IPL 2020: చెన్నై ఫ్యాన్స్‌కి ‘సారీ’... అయినా సురేశ్ రైనా రావడం లేదు...

By team teluguFirst Published Sep 26, 2020, 4:10 PM IST
Highlights

రైనా నిర్ణయాన్ని గౌరవించాల్సిన బాధ్యత మనపై ఉంది...

పర్సనల్ లైఫ్‌కి కూడా ప్రాధాన్యత ఇవ్వాలి...

రెండు మ్యాచుల్లో ఓడినా మరింత వేగంగా దూసుకొస్తాం...

IPL చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్టు చెన్నై సూపర్ కింగ్స్. ఆడిన ప్రతీ సీజన్‌లోనూ ప్లేఆఫ్ చేరిన చెన్నై సూపర్ కింగ్స్, ఎనిమిది సార్లు ఫైనల్ చేరి... మూడు సార్లు టైటిల్ గెలిచింది. చెన్నై సూపర్ కింగ్స్‌కి ఇంత మంచి ట్రాక్ రికార్డు ఉండడానికి సారథి మహేంద్ర సింగ్ ధోనీతో పాటు ‘చిన్నతలా’ సురేశ్ రైనా కూడా ఓ కారణం. భారత జట్టులో ఆడినప్పుడు పెద్దగా రాణించకపోయినా ఐపీఎల్‌లో మాత్రం అదరగొడతాడు రైనా.

ఐపీఎల్ కెరీర్‌లో 5 వేల పరుగులు మైలురాయి దాటిన మొట్టమొదటి ప్లేయర్ రైనాయే. ‘మిస్టర్ ఐపీఎల్’గా గుర్తింపు పొందిన రైనా లేక చెన్నై మిడిల్ ఆర్డర్ బలహీనంగా మారింది. ఈ సీజన్‌లో రైనా సెడన్‌గా స్వదేశం చేరడంతో సీఎస్‌కే ఇబ్బందులు పడుతోంది. మొదటి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబైపై అద్భుత విజయం సాధించినా... ఆ తర్వాత జరిగిన రెండు మ్యాచుల్లోనూ ఘోరంగా ఓడింది. 

దీంతో రైనా ఐపీఎల్‌కి తిరిగి రావాలని కోరుతూ ‘కమ్‌బ్యాక్ రైనా’ అంటూ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నారు చెన్నై అభిమానులు. దుండగులు చేసిన దాడిలో మామ ఆకస్మిక మరణంతో స్వగ్రామానికి చేరిన రైనా, తిరిగి రావడం లేదని క్లారిటీ ఇచ్చాడు చెన్నై సీఈవో కాశీ విశ్వనాథ్.

‘రైనా తిరిగి రావడం లేదు. కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సీజన్‌కు అందుబాటులో ఉండడం లేదు రైనా. అతని నిర్ణయాన్ని మనం గౌరవించాలి. అతని వ్యక్తిగత జీవితానికి కూడా సమయం ఇవ్వాలి...’ అని చెప్పారు విశ్వనాథ్.  అయితే ఓడింది రెండు మ్యాచులేనని, తర్వాతి మ్యాచుల్లో ఘన విజయాలు దక్కించుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు విశ్వనాథ్. రైనాతో పాటు భజ్జీ వ్యక్తిగత కారణాల వల్ల ఐపీఎల్‌కు దూరం కాగా బ్రావో, అంబటి రాయుడు గాయపడి రెండు మ్యాచులకు దూరమయ్యారు.

click me!