ఐపిఎల్ 2020: ఢిల్లీ క్యాపిటిల్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ కు షాక్

By telugu teamFirst Published Sep 30, 2020, 8:22 AM IST
Highlights

అబుదాబి వేదికగా మంగళవారం ఐపిఎల్ 2020లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాదుతో జరిగిన మ్యాచులో ఓటమి పాలైన ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ కు షాక్ తగిలింది. లీగ్ ఆయనకు జరిమానా వేసింది.

అబుదాబి: ఐపిఎల్ 2020లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాదు జరిగిన మ్యాచులో ఓటమి పాలైన ఢిల్లీ క్యాపిటల్స్ శ్రేయస్ అయ్యర్ కు షాక్ తగిలింది. శ్రీయస్ అయ్యర్ కు రూ.12 లక్షల జరిమానా విధించారు. నిర్దేశిత సమయం కన్నా ఎక్కువ సమయం బౌలింగ్ కు తీసుకోవడంతో ఆ జరిమానా విధించినట్లు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) నిర్వాహకులు తెలిపారు .

అబుదాబి వేదికగా మంగళవారం హైదరాబాదు, ఢిల్లీ మధ్య మ్యాచ్ జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన డేవిడ్ వార్నర్ నాయకత్వంలోని సన్ రైజర్స్ హైదరాబాదు 4 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. వార్నర్ (45), బెయిర్ స్టో (53), విలియమ్సన్ (41) రాణించడంతో హైదరాబాదు గౌరవప్రదమైన స్కోరు చేసింది. 

కీలకమైన బ్యాట్స్ మెన్ నిలదొక్కుకుంటూ పరుగులు చేస్తుండడంతో వికెట్లు తీసే విషయంలో ఢిల్లీ బౌలర్లు తీవ్రంగా శ్రమించారు. వికెట్లు పడకపోవడంతో శ్రేయస్ అయ్యర్ బౌలింగులో మార్పులు చేస్తూ వచ్చారు. ఆటగాళ్లతో చర్చలు సాగించారు. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ నిర్దేశించిన సమయంలో బౌలింగ్ కోటాను పూర్తి చేయలేకపోయింది. 

తద్వారా లీగ్ నియమావళి ఉల్లంఘనకు పాల్పడడంతో శ్రేయస్ అయ్యర్ కు రూ.12 లక్షల జరిమానా విధించారు.

click me!