
ఇండియా-న్యూజీలాండ్ మధ్య జరుగుతున్న మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దవగా రెండో మ్యాచ్ మాత్రం ఎటువంటి ఆటంకం లేకుండా సాగుతున్నది. బే ఓవల్ లోని మౌంట్ మంగ్వానుయ్ వేదికగా జరుగుతున్న రెండో టీ20లో టాస్ గెలిచిన కేన్ విలియమ్సన్ సారథ్యంలోని న్యూజిలాండ్ జట్టు ముందు తొలుత బౌలింగ్ ఎంచుకుంది. హార్ధిక్ పాండ్యా సారథ్యంలోని భారత జట్టు ముందు బ్యాటింగ్ చేయనుంది. టీ20 ప్రపంచకప్ లో సెమీస్ ఓటమి తర్వాత ఇరు జట్లు ఆడుతున్న తొలి మ్యాచ్ ఇదే కావడంతో ప్రేక్షకులు ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు.
ఇరు జట్ల మధ్య వర్షం కారణంగా తొలి మ్యాచ్ రద్దైన విషయం తెలిసిందే. దీంతో ఈ సిరీస్ లో రెండు మ్యాచ్ లే మిగిలాయి. ఈ మ్యాచ్ లో గెలిచి సిరీస్ లో పై చేయి సాధించాలని ఇరు జట్లూ భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మ్యాచ్ ఎవరు గెలుస్తారా..? అని క్రికెట్ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.
ఇక ఈ మ్యాచ్ లో కొత్త కెప్టెన్ హార్ధిక్ పాండ్యా సారథ్యంలో బరిలోకి దిగుతున్న భారత్.. యంగ్ టీమ్ తో ఆడుతున్నది. టీ20 ప్రపంచకప్ లో చోటు దక్కించుకోని సంజూ శాంసన్, హర్షల్ పటేల్ లకు ఈ మ్యాచ్ లో కూడా ఆడే అవకాశం రాలేదు.
తుది జట్లు :
టీమిండియా : హార్ధిక్ పాండ్యా (కెప్టెన్), రిషభ్ పంత్, ఇషాన్ కిషన్, దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, వాషింగ్టన్ సుందర్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్, భువనేశ్వర్ కుమార్
న్యూజీలాండ్ : కేన్ విలియమ్సన్ (కెప్టెన్), ఫిన్ అలెన్, డెవాన్ కాన్వే, గ్లెన్ ఫిలిప్స్, డారిల్ మిచెల్, జేమ్స్ నీషమ్, మిచెల్ సాంట్నర్, ఇష్ సోది, టిమ్ సౌథీ, ఆడమ్ మిల్నే, లాకీ ఫెర్గూసన్