INDvsSA 1st Test: సౌతాఫ్రికా ఆలౌట్, టీమిండియాకి ఆధిక్యం... షమీకి ఐదు వికెట్లు...

By Chinthakindhi RamuFirst Published Dec 28, 2021, 8:57 PM IST
Highlights

India vs South africa: తొలి ఇన్నింగ్స్‌లో 197 పరుగులకి సౌతాఫ్రికా ఆలౌట్... ఐదు వికెట్లు తీసిన మహ్మద్ షమీ... భారత జట్టుకి 130 పరుగుల ఆధిక్యం...

INDvsSA 1st Test:  సెంచూరియన్ టెస్టులో భారత జట్టు ఆధిపత్యం కొనసాగుతోంది. మూడో రోజు సెషన్‌లో ఏడు వికెట్లు తీసి, భారత జట్టును ఆలౌట్ చేసిన సౌతాఫ్రికా, బ్యాటింగ్‌లో మాత్రం తేలిపోయింది. తొలి ఇన్నింగ్స్‌లో 197 పరుగులకే ఆలౌట్ అయ్యింది సౌతాఫ్రికా. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో భారత జట్టుకి 130 పరుగుల ఆధిక్యం దక్కింది. 

ఇన్నింగ్స్ ఆరంభించిన సఫారీ జట్టు, 32 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. డి కాక్ ఇచ్చిన క్యాచ్‌ను కెఎల్ రాహుల్ అందుకుని ఉంటే వికెట్ల సంఖ్య 5కి చేరేదే...

మొదటి ఓవర్‌లోనే సౌతాఫ్రికా కెప్టెన్ డీన్ ఎల్గర్‌ను అవుట్ చేసి, సఫారీ జట్టుకి ఊహించని షాక్ ఇచ్చాడు జస్ప్రిత్ బుమ్రా... బుమ్రా బౌలింగ్‌లో వికెట్ కీపర్ రిషబ్ పంత్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు ఎల్గర్. 22 బంతుల్లో 3 ఫోర్లతో 15 పరుగులు చేసిన కీగన్ పీటర్సన్‌ను మహ్మద్ షమీ క్లీన్ బౌల్డ్ చేశాడు...

25 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది సౌతాఫ్రికా. ఆ తర్వాత అయిడిన్ మార్క్‌రమ్‌ 34 బంతుల్లో 3 ఫోర్లతో 13 పరుగులు చేసి మహ్మద్ షమీ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు...

రస్సీ వాన్ దేర్ దుస్సేన్ 18 బంతుల్లో 3 పరుగులు చేసి మహ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో అజింకా రహానేకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 32 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది సౌతాఫ్రకిా. దుస్సేన్ అవుటైన తర్వాతి బంతికే క్వింటన్ డి కాక్ ఇచ్చిన క్యాచ్‌ను కెఎల్ రాహుల్‌ ఒడిసి పట్టుకోలేకపోయాడు. దీంతో తృటిలో మరో వికెట్ చేజారింది...

గోల్డెన్ డకౌట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న క్వింటన్ డి కాక్, తెంబ భువుమాతో కలిసి ఐదో వికెట్‌కి 72 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. 63 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 34 పరుగులు చేసిన క్వింటన్ డి కాక్‌ను శార్దూల్ ఠాకూర్ క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత వియాన్ ముల్దార్ 33 బంతుల్లో 2 ఫోర్లతో 12 పరుగులు చేసి షమీ బౌలింగ్‌లో కీపర్ రిషబ్ పంత్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.  

103 బంతుల్లో 10 ఫోర్లతో 52 పరుగులు చేసిన భువుమా కూడా షమీ బౌలింగ్‌లో కీపర్ పంత్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత మార్కో జాన్సెన్, రబాడా కలిసి 8వ వికెట్‌కి 37 పరుగుల భాగస్వామ్యం జోడించారు. 

42 బంతుల్లో 3 ఫోర్లతో 19 పరుగులు చేసిన జాన్సెన్‌ను శార్దూల్ ఠాకూర్ ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేయగా, 45 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 25 పరుగులు చేసిన కగిసో రబాడాను షమ పెవిలియన్ చేర్చాడు. కేశవ్ మహారాజ్ 19 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 14 పరుగులు చేసి బుమ్రా బౌలింగ్‌లో అవుట్ కావడంతో 199 పరుగుల వద్ద సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌కి తెరపడింది. భారత జట్టుకి 128 పరుగుల ఆధిక్యం దక్కింది. 

ఐదు వికెట్లు తీసిన మహ్మద్ షమీ, టెస్టు కెరీర్‌లో 200 వికెట్లను పూర్తి చేసుకున్నాడు. ఇదే టెస్టులో బుమ్రా 100 టెస్టు వికెట్లను అధిగమించగా, రిషబ్ పంత్ అత్యంత వేగంగా 100 వికెట్లలో భాగం పంచుకున్న భారత వికెట్ కీపర్‌గా ధోనీ రికార్డును అధిగమించాడు.

click me!