IPL2021 Final: దంచికొట్టిన డుప్లిసిస్, మొయిన్ ఆలీ... కేకేఆర్ ముందు భారీ టార్గెట్...

By Chinthakindhi RamuFirst Published Oct 15, 2021, 9:16 PM IST
Highlights

IPL2021 Final CSK vs KKR: 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 192 పరుగులు చేసిన సీఎస్‌కే...  ఫాప్ డుప్లిసిస్ హాఫ్ సెంచరీ, రెండు వికెట్లు తీసిన సునీల్ నరైన్...

ఐపీఎల్ 2021 సీజన్ ఫైనల్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ భారీ స్కోరు చేసింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న కేకేఆర్‌కి షాక్ ఇస్తూ, సీఎస్‌కేకి ఓపెనర్లు మంచి ఆరంభం అందించారు. తొలి వికెట్‌కి 61 పరుగులు భాగస్వామ్యం నెలకొల్పిన రుతురాజ్ గైక్వాడ్, ఫాఫ్ డుప్లిసిస్... ఈ సీజన్‌లో ఏడోసారి 50+ భాగస్వామ్యం నెలకొల్పారు. సీఎస్‌కే తరుపున ఒక సీజన్‌లో అత్యధిక సార్లు ఈ ఫీట్ సాధించిన జోడిగా నిలిచారు ఈ ఇద్దరూ...

ఐపీఎల్ 2021 సీజన్‌లో 756 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన రుతురాజ్ గైక్వాడ్, డుప్లిసిస్... ఐపీఎల్ చరిత్రలో మూడో అతి పెద్ద భాగస్వామ్యాన్ని నమోదుచేశాడు.. 2016 సీజన్‌లో విరాట్ కోహ్లీ, ఏబీ డివిల్లియర్స్ కలిసి 939 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పగా, 2019 సీజన్‌లో బెయిర్ స్టో, డేవిడ్ వార్నర్ 791 పరుగులు చేసి టాప్ 2లో ఉన్నారు..

27 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 32 పరుగులు చేసిన రుతురాజ్ గైక్వాడ్, ఆరెంజ్ క్యాప్ రేసులో టాప్‌లోకి దూసుకెళ్లాడు... రుతురాజ్ గైక్వాడ్ అవుటైన తర్వాత దూకుడు పెంచి బౌండరీలు బాదడం మొదలెట్టిన ఫాఫ్ డుప్లిసిస్, 37 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో హాఫ్ సెంచరీ అందుకున్నాడు... ఇది ఈ సీజన్‌లో డుప్లిసిస్‌కి ఆరో హాఫ్ సెంచరీ కాగా, 11వ సారి 30+ స్కోరు...

15 బంతుల్లో 3 భారీ సిక్సర్లతో 31 పరుగులు చేసిన రాబిన్ ఊతప్ప, సునీల్ నరైన్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన మొయిన్ ఆలీ కూడా వస్తూనే కేకేఆర్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు...

సీఎస్‌కే బ్యాట్స్‌మన్ బాదుడు వల్ల సీజన్‌లో ఇప్పటివరకూ 7+ ఎకానమీతో కూడా పరుగులు ఇవ్వని వరుణ్ చక్రవర్తి, మొదటిసారి 9.5 ఎకానమీ నమోదుచేయాల్సి వచ్చింది. చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్‌లో మొదటి మూడు వికెట్లకీ 50+ భాగస్వామ్యం నమోదుకావడం విశేషం. 

59 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 86 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ ఆఖరి బంతికి అవుటైన డుప్లిసిస్, ఆరెంజ్ క్యాప్‌కి 2 పరుగుల దూరంలో నిలిచాడు. రుతురాజ్ గైక్వాడ్ 635 పరుగులు చేయగా, డుప్లిసిస్ 633 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు.  మొయిన్ ఆలీ 20 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 37 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.

 

click me!