క్రికెట్ ప్రియులకు శుభవార్త... కామన్వెల్త్ క్రీడల్లో ఇకపై క్రికెటర్ల సందడి

By Arun Kumar PFirst Published Aug 13, 2019, 6:09 PM IST
Highlights

క్రికెట్ ప్రియులకు కామన్వెల్త్ గేమ్స్ ఫెడరేషన్ శుభవార్త అందించింది. ఇంగ్లాండ్ వేదికన జరగనున్న కామన్వెల్త్  క్రీడల్లో క్రికెట్ ను కూడా ఓ క్రీడాంశంగా చేర్చినట్లు ప్రకటించింది.

కామన్వెల్త్ దేశాల మధ్య జరిగే ప్రతిష్టాత్మక  క్రీడా పోటీల్లో క్రికెట్ కు చోటు దక్కింది. ఇంగ్లాండ్ వేదికన 2022 సంవత్సరంలో జరగనున్న ఈ క్రీడల్లో క్రికెట్ ను కూడా ఓ క్రీడాంశంగా చేరుస్తున్నట్లు కామన్వెల్త్ గేమ్స్ ఫెడరేషన్ ప్రకటించింది. ఇటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ఐసిసి), ఇంగ్లాండ్ ఆండ్ వేల్స్ క్రికెట్ బోర్డు(ఈసిబి) అభ్యర్థనలను పరిశీలించిన ఈ నిర్ణయం తీసుకున్నట్లు సిజిఎఫ్ వెల్లడించింది. అయితే కేవలం మహిళా క్రికెట్ కు మాత్రమే ఈ అవకాశం కల్పించినట్లు స్పష్టం చేసింది. 

సీజిఎఫ్ ప్రకటన వెలువడిన వెంటనే ఐసిసి సీఈవో మను సాహ్నే మీడియాతో మాట్లాడారు. '' క్రికెట్లో మహిళా క్రికెట్ కు కూడా భవిష్యత్ లో మంచి రోజులు రానున్నాయి అనడానికి ఈ నిర్ణయమే ఉదాహరణ.  మహిళా క్రికెట్లో ఇదో చారిత్రాత్మక పరిణామం. కామన్వుల్త్ క్రీడల్లో క్రికెట్ ను చేర్చాలన్న మా ప్రయత్నానికి సహకరించిన ప్రతి ఒక్కరిని  ధన్యవాదాలు.

పురుషుల క్రికెట్  స్థాయిలో మహిళా క్రికెట్ ఆదరణ  పొందలేకపోతోంది. అయితే ఇలాంటి నిర్ణయాలు మహిళా క్రికెటర్లకు ఎంతో ఉత్తేజాన్నిస్తాయి. తాము ఎందులోనూ తక్కువ కాదన్న ధైర్యాన్ని కల్గించి ఆత్మవిశ్వాసాన్ని పెంపొదిస్తాయి. మహిళా సాధికారతకు తోడ్పడేలా సిజిఎఫ్ తీసుకున్న ఈ నిర్ణయం చాలా గొప్పది. 

టీ20 క్రికెట్ ఫార్మాట్ కామన్వెల్త్ క్రీడలకు బాగా సరిపోతుంది. అలాగే మహిళా క్రికెట్ ను అంతర్జాతీయ స్థాయిలో మరింత ప్రమోట్  చేయడానికి గొప్ప  వేదిక. అంతగా ఆదరణ లేని ఈ క్రికెట్ పట్ల యువతుల్లో మంచి అభిప్రాయం కలిగేలా  చేస్తుంది. బర్మింగ్ హామ్ వేదికన జరిగే ఈ క్రీడల్లో మొదటిసారి పాల్గొనే అవకాశం వచ్చే క్రికెటర్లకు మంచి తీపి జ్జాపకాలు మిగిలిపోతాయి. ఈ నిర్ణయం అంతర్జాతీయ సమాజం నుండి ప్రశంసలను పొందుతుంది.'' అని సాహ్నే పేర్కొన్నారు.  

మలేషియా రాజధాని కౌలాలంపూర్ వేదికన 1998 సంవత్సరంలో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో క్రికెట్ కు చోటు దక్కింది.  ఈ సందర్భంగా అంతర్జాతీయ మెన్స్ క్రికెట్ జట్లు వన్డే ఫార్మాట్ లో పోటీ పడ్డాయి. ఇందులో దక్షిణాఫ్రికా విజయం సాధించింది. అయితే ఆ తర్వాత క్రికెట్ ను క్రీడా విభాగాల్లోంచి తొలగిస్తూ సిజిఎఫ్ నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు మహిళా క్రికెట్ జట్ల మధ్య టీ20 ఫార్మాట్ లో పోటీ నిర్వహించడానికి సిజిఎఫ్ నుండి అంగీకారం లభించింది. 

click me!