
టీమిండియాను ఎన్నో ఏళ్లుగా ఇబ్బందిపెడుతున్న మిడిల్ ఆర్డర్, మూడో టెస్టులో వెన్నెముకగా నిలిచింది. టాపార్డర్ ఫెయిల్ కావడంతో, స్వల్ప స్కోరుకే కీలక వికెట్లు కోల్పోయిన సమయంలో భారత జట్టును ఆదుకుని, విండీస్ ముందు మంచి లక్ష్యాన్ని పెట్టడంలో కీలక పాత్ర పోషించారు మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు... నిర్ణీత 50 ఓవర్లలో 265 పరుగులకు ఆలౌట్ అయ్యింది టీమిండియా.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టుకి శుభారంభం దక్కలేదు. 15 బంతుల్లో 3 ఫోర్లతో 13 పరుగులు చేసిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను అల్జెరీ జోసఫ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత రెండో బంతికే విరాట్ కోహ్లీ కూడా జోసఫ్ బౌలింగ్‌లో డకౌట్ అయ్యాడు...
గత ఐదు వన్డే మ్యాచుల్లో విరాట్ కోహ్లీకి ఇది రెండో డకౌట్ కాగా, కెరీర్‌లో 32వ డక్. టాపార్డర్‌లో అత్యధిక సార్లు డకౌట్ అయిన భారత ప్లేయర్‌గా వీరేంద్ర సెహ్వాగ్ (31 సార్లు)ని అధిగమించిన విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్ (34) తర్వాతి స్థానంలో నిలిచాడు...
తొలి వన్డేలో 8, రెండో వన్డేలో 18 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ, ఈ వన్డే సిరీస్‌లో మొత్తంగా 26 పరుగులు మాత్రమే చేయగలిగాడు. విరాట్ కోహ్లీ కెరీర్‌లోనే ఇదో చెత్త రికార్డు...
ఆ తర్వాత 26 బంతుల్లో ఓ సిక్సర్‌తో 10 పరుగులు చేసిన శిఖర్ ధావన్, ఓడెన్ స్మిత్ బౌలింగ్‌లో జాసన్ హోల్డర్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. దీంతో 42 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది భారత జట్టు. ఈ దశలో రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్ కలిసి టీమిండియాను ఆదుకున్నారు. ఈ ఇద్దరూ నాలుగో వికెట్‌కి 110 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు...
54 బంతుల్లో 6 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 56 పరుగులు చేసిన రిషబ్ పంత్, హేడెన్ వాల్ష్ బౌలింగ్‌లో షై హోప్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 7 బంతుల్లో ఓ ఫోర్‌తో 6 పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్, ఫ్యాబియన్ ఆలెన్ బౌలింగ్‌లో బ్రూక్స్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.
111 బంతుల్లో 9 ఫోర్లతో 80 పరుగులు చేసిన శ్రేయాస్ అయ్యర్ కూడా హేడెన్ వాల్ష్ బౌలింగ్‌లోనే అవుట్ అయ్యాడు. 187 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది భారత జట్టు. ఈ దశలో దీపక్ చాహార్ 38 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 38 పరుగులు చేసి మెరుపులు మెరిపించాడు...
వాషింగ్టన్ సుందర్‌తో కలిసి ఏడో వికెట్‌కి 53 పరుగులు జోడించిన దీపక్ చాహార్, జాసన్ హోల్డర్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. ఆ తర్వాత కుల్దీప్ యాదవ్ 5 పరుగులు చేసి అవుట్ కాగా వాషింగ్టన్ సుందర్ 34 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 33 పరుగులు చేసి భారత జట్టుకి బాధ్యతాయుతమైన స్కోరు అందించారు.. ఓ ఫోర్ బాదిన సిరాజ్, ఆఖరి బంతికి అవుట్ అయ్యాడు. విండీస్ బౌలర్లలో జాసన్ హోల్డర్ నాలుగు వికెట్లు, అల్జెరీ జోషప్, హేడెన్ వాల్ష్ రెండేసి వికెట్లు తీయగా ఓడెన్ స్మిత్, ఫ్యాబియన్ ఆలెన్‌లకు చెరో వికెట్ దక్కింది.