INDvsSA 1st Test: విరాట్ కోహ్లీ మళ్లీ అదే తీరు... నాలుగు వికెట్లు కోల్పోయిన టీమిండియా...

By Chinthakindhi RamuFirst Published Dec 29, 2021, 4:24 PM IST
Highlights

India vs South Africa 1st Test: 18 పరుగులు చేసి అవుటైన విరాట్ కోహ్లీ... 79 పరుగుల వద్ద నాలుగు వికెట్లు కోల్పోయిన టీమిండియా...

విరాట్ కోహ్లీకి 71 వ సెంచరీ అసలు కలిసి రానట్టుగా ఉంది. సెంచూరియన్ టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో 35 పరుగులు చేసి అవుటైన విరాట్ కోహ్లీ, రెండో ఇన్నింగ్స్‌లో కూడా సెంచరీ మార్కును అందుకోలేకపోయాడు. 

ఓవర్‌నైట్ స్కోరు 16/1 వద్ద నాలుగో రోజు బ్యాటింగ్ మొదలెట్టిన భారత జట్టు, తొలి సెషన్‌లో రెండు వికెట్లు కోల్పోయింది. నైట్ వాచ్‌మెన్‌గా వచ్చిన శార్దూల్ ఠాకూర్ 26 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 10 పరుుగుల చేసి రబాడా బౌలింగ్‌లో ముల్దర్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు...

తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసి ఆకట్టుకున్న ఓపెనర్ కెఎల్ రాహుల్ 74 బంతుల్లో 4 ఫోర్లతో 23 పరుగులు చేసి లుంగి ఎంగిడి బౌలింగ్‌లో డీన్ ఎల్గర్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 

54 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయిన భారత జట్టు, 3 వికెట్ల నష్టానికి 79 పరుగులు చేసి లంచ్ బ్రేక్‌కి వెళ్లింది.  టీమిండియా సారథి విరాట్ కోహ్లీ ఆరంభం నుంచే తనదైన స్టైలో దూకుడుగా ఆడాడు. బౌండరీతో ఖాతా తెరిచిన విరాట్ కోహ్లీ 32 బంతుల్లో 4 ఫోర్లతో 18 పరుగులు చేశాడు...

లంచ్ బ్రేక్ తర్వాత మొదటి బంతికే కీపర్ క్వింటన్ డి కాక్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు విరాట్ కోహ్లీ. మార్కో జాన్సన్ బౌలింగ్‌లో మరోసారి అవుట్‌సైడ్ ఆఫ్ స్టంప్ దిశగా వెళ్తున్న బంతిని వెంటాడి, వికెట్ పారేసుకున్నాడు విరాట్...

గత ఏడాది సెంచరీ లేకుండానే ముగించిన విరాట్ కోహ్లీ, ఈ ఏడాదిని కూడా సెంచరీ మార్కు లేకుండానే ముగించినట్టైంది. 2009 తర్వాత వరుసగా 11 ఏళ్ల పాటు ప్రతీ ఏటా ఏదో ఓ ఫార్మాట్‌లో సెంచరీ చేస్తూ వచ్చిన విరాట్ కోహ్లీ, గత రెండేళ్లుగా ఆ మార్కును అందుకోలేకపోయాడు...

గత ఏడాది 19.33 సగటుతో అత్యంత దారుణమైన సగటు నమోదు చేసిన విరాట్ కోహ్లీ, ఈ ఏడాది దాన్ని కాస్త మెరుగుపర్చుకోగలిగాడు. ఈ ఏడాది 28.21 సగటుతో టెస్టుల్లో పరుగులు సాధించాడు కోహ్లీ...

90 ఓవర్ల పాటు సాగిన తొలి రోజు కేవలం 3 వికెట్లు మాత్రమే పడడం, రెండో రోజు వర్షార్ఫణం కావడంతో టెస్టు రిజల్ట్ వస్తుందా? రాదా? అనే అనుమానాలు రేగాయి. అయితే మూడో రోజు ఆటలో ఏకంగా 18 వికెట్లు పడడంతో మ్యాచ్ ఫలితం వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి...

సౌతాఫ్రికాను తొలి ఇన్నింగ్స్‌లో 197 పరుగులు చేసి, 130 పరుగుల ఆధిక్యం సంపాదించింది టీమిండియా. అయితే మూడో రోజే ఆలౌట్ అయ్యి, ప్రత్యర్థిని స్వల్ప స్కోరుకే ఆలౌట్ చేసి... మళ్లీ రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ మొదలెట్టిన భారత జట్టుకి ఆరంభంలో షాక్ తగిలింది.  14 బంతుల్లో 4 పరుగులు చేసిన మయాంక్ అగర్వాల్, మార్కో జాన్సెన్ బౌలింగ్‌లో డి కాక్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. షెడ్యూల్ సమయం ముగిసి పోవడంతో నైట్ వాచ్‌మెన్‌గా శార్దూల్ ఠాకూర్ వన్‌డౌన్‌లో వచ్చాడు. 

శార్దూల్ ఠాకూర్ 10 పరుగులు చేసి అవుట్ కాగా, ఆ వెంటనే కెఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ కూడా పెవిలియన్ చేరారు. 

click me!