
టీమిండియాతో జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్‌లో టాస్ గెలిచిన వెస్టిండీస్ బ్యాటింగ్ ఎంచుకుంది. నేటి మ్యాచ్ ద్వారా యశస్వి జైస్వాల్, టీ20 ఆరంగ్రేటం చేస్తున్నాడు. మొదటి రెండు మ్యాచుల్లో తెలుగు కుర్రాడు తిలక్ వర్మ, మిగిలిన బ్యాటర్లు సరిగ్గా రాణించలేకపోయారు. ఇషాన్ కిషన్, శుబ్‌మన్ గిల్‌తో పాటు ఐసీసీ నెం.1 టీ20 బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ కూడా ఫెయిల్ అయ్యాడు.
టీ20ల్లో వరుసగా ఫెయిల్ అవుతున్న ఇషాన్ కిషన్ ప్లేస్‌లో యజ్వేంద్ర చాహాల్ తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు. తొలి రెండు టీ20ల్లో బ్యాటర్‌గా, బౌలర్‌గా ఫెయిల్ అయినా అక్షర్ పటేల్‌కి మూడో టీ20లోనూ చోటు దక్కింది. సంజూ శాంసన్ నేటి మ్యాచ్‌కి వికెట్ కీపర్‌గా వ్యవహరించబోతున్నాడు.
గాయంతో రెండో టీ20లో ఆడని కుల్దీప్ యాదవ్, తిరిగి జట్టులోకి వచ్చాడు. రవి భిష్ణోయ్ మళ్లీ రిజర్వు బెంచ్‌కే పరిమితం కావాల్సి వచ్చింది. 17 ఏళ్ల తర్వాత వెస్టిండీస్ పర్యటనలో వరుసగా రెండు మ్యాచుల్లో ఓడిన టీమిండియా, నేటి మ్యాచ్‌లో ఓడితే సిరీస్ కోల్పోవాల్సి ఉంటుంది. ఐదు టెస్టుల సిరీస్‌పై టీమిండియా ఆశలు సజీవంగా ఉండాలంటే నేటి మ్యాచ్ తప్పక గెలిచి తీరాల్సిందే.
తొలి రెండు టీ20ల్లో టీమిండియా చిన్న చిన్న తప్పిదాలతో భారీ మూల్యం చెల్లించుకుంది. తొలి టీ20లో విజయానికి 30 బంతుల్లో 37 పరుగులు కావాల్సిన స్థితిలో కీలక వికెట్లు కోల్పోయిన భారత జట్టు, 4 పరుగుల తేడాతో ఓడింది. రెండో టీ20లో దాదాపు టీమిండియా ఓటమి ఖాయం అనుకున్న సమయంలో యజ్వేంద్ర చాహాల్ వేసిన 16వ ఓవర్‌లో 3 వికెట్లు కోల్పోయింది వెస్టిండీస్..
అయితే యజ్వేంద్ర చాహాల్‌తో మరో ఓవర్ వేయించకుండా ఆపిన హార్ధిక్ పాండ్యా, ఫాస్ట్ బౌలర్లకు బాల్ ఇవ్వడం మ్యాచ్ రిజల్ట్‌నే మార్చేసింది. ఈ రెండు ఓటములతో వెస్టిండీస్‌లో వరుసగా రెండు మ్యాచుల్లో ఓడిన భారత కెప్టెన్‌గా చెత్త రికార్డు మూటకట్టుకున్న హార్ధిక్ పాండ్యా తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు.
వచ్చే ఏడాది వెస్టిండీస్‌లో జరగబోయే టీ20 వరల్డ్ కప్ 2024 టోర్నీలో టీమిండియాకి కెప్టెన్సీ చేయబోతున్న హార్ధిక్ పాండ్యాకి ఈ మ్యాచ్, ఈ సిరీస్ విజయం చాలా కీలకంగా మారనుంది. వన్డే వరల్డ్ కప్ 2023 క్వాలిఫైయర్స్‌లో ఓడిన వెస్టిండీస్, ఈ మ్యాచ్ గెలిచి సిరీస్ సొంతం చేసుకోవాలని చూస్తోంది. గాయం కారణంగా జాసన్ హోల్డర్ నేటి మ్యాచ్‌కి దూరం అయ్యాడు. అతని స్థానంలో రోస్టన్ ఛఏజ్ తుది జట్టులోకి వచ్చాడు.
భారత జట్టు: శుబ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్ధిక్ పాండ్యా (కెప్టెన్), సంజూ శాంసన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, యజ్వేంద్ర చాహాల్, ముకేశ్ కుమార్
వెస్టిండీస్ జట్టు: బ్రెండన్ కింగ్, కైల్ మేయర్స్, జాన్సన్ ఛార్లెస్, నికోలస్ పూరన్, రోవ్‌మెన్ పావెల్ (కెప్టెన్), సిమ్రాన్ హెట్మయర్, రొమారియో షెఫర్డ్, రోస్టన్ ఛేజ్, అకీల్ హుస్సేన్, అల్జెరీ జోసఫ్, ఓబెడ్ మెక్‌కాయ్