IPL2022 Auction: నా చేతితో ఎంతోమంది క్రికెటర్లను కోటీశ్వరులను చేశా.. కానీ..: ఐపీఎల్ ఆక్షనీర్ రిచర్డ్ మ్యాడ్లీ

Published : Feb 11, 2022, 04:36 PM IST
IPL2022 Auction: నా చేతితో ఎంతోమంది క్రికెటర్లను కోటీశ్వరులను చేశా.. కానీ..: ఐపీఎల్ ఆక్షనీర్ రిచర్డ్ మ్యాడ్లీ

సారాంశం

IPL2022 Auction:  పదేండ్ల పాటు ఐపీఎల్ వేలాన్ని నిర్వహించిన ఆయన..  నాలుగేండ్లుగా ఆ బాధ్యతల్లో కనిపించడం లేదు. కానీ ఐపీఎల్ తనకు ఎన్నో అనుభూతులను మిగిల్చిందంటున్నాడు రిచర్డ్ మ్యాడ్లీ..    

‘ఆ ఒకటో సారి..  రెండో సారి.. మూడో సారి..!!  ఈ క్రికెటర్ ను రూ.5 కోట్లకు ఆ ఫ్రాంచైజీ దక్కించుకుంది..’  అంటూ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వేలంలో  పదేండ్ల పాటు  ఎంతో మంది క్రికెటర్లను లక్షాదికారులు.. కాదు, కాదు కోటీశ్వరులు చేసిన వ్యక్తి ఆయన..  ఐపీఎల్ లో ఏకబిగిన పదేండ్ల పాటు ఆక్షన్ ను విజయవంతంగా నిర్వహించిన వ్యక్తి.   మన భాషలో చెప్పాలంటే  వేలం పాట పాడేవాడు. ఆయన పేరు  రిచర్డ్ మ్యాడ్లీ.. ఐపీఎల్ ప్రారంభ ఎడిషన్ (2008)  నుంచి మొదలు 2018 వ సీజన్ దాకా ఏకబిగిన దశాబ్ద కాలం పాటు వేలం నిర్వహించాడు మ్యాడ్లీ. 

కాగా బెంగళూరు వేదికగా రేపట్నుంచి రెండ్రోజుల పాటు నిర్వహించే మెగా వేలం జరుగనున్న నేపథ్యంలో ఓ జాతీయ పత్రిక  మ్యాడ్లీతో ముచ్చటించింది. తన పదేండ్ల  ఐపీఎల్ వేలం నిర్వహణ అనుభవాలను ఆయన ఎంతో ఉత్సాహంగా పంచుకున్నారు.  ఆ ఇంటర్వ్యూ సవివరంగా.. 

దశాబ్దపు ఐపీఎల్ ఆక్షనీర్  బాధ్యతలపై.. 

లలిత్ మోడీ సూచన మేరకు నేను భారత్ కు వచ్చాను. అంతకుముందు నేనెప్పుడూ ఇండియాకు రాలేదు.  అదే తొలిసారి. భారత్ లో క్రికెటర్లకు సంబంధించిన వేలం ప్రక్రియ అనేది కొత్త. ఆ సమయంలో  బిడ్డింగ్ ఇంక్రిమెంట్స్, బేస్ ప్రైజ్,  యాక్షన్ రూల్స్ గురించి మాట్లాడుకుంటే చిత్రంగా చూసేవాళ్లు.  అసలైతే నేను ఇక్కడికి వచ్చింది టెక్నికల్ అడ్వైజర్ గా.. కానీ లలిత్ మోడీ నన్ను ముంబై కి తీసుకెళ్లాడు. అప్పుడు (2008 ఫిబ్రవరి 20) మొదలైంది నా ఐపీఎల్ ఆక్షనీర్ ప్రయాణం..  ఆ రోజు ప్రపంచ  క్రికెట్ చరిత్రనే మలుపుతిప్పిందని నేను భావిస్తాను.  ఐపీఎల్ తొలి వేలం తర్వాత వచ్చిన వివిధ దేశాలలో వచ్చిన లీగ్ లన్నింటికీ అదే ఆదర్శంగా నిలిచింది. నేను 11 ఆక్షన్ లను నిర్వహించాను. ఇదొక గొప్ప అనుభవం. 

 

మీరు ఎంఎస్ ధోని నుంచి మొదలుకుని కోహ్లి, ఫ్లింటాఫ్,  పీటర్సన్  వంటి స్టార్లకు వేలం పాట పాడారు.  వాళ్లను ఎప్పుడైనా కలిశారా..? 

నేను ధోనిని కలిశాను.  అది నాకు లభించిన గొప్ప గౌరవంగా భావిస్తాను. తొలి ఐపీఎల్ వేలంలో ధోని కోసం చాలా ఫ్రాంచైజీలు పోటీ పడటం నాకింకా గుర్తు. తొలి ఐపీఎల్ గేమ్ (బెంగళూరులో) తర్వాత నేను ధోనిని కలిశాను. ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్ గేమ్ లో  బ్రెండన్ మెక్కల్లమ్ ఆడిన ఆట నాకు ఎంతో ఇష్టం.  ఓ సారి  వేలం ముగిశాక  గౌతం గంభీర్ నన్ను కలవడానికి వచ్చాడు. 

నేను చాలా మంది ఇండియన్ క్రికెటర్లతో పాటు ప్రపంచ క్రికెటర్లను కోటీశ్వరులను చేశాను (వేలం పాట ద్వారా చేశానని సరదాగా వ్యాఖ్యానించారాయన.)  ఇప్పటికీ చాలా మంది ఆ విషయాన్ని  చెబుతుంటారు. ఓసారి ఆండ్రూ ఫ్లింటాఫ్ (ఇంగ్లాండ్  మాజీ ఆల్ రౌండర్) నన్ను కలిసి.. నాకు ఒక బీర్ ఇచ్చాడు. బీర్ ఇస్తూ.. ‘మీరు నన్ను కోటీశ్వరుడిని చేశారు.. థ్యాంక్యూ..’ అని చెప్పాడు.  అప్పుడు నేను చాలా సంతోషించాను.  వేలం సందర్భంగా నేను కొంత మంది బాలీవుడ్ స్టార్స్ (షారుక్ ఖాన్, ప్రీతి జింటా) లను కూడా కలిశాను.  ఐపీఎల్  ను నేనెప్పటికీ మరిచిపోలేను. 

 

మీరు ఐపీఎల్ తొలి సీజన్ వేలం నుంచి అందులో భాగమయ్యారు.. దాని గురించి మాకు తెలియని విషయాలేమైనా..? 

ఐపీఎల్ అనే కాన్సెప్ట్ మొదలు ప్రారంభమైంది  లండన్ లో జరిగిన వింబుల్డన్ ఛాంపియన్షిప్ (టెన్నిస్)  లో.. 2007 లో వింబుల్డన్ చూడటానికి వచ్చిన  లలిత్ మోడీ..   ఆ మ్యాచ్ బ్రేక్ సందర్భంగా ఆండ్రూతో కాఫీ తాగుతూ ఈ (ఐపీఎల్) ప్రతిపాదన గురించి చెప్పాడు. మోడీ చెబుతూ.. ‘నేను ఇండియా క్రికెట్ ను మార్చాలనుకుంటున్నాను. ప్రస్తుతం ఆడుతున్నట్టు కాకుండా క్రికెట్ లో ఒక విప్లవాత్మక మార్పు తీసుకురావాలనుకుంటున్నాను. అందుకు నా దగ్గర ఒక ఐడియా ఉంది..’ అని  చెప్పాడు.  వాస్తవంగా చెప్పాలంటే ఐపీఎల్ ఆలోచన పురుడుపోసుకుంది  టెన్నిస్ కోర్టులో (నవ్వుతూ..).. 

తర్వాత  ఆక్షనీర్  ఇండియా నుంచే.. 

2008 నుంచి ఐపీఎల్ వేలంలో భాగమైన మ్యాడ్లీ.. 2018లో కనిపించలేదు. దీనిపై అతడికి  అడగగా.. ‘ఏమో నాకు కూడా దాని గురించి తెలియదు. 2019 వేలం గురించి నన్నెవరూ సంప్రదించలేదు.  కానీ 2019 వేలాన్ని మాత్రం ఎడ్మీడీస్ (ప్రస్తుతం కూడా ఈయనే..)  నిర్వహిస్తున్నారని తెలిసింది. దానికి నేనేం బాధపడలేదు. ఎవరినీ నిందించనూ లేదు.  నాలుగేండ్లుగా నాకు బీసీసీఐ నుంచి ఎటువంటి  రిలేషన్ లేదు. కానీ వారి (బీసీసీఐ) కోసం నా ఫోన్ ఎప్పటికీ  ఆన్ లోనే ఉంటుంది.  వాళ్లకు నేనెప్పుడూ నో చెప్పలేదు.  నాకు తెలిసి తర్వాతి ఐపీఎల్ వేలాన్ని నిర్వహించేది ఇండియాకు చెందిన వ్యక్తే అని నేను  బలంగా  నమ్ముతున్నాను...’ అని తెలిపాడు. 

PREV
click me!

Recommended Stories

IPL 2026 : ఆర్సీబీ, సీఎస్కే లక్కీ ఛాన్స్.. ముంబై, ఢిల్లీ కొట్టిన జాక్‌పాట్ డీల్స్ ఇవే !
T20 World Cup 2026 : టీమిండియాలో ముంబై ఇండియన్స్ హవా.. ఆర్సీబీ, రాజస్థాన్‌లకు మొండిచేయి !