భారీ షాట్‌కి ప్రయత్నించి అవుట్ కాగా... రియాన్ పరాగ్ 7 బంతుల్లో 2 పరుగులు చేసి అక్షర్ పటేల్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు...

ఓ ఎండ్‌లో వికెట్లు పడుతున్నా, మరో ఎండ్‌లో కెప్టెన్ సంజూ శాంసన్, ఎంతో ఓపికగా ఆడుతూ 39 బంతుల్లో 7 ఫోర్లతో హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు...ఈ మ్యాచ్‌లో రెండు క్యాచులు అందుకున్న రిషబ్ పంత్, ఐపీఎల్‌లో 50 వికెట్లలో భాగం పంచుకున్న మొట్టమొదటి ఢిల్లీ క్యాపిటల్స్ వికెట్ కీపర్‌గా నిలిచాడు... 

15 బంతుల్లో 9 పరుగులు చేసిన రాహుల్ తెవాటియా, నోకియా బౌలింగ్‌లోభారీ షాట్‌కి ప్రయత్నించి పెవిలియన్ చేరాడు... అప్పటికే రన్‌రేట్ విపరీతంగా పెరిగిపోయింది... ఆఖరి ఓవర్‌లో విజయానికి 44 పరుగులు కావాల్సి రావడంతో 11 పరుగులు మాత్రమే చేసిన రాజస్థాన్ రాయల్స్, 33 పరుగుల తేడాతో ఓడింది. సంజూ శాంసన్  53 బంతుల్లో 8 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 70 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.

click me!