INDvsNZ 2nd ODI: ఆగని వాన! రెండో వన్డే రద్దు... సూర్య టచ్‌లోకి రాగానే వరుణుడి రీఎంట్రీ..

By Chinthakindhi RamuFirst Published Nov 27, 2022, 1:16 PM IST
Highlights

వర్షం కారణంగా రెండో వన్డే రద్దు... 12.5 ఓవర్లలో 89 పరుగులు చేసిన టీమిండియా... మూడో వన్డే విజయంపైనే ఆధారపడిన సిరీస్ ఫలితం.. 

పడుతూ ఆగుతూ ఇరుజట్లను ఇబ్బంది పెట్టిన వాన, హామిల్టన్ వన్డే రద్దు అయ్యేలా చేసింది. 4.5 ఓవర్ల తర్వాత తొలి సారి ఆటకు అంతరాయం కలిగించింది వర్షం. సుదీర్ఘ విరామం తర్వాత తిరిగి ప్రారంభమైనా పూర్తిగా సాగలేదు. 12.5 ఓవర్ల తర్వాత మళ్లీ వాన కురవడంతో కొద్దిసేపు వేచి చూసిన అంపైర్లు... మ్యాచ్‌ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు... వర్షం కారణంగా మ్యాచ్ రద్దయ్యే సమయానికి 12.5 ఓవర్లలో వికెట్ నష్టానికి 89 పరుగులు చేసింది భారత జట్టు...

పిచ్ అవుట్ ఫీల్డ్ చిత్తడిగా మారడంతో  15 నిమిషాలు ఆలస్యంగా టాస్ జరిగింది. విలువైన సమయం కోల్పోకుండా  టాస్ జరిగిన 15 నిమిషాలకే ఆట ప్రారంభమైంది. అయితే సజావుగా 5 ఓవర్లు కూడా ఆడకముందే మరోసారి వరుణుడు పలకరించాడు. 

టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన భారత జట్టు, వర్షం కారణంగా మ్యాచ్ నిలిచే సమయానికి 4.5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 22 పరుగులు చేసింది...గత మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేసిన శుబ్‌మన్ గిల్ 21 బంతుల్లో 3 ఫోర్లతో 19 పరుగులు చేయగా కెప్టెన్ శిఖర్ ధావన్ 8 బంతుల్లో 2 పరుగులు చేశాడు. 

వర్షం కారణంగా దాదాపు మూడున్నర గంటల పాటు ఆట నిలిచిపోయింది. వర్షం ఆగిందని తిరిగి ఆట ప్రారంభించేందుకు అంపైర్లు ఏర్పాట్లు చేయడం, సరిగ్గా పిచ్ పరిశీలనకు వచ్చే ముందు తిరిగి వాన కురవడం... కవర్లు పిచ్‌పైకి చేరడం జరుగుతూ వచ్చాయి. మాటిమాటికి వర్షం అంతరాయం కలిగిస్తుండడంతో ఇక మ్యాచ్ సాగడం కష్టమేనని భావించి స్టేడియానికి వచ్చిన చాలా మంది అభిమానులు, ఇళ్లకు పయనమయ్యారు కూడా...

అయితే ఎట్టకేలకు సుదీర్ఘ విరామం తర్వాత ఆట తిరిగి ప్రారంభమైంది. మూడున్నర గంటలకు పైగా సమయం నష్టపోవడంతో ఓవర్లను కుదించిన అంపైర్లు, 29 ఓవర్ల పాటు మ్యాచ్‌ని నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఆట ప్రారంభమైన తర్వాత రెండో బంతికే తొలి వికెట్ కోల్పోయింది భారత జట్టు....

10 బంతుల్లో 3 పరుగులు చేసిన శిఖర్ ధావన్, మ్యాట్ హెన్రీ బౌలింగ్‌లో లూకీ ఫర్గూసన్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఓవర్లు తక్కువగా ఉండడంతో వన్‌డౌన్‌లో సూర్యకుమార్ యాదవ్‌ని బ్యాటింగ్‌కి పంపించింది భారత జట్టు. శుబ్‌మన్ గిల్ 42 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 45 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవగా సూర్యకుమార్ యాదవ్ 25 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 34 పరుగులు చేశాడు...

కొన్నాళ్లుగా వన్డేల్లో పేలవ ప్రదర్శన కొనసాగిస్తున్న సూర్య మంచి టచ్‌లోకి వచ్చి, భారీ స్కోరు చేసేలా కనిపిస్తుండగానే వర్షం మరోసారి పలకరించింది. రెండో వన్డే రద్దు కావడంతో మూడో వన్డేలో గెలుపుపైనే సిరీస్ ఫలితం ఆధారపడి ఉంది. తొలి వన్డేలో ఓడిన టీమిండియా, ఆఖరి వన్డేలో గెలిస్తే సిరీస్‌ని డ్రా చేయగలుగుతుంది. మూడో వన్డే వర్షం కారణంగా రద్దు అయితే 1-0 తేడాతో సిరీస్ న్యూజిలాండ్ సొంతం చేసుకుంటుంది. 

click me!