
ఐపీఎల్ లో ఈసారి ఎలాగైనా సరే కప్పు కొట్టాలని భావిస్తున్న ఢిల్లీ క్యాపిటల్స్ అందుకు తగ్గట్లే అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శిస్తున్నది. పాయింట్ల పట్టికలో నెంబర్ వన్ స్థానంలో ఉన్న Delhi Capitals.. నేడు మూడు సార్లు IPL విజేత చెన్నై సూపర్ కింగ్స్ తో తలపడబోతున్నది. కాగా, ఢిల్లీ హెడ్ కోచ్ గా ఉన్న ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్.. ఆ జట్టు ఆటగాళ్లలో స్ఫూర్తినింపే స్పీచ్ ఇచ్చాడు. ఈ వీడియోను ఢిల్లీ క్యాపిటల్స్ ట్విట్టర్ లో పంచుకున్నది.
వీడియోలో Ricky Ponting మాట్లాడుతూ.. ‘పాయింట్ల పట్టికలో మనం అగ్రస్థానంలో ఉండటానికి ఈ గదిలో ఉన్నవాళ్లంతా భాగమయ్యారు. ఇది వరకు మీరు అసాధారణమైన ఆటను ప్రదర్శించారు. దీనికి మనమంతా గర్వపడాలి. కానీ మన అసలైన ఆట ఆదివారం నుంచి ప్రారంభం కాబోతుంది. ఇప్పుడు మనం నిజమైన క్రికెట్ ఆడాలి’ అని చెప్పుకొచ్చాడు.
ఇప్పటివరకు ఐపీఎల్ లో బాగా ఆడిన పలువురు ఢిల్లీ ఆటగాళ్లను పాంటింగ్ ప్రత్యేకంగా మెచ్చుకున్నాడు. ముఖ్యంగా అవేశ్ ఖాన్ గురించి అతడు ప్రత్యేకంగా ప్రస్తావించాడు. ‘అవేశ్.. నువ్వు టోర్నమెంటులో అత్యుత్తమ బౌలర్లలో ఒకడివి. రెండు బంతులు, ఒక ఓవర్ నీ ప్రదర్శనను మార్చదు (గత మ్యాచ్ లో ఆర్సీబీ ఆఖరు బంతికి సిక్సర్ కొట్టిన విషయం తెలిసిందే. ఆ ఓవర్ అవేశ్ ఖానే వేశాడు). ఒకవేళ నీకు మళ్లీ అదే పరిస్థితి ఎదురైతే నువ్వు మా కోసం గెలుస్తావని నాకు తెలుసు’ అని అతడికి ధైర్యం నూరిపోశాడు.
క్వాలిఫైయర్ మ్యాచ్ లో గెలిచి ఫైనల్ కు వెళ్లాలని రిషభ్ పంత్ నేతృత్వంలోని ఢిల్లీ భావిస్తున్నది. మూడు సార్లు ఐపీఎల్ ట్రోఫీ నెగ్గిన CSKకి గత రెండు మ్యాచుల్లో షాక్ ఇచ్చిన ఢిల్లీ.. ఈ మ్యాచ్ లోనూ అదే పునరావృతం చేయాలని భావిస్తున్నది.