INDvsWI 1st ODI: తొలి వన్డేలో టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీ... ఆఖరి ఓవర్ వరకూ సాగిన హైడ్రామా..

Published : Jul 23, 2022, 03:16 AM IST
INDvsWI 1st ODI: తొలి వన్డేలో టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీ... ఆఖరి ఓవర్ వరకూ సాగిన హైడ్రామా..

సారాంశం

ఆఖరి ఓవర్ వరకూ ఉత్కంఠభరితంగా సాగిన మొదటి వన్డేలో 3 పరుగుల తేడాతో విజయం అందుకున్న టీమిండియా... 

వెస్టిండీస్‌, టీమిండియా మధ్య జరిగిన తొలి వన్డే, అసలు సిసలు వన్డే మజాని అందించింది. ఆఖరి ఓవర్ వరకూ చేతులు మారుతూ పూర్తిగా 100 ఓవర్ల పాటు సాగిన తొలి వన్డేలో 3 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయం అందుకుని, సిరీస్‌లో బోణీ కొట్టింది భారత జట్టు.. 309 పరుగుల లక్ష్యఛేదనలో షై హోప్ వికెట్ త్వరగా కోల్పోయింది వెస్టిండీస్. 18 బంతుల్లో ఓ ఫోర్‌తో 7 పరుగులు చేసిన షై హోప్, సిరాజ్ బౌలింగ్‌లో శార్దూల్ ఠాకూర్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత కేల్ మేయర్స్, షమర్ బ్రూక్స్ కలిసి రెండో వికెట్‌కి 117 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. ప్రమాదకరంగా మారుతున్న ఈ భాగస్వామ్యాన్ని శార్దూల్ ఠాకూర్ విడదీశాడు...

61 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 46 పరుగులు చేసిన షమర్ బ్రూక్స్, శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో శ్రేయాస్ అయ్యర్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 68 బంతుల్లో 10 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 75 పరుగులు చేసిన కేల్ మేయర్స్ కూడా శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లోనే సంజూ శాంసన్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు...

వరుస ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయింది వెస్టిండీస్. ఈ దశలో నికోస పూరన్, బ్రెండన్ కింగ్ కలిసి నాలుగో వికెట్‌కి 51 పరుగులు జోడించారు. 26 బంతుల్లో 2 సిక్సర్లతో 25 పరుగులు చేసిన నికోలస్ పూరన్, సిరాజ్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు...

7 బంతుల్లో ఓ ఫోర్‌తో 6 పరుగులు చేసిన రోవ్‌మెన్ పావెల్‌ని యజ్వేంద్ర చాహాల్ అవుట్ చేశాడు. 40 ఓవర్లు ముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది వెస్టిండీస్. చాహాల్ వేసిన ఇన్నింగ్స్ 43వ ఓవర్‌లో 13 పరుగులు రావడంతో విండీస్ విజయానికి 42 బంతుల్లో 64 పరుగులు కావాల్సి వచ్చాయి... ఆ తర్వాతి ఓవర్‌లో ప్రసిద్ధ్ కృష్ణ 4 పరుగులే ఇచ్చాడు.

66 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 54 పరుగులు చేసిన బ్రెండన్ కింగ్, యజ్వేంద్ర చాహాల్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. ఆ ఓవర్‌లో 6 పరుగులు రావడంతో విండీస్ విజయానికి ఆఖరి 5 ఓవర్లలో 54 పరుగులు కావాల్సి వచ్చాయి...  46వ ఓవర్‌లో 7, 47వ ఓవర్‌లో 9 పరుగులు వచ్చాయి. దీంతో ఉత్కంఠ రేగింది. 48వ ఓవర్‌లో 11 పరుగులు రావడంతో ఉత్కంఠ కొనసాగింది. రెండు ఓవర్లలో 27 పరుగులు కావాల్సిన దశలో ప్రసిద్ధ్ కృష్ణ వేసిన 49వ ఓవర్ మొదటి బంతికే భారీ సిక్సర్ బాదాడు రొమారియో సిఫర్డ్. ఆ తర్వాతి బంతికి అంపైర్ అవుట్‌గా ప్రకటించినా రివ్యూ తీసుకుని బతికిపోయిన రొమారియో, మూడు బంతుల్లో 1 పరుగు మాత్రమే చేయగలిగాడు. 

ఆఖరి బంతికి ఫోర్ రావడంతో విండీస్ విజయానికి ఆఖరి ఓవర్‌లో 15 పరుగులు కావాల్సి వచ్చాయి. 50వ ఓవర్ వేసిన మహ్మద్ సిరాజ్ మొదటి బంతికి పరుగులేమీ ఇవ్వలేదు. రెండో బంతికి సింగిల్ తీసిన అకీల్ హుస్సేన్, సిఫర్డ్‌ని స్ట్రైయిక్ ఇచ్చాడు.

 

మూడో బంతికి ఫోర్ బాదిన రొమారియో సిఫర్డ్... నాలుగో బంతికి 2 పరుగులు తీశాడు. ఆ తర్వాతి బంతి వైడ్‌గా వెళ్లడంతో చివరి 2 బంతుల్లో 7 పరుగులు కావాల్సి వచ్చాయి. ఐదో బంతికి 2 పరుగులు తీసిన రొమారియో, ఆఖరి బంతికి 5 పరుగులు కావాల్సిన దశలో సింగిల్ మాత్రమే ఇచ్చిన సిరాజ్... భారత జట్టుకి విజయాన్ని అందించాడు. రొమారియో సిఫర్డ్ 25 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 39 పరుగులు, అకీల్ హుస్సేన్ 32 బంతుల్లో 2 ఫోర్లతో 33 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు.

అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో వికెట్లు కోల్పోయి పరుగుల భారీ స్కోరు చేసింది. శిఖర్ ధావన్ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకోగా ఓపెనర్‌గా వచ్చిన శుబ్‌మన్ గిల్, వన్‌డౌన్‌లో వచ్చిన శ్రేయాస్ అయ్యర్ హాఫ్ సెంచరీలతో మెరిశారు..

శిఖర్ ధావన్‌తో కలిసి తొలి వికెట్‌కి 18.4 ఓవర్లలో 119 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన శుబ్‌మన్ గిల్ 53 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 64 పరుగులు చేసి రనౌట్ అయ్యాడు... వెస్టిండీస్‌లో వన్డేల్లో అతి పిన్న వయసులో 50+ స్కోరు చేసిన భారత బ్యాటర్‌గా విరాట్ కోహ్లీ తర్వాతి స్థానంలో నిలిచాడు శుబ్‌మన్ గిల్... 

99 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లతో 97 పరుగులు చేసిన శిఖర్ ధావన్, గుడకేశ్ మోటీ బౌలింగ్‌లో షామర్‌ బ్రూక్స్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అంతర్జాతీయ కెరీర్‌లో 90+  స్కోర్ల వద్ద అవుట్ కావడం శిఖర్ ధావన్‌కి ఇది 10వ సారి. ఇంతకుముందు సచిన్ టెండూల్కర్ 27 సార్లు, రాహుల్ ద్రావిడ్ 12 సార్లు 90ల్లో అవుటయ్యి, శిఖర్ ధావన్ కంటే ముందున్నారు...

అతి పెద్ద వయసులో వన్డేల్లో హాఫ్ సెంచరీ చేసిన భారత కెప్టెన్‌గా సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు శిఖర్ ధావన్. ఇంతకుముందు 1999లో కెప్టెన్‌గా చివరి హాఫ్ సెంచరీ చేసినప్పుడు మహ్మద్ అజారుద్దీన్ వయసు 36 ఏళ్ల 120 రోజులు. ప్రస్తుతం ధావన్ వయసు 36 ఏళ్ల 229 రోజులు...

ధావన్ అవుటైన కొద్దిసేపటికే శ్రేయాస్ అయ్యర్ కూడా పెవిలియన్ చేరాడు. 57 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 54 పరుగులు చేసిన శిఖర్ ధావన్ కూడా గుడకేశ్ మోటీ బౌలింగ్‌లోనే పూరన్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.. 

నాలుగో స్థానంలో వచ్చిన సూర్యకుమార్ యాదవ్ 14 బంతుల్లో 2 ఫోర్లతో 13 పరుగులు చేసి అకీల్ హుస్సేన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. కెరీర్‌లో రెండో వన్డే ఆడుతున్న సంజూ శాంసన్ 18 బంతుల్లో ఓ సిక్సర్‌తో 12 పరుగులు చేసి రొమారియో షిఫర్డ్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరాడు...

దీపక్ హుడాతో కలిసి ఆరో వికెట్‌కి 42 పరుగుల భాగస్వామ్యం జోడించిన అక్షర్ పటేల్, 21 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 21 పరుగులు చేసి అల్జెరీ జోసఫ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు...

32 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 27 పరుగులు చేసిన దీపక్ హుడా కూడా అదే ఓవర్‌లో క్లీన్‌బౌల్డ్ రూపంలోనే పెవిలియన్ చేరాడు...

PREV
click me!

Recommended Stories

IPL : సన్‌రైజర్స్ హైదరాబాద్ గూటికి విధ్వంసకర వీరుడు.. 2026 ఐపీఎల్ కోసం కొత్త సైన్యం రెడీ !
IPL 2026 : కోట్లు కుమ్మరించిన సీఎస్కే ! ఎవరీ కార్తీక్ శర్మ, ప్రశాంత్ వీర్?