కోహ్లీ సెంచరీ.. రోహిత్, గిల్ సూపర్ షో.. లంక ఎదుట భారీ టార్గెట్

By Srinivas MFirst Published Jan 10, 2023, 5:15 PM IST
Highlights

INDvsSL ODI: శ్రీలంకతో తొలి వన్డేలో భారత బ్యాటర్లు  పరుగుల వరద పారించారు.   రన్ మిషీన్ విరాట్ కోహ్లీ సెంచరీతో కదం తొక్కగా ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభమన్ గిల్ లు  అదరగొట్టారు.  ఫలితంగా తొలి వన్డేలో భారత్ భారీ స్కోరు సాధించింది. 

వన్డే ప్రపంచకప్ మదిలో  ఉండగా ఈ ఏడాది తమ తొలి వన్డేలో భారత్ బ్యాటింగ్ లో దుమ్మురేపింది.  టాపార్డర్ బ్యాటర్లు దుమ్మురేపడంతో శ్రీలంకతో బర్సపర క్రికెట్ ప్టేడియంలో  జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా భారీ స్కోరు చేసింది. ఇటీవలే  బంగ్లాదేశ్ తో మూడో వన్డేలో సెంచరీ బాది జోరుమీదున్న టీమిండియా వెటరన్‌ విరాట్ కోహ్లీ (87 బంతుల్లో 113, 12 ఫోర్లు, 1 సిక్సర్) సెంచరీతో కదం తొక్కగా.. కెప్టెన్ రోహిత్ శర్మ (67 బంతుల్లో 83, 9 ఫోర్లు, 3 సిక్సర్లు), శుభమన్ గిల్ (60 బంతుల్లో 70, 11 ఫోర్లు) రాణించారు. ఫలితంగా  భారత్.. నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి  373 పరుగుల భారీ స్కోరు చేసింది. 

ఈ మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్ కు వచ్చిన భారత్ పవర్ ప్లేలోనే దుమ్ముదులిపింది. రోహిత్, గిల్ లు.. లంక బౌలర్లను ఆటాడుకున్నారు. ఇద్దరూ చూడచక్కని షాట్లతో అలరించారు. కసున్ రజిత వేసిన తొలి ఓవర్లోనే బౌండరీ బాదిన  హిట్‌మ్యాన్.. అతడే  వేసిన మూడో ఓవర్లో బ్యాక్ టు బ్యాక్ ఫోర్లు కొట్టాడు.    మరో ఎండ్ లో  శుభమన్ గిల్ కూడా  అదే విధంగా రెచ్చిపోయాడు. మధుశంక వేసిన  నాలుగో ఓవర్లో మూడు ఫోర్లు కొట్టాడు.

రజిత వేసిన ఇన్నింగ్స్ ఏడో ఓవర్లో రోహిత్ రెండు భారీ సిక్సర్లు బాదడంతో టీమిండియా స్కోరు 6.4 ఓవర్లలోనే 50 పరుగులు దాటింది.  ఆ తర్వాత బంతికి ఫోర్ కొట్టిన రోహిత్ మొత్తంగా ఆ ఓవర్లో 17 పరుగులు రాబట్టాడు. హసరంగ వేసిన 13 ఓవర్లో మూడో బంతికి ఫోర్ బాదిన హిట్‌మ్యాన్.. తన కెరీర్ లో 47వ అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.  41 బంతుల్లో అతడి అర్థ శతకం పూర్తయింది. 

వెల్లలగె వేసిన  15వ ఓవర్లో ఐదో బంతికి సింగిల్ తీయడం ద్వారా భారత్  వంద పరుగులు పూర్తయ్యాయి.  ఇక శనక వేసిన ఇన్నింగ్స్ 18వ ఓవర్లో  రెండో బంతికి సింగిల్ తీయడం ద్వారా  గిల్ కూడా హాఫ్  సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 51 బంతుల్లో అతడి అర్థ పెంచరీ పూర్తయింది. వన్డేలలో గిల్ కు ఇది ఐదో హాఫ్ సెంచరీ. 

అర్థ సెంచరీ పూర్తయిన వెంటనే  గిల్..  వెల్లలగె వేసిన 19వ ఓవర్లో హ్యాట్రిక్ ఫోర్లు బాదాడు.  తర్వాత శనక బౌలింగ్ లో తొలి బంతికే బౌండరీ బాదినా నాలుగో బంతికి వికెట్ల ముందు దొరికిపోయాడు. దీంతో  143 పరుగుల తొలి  వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది.   గిల్ ఔట్ అయిన కొద్దిసేపటికే  రోహిత్ కూడా  మధుశంక బౌలింగ్ లో  క్లీన్ బౌల్డ్ అయ్యాడు.  

రోహిత్ నిష్క్రమణ  తర్వాత వచ్చిన శ్రేయాస్ అయ్యర్ (24 బంతుల్లో 28, 3 ఫోర్లు, 1 సిక్సర్) కూడా ధాటిగానే ఆడాడు. మధుశంక వేసిన 26వ ఓవర్లో బ్యాక్ టు బ్యాక్ బౌండరీలు బాదిన అతడు.. హసరంగ వేసిన 29వ ఓవర్లో భారీ సిక్సర్  కొట్టాడు. కానీ ధనంజయ డిసిల్వ వేసిన తర్వాత ఓవర్లో   అవిష్క ఫెర్నాండోకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.  

అయ్యర్ నిష్క్రమించిన తర్వాత టీమిండియా స్కోరు వేగం కాస్త తగ్గింది. నాలుగైదు ఓవర్లు వేచి చూసిన తర్వాత రాహుల్ (29 బంతుల్లో 39, 4 ఫోర్లు, 1 సిక్సర్) ధనంజయ వేసిన 36వ ఓవర్లో భారీ సిక్సర్ బాదాడు. అంతకుముందు బంతికే  కోహ్లీ కూడా  సిక్సర్ బాది వన్డేలలో హాఫ్  సెంచరీ  పూర్తి చేసుకున్నాడు. తర్వాత ఓవర్లో కూడా 14 పరుగులొచ్చాయి.  రజిత వేసిన 41వ ఓవర్లో ఫోర్ కొట్టిన రాహుల్.. తర్వాత బంతికి బౌల్డ్ అయ్యాడు. 

 

𝐂𝐄𝐍𝐓𝐔𝐑𝐘 𝐍𝐎.𝟕𝟑 𝐟𝐨𝐫 𝐕𝐈𝐑𝐀𝐓 𝐊𝐎𝐇𝐋𝐈 🫡🫡

A brilliant hundred from as he brings up his 45th ODI ton.

Live - https://t.co/262rcUdafb pic.twitter.com/n1Kc9BCBwO

— BCCI (@BCCI)

కోహ్లీ సెంచరీ..

హార్ధిక్ పాండ్యా (14) ఎక్కువసేపు క్రీజులో నిలువలేదు.    అప్పటికే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న కోహ్లీ.. సెంచరీ దిశగా వడివడిగా అడుగులేశాడు. 90లలోకి వచ్చాక కాస్త నెమ్మదించిన రన్ మిషీన్.. రజిత వేసిన 47వ ఓవర్ తొలి బంతికి బౌండరీ బాది 99కు చేరాడు.  తర్వాత బంతికి లాంగాఫ్ దిశగా సింగిల్ తీసి వన్డేలలో 45వ సెంచరీ (మొత్తంగా 73వ శతకం) పూర్తి చేసుకున్నాడు. బంగ్లాతో మూడో వన్డేలో సెంచరీ తర్వాత అతడికి ఇది వరుసగా రెండో సెంచరీ. సెంచరీ తర్వాత  కోహ్లీ నిష్క్రమించడంతో భారత్ త్వరగా వికెట్లను కోల్పోయింది.  చివరికి నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 373 పరుగుల భారీ స్కోరు సాధించింది. 

click me!