బోణీ కొట్టిన ఆస్ట్రేలియా... బ్యాటింగ్‌లో అదరగొట్టినా తొలి టీ20లో టీమిండియాకి తప్పని ఓటమి...

By Chinthakindhi RamuFirst Published Dec 10, 2022, 9:54 AM IST
Highlights

172 పరుగుల భారీ లక్ష్యాన్ని ఆడుతూ పాడుతూ ఛేదించిన ఆస్ట్రేలియా... ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా టీ20 మ్యాచులు చూసేందుకు ఉచితంగా ప్రేక్షకులను అనుమతిస్తున్న బీసీసీఐ..

భారత పర్యటనని విజయంతో మొదలెట్టింది ఆస్ట్రేలియా  వుమెన్స్ జట్టు. ముంబైలో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో భారత జట్టుపై ఘన విజయం అందుకుంది ఆసీస్. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 172 పరుగుల భారీ స్కోరు చేసింది...

యంగ్ ఓపెనర్ షెఫాలీ వర్మ 10 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 21 పరుగులు చేసి అవుట్ కాగా వన్‌డౌన్‌లో వచ్చిన జెమీమా రోడ్రిగ్స్ 6 బంతులు ఆడి డకౌట్ అయ్యింది. స్మృతి మంధాన 22 బంతుల్లో 5 ఫోర్లతో 28 పరుగులు చేసి అవుట్ కాగా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 23 బంతుల్లో 2 ఫోర్లతో 21 పరుగులు చేసింది...

వికెట్ కీపర్ రిచా ఘోష్ 20 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 36 పరుగులు చేయగా దేవికా వైద్య 24 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 25 పరుగులు చేసింది. దీప్తి శర్మ 15 బంతుల్లో 8 ఫోర్లతో 36 పరుగులు చేసి మెరుపులు మెరిపించింది...

173 పరుగుల భారీ లక్ష్యాన్ని ఆడుతూ పాడుతూ ఛేదించింది ఆస్ట్రేలియా. ఆసీస్  కెప్టెన్ ఆలీసా హేలీ 23 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 37 పరుగులు చేసి దేవికా వైద్య బౌలింగ్‌లో భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యింది. తొలి వికెట్‌కి 73 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాన బేత్ బూనీ, రెండో వికెట్‌కి తహిళా మెక్‌గ్రాత్‌తో కలిసి అజేయంగా శతక భాగస్వామ్యాన్ని నిర్మించింది...

బేత్ మూనీ 57 బంతుల్లో 16 ఫోర్లతో 89 పరుగులు చేయగా తహిళా మెక్‌గ్రాత్ 29 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 40 పరుగులు చేసింది. 18.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి ఆస్ట్రేలియా... ఐదు టీ20ల సిరీస్‌లో 1-0 ఆధిక్యం సాధించింది. ఇరుజట్ల మధ్య రెండో టీ20 మ్యాచ్ ఆదివారం డిసెంబర్ 11న జరగనుంది. ముంబైలోని డాక్టర్ డి వై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచులు చూసేందుకు జనాలను ఉచితంగా అనుమతిస్తోంది బీసీసీఐ.

click me!