INDvsNZ 2nd ODI: తిరిగి ప్రారంభమైన ఆట... ఓవర్లు కుదింపు! శిఖర్ ధావన్ అవుట్...

By Chinthakindhi RamuFirst Published Nov 27, 2022, 11:33 AM IST
Highlights

వర్షం కారణంగా 29 ఓవర్లకు మ్యాచ్‌ని కుదించిన అంపైర్లు... ఆట తిరిగి ప్రారంభమైన వెంటనే శిఖర్ ధావన్ వికెట్ కోల్పోయిన భారత జట్టు... వన్‌డౌన్‌లో సూర్యకుమార్ యాదవ్.. 

హామిల్టన్ వన్డే సుదీర్ఘ విరామం తర్వాత తిరిగి ప్రారంభమైంది. పిచ్ అవుట్ ఫీల్డ్ చిత్తడిగా మారడంతో  15 నిమిషాలు ఆలస్యంగా టాస్ జరిగింది. విలువైన సమయం కోల్పోకుండా  టాస్ జరిగిన 15 నిమిషాలకే ఆట ప్రారంభమైంది. అయితే సజావుగా 5 ఓవర్లు కూడా ఆడకముందే మరోసారి వరుణుడు పలకరించాడు. 

టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన భారత జట్టు, వర్షం కారణంగా మ్యాచ్ నిలిచే సమయానికి 4.5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 22 పరుగులు చేసింది...గత మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేసిన శుబ్‌మన్ గిల్ 21 బంతుల్లో 3 ఫోర్లతో 19 పరుగులు చేయగా కెప్టెన్ శిఖర్ ధావన్ 8 బంతుల్లో 2 పరుగులు చేశాడు. 

వర్షం కారణంగా దాదాపు మూడున్నర గంటల పాటు ఆట నిలిచిపోయింది. వర్షం ఆగిందని తిరిగి ఆట ప్రారంభించేందుకు అంపైర్లు ఏర్పాట్లు చేయడం, సరిగ్గా పిచ్ పరిశీలనకు వచ్చే ముందు తిరిగి వాన కురవడం... కవర్లు పిచ్‌పైకి చేరడం జరుగుతూ వచ్చాయి. మాటిమాటికి వర్షం అంతరాయం కలిగిస్తుండడంతో ఇక మ్యాచ్ సాగడం కష్టమేనని భావించి స్టేడియానికి వచ్చిన చాలా మంది అభిమానులు, ఇళ్లకు పయనమయ్యారు కూడా...

అయితే ఎట్టకేలకు సుదీర్ఘ విరామం తర్వాత ఆట తిరిగి ప్రారంభమైంది. మూడున్నర గంటలకు పైగా సమయం నష్టపోవడంతో ఓవర్లను కుదించిన అంపైర్లు, 29 ఓవర్ల పాటు మ్యాచ్‌ని నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఆట ప్రారంభమైన తర్వాత రెండో బంతికే తొలి వికెట్ కోల్పోయింది భారత జట్టు....

10 బంతుల్లో 3 పరుగులు చేసిన శిఖర్ ధావన్, మ్యాట్ హెన్రీ బౌలింగ్‌లో లూకీ ఫర్గూసన్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. గత మ్యాచ్‌లో 77 బంతుల్లో 13 ఫోర్లతో 72 పరుగులు చేసి కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో మెప్పించిన శిఖర్ ధావన్, సిరీస్ నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో మాత్రం సింగిల్ డిజిట్ స్కోరుకే అవుటై తీవ్రంగా నిరాశపరిచాడు...

ఓవర్లు తక్కువగా ఉండడంతో వన్‌డౌన్‌లో సూర్యకుమార్ యాదవ్‌ని బ్యాటింగ్‌కి పంపించింది భారత జట్టు. 7 ఓవర్లు ముగిసే సమయానికి వికెట్ నష్టపోయి 34 పరుగులు చేసింది భారత జట్టు. ఇంకా 22 ఓవర్లు మిగిలి ఉండడంతో టీమిండియా, వన్డే సిరీస్ కోల్పోకుండా ఉండాలంటే కనీసం 210-250+ పరుగుల స్కోరును కివీస్ ముందు పెట్టాల్సి ఉంటుంది.. 

click me!