
మూడో టెస్టులో ఇంగ్లాండ్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 432 పరుగుల భారీ స్కోరు చేసి ఆలౌట్ అయ్యింది. భారత తొలి ఇన్నింగ్స్ కంటే 354 పరుగుల భారీ ఆధిక్యం దక్కించుకుంది ఇంగ్లాండ్. తొలి ఇన్నింగ్స్‌లో భారత బ్యాట్స్‌మెన్‌లో ఎవ్వరూ 20 పరుగుల మార్కు అందుకోలేకపోతే, ఇంగ్లాండ్ బ్యాటింగ్‌లో 8వ స్థానంలో వచ్చిన ఓవర్టన్ 32 పరుగులు చేసి భారత బౌలర్లను విసిగించడం విశేషం...
ఓవర్‌నైట్ స్కోర్ 423/8 వద్ద మూడో రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లాండ్ జట్టు, 432 పరుగులకి ఆలౌట్ అయ్యింది. 42 బంతుల్లో 6 ఫోర్లతో 32 పరుగులు చేసిన క్రెగ్ ఓవర్టన్‌ను షమీ ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేయగా... రాబిన్‌సన్‌ను బుమ్రా బౌల్డ్ చేశాడు.
భారత బౌలర్లలో మహ్మద్ షమీకి నాలుగు వికెట్లు దక్కగా, మహ్మద్ సిరాజ్, రవీంద్ర జడేజా, జస్ప్రిత్ బుమ్రా రెండేసి వికెట్లు తీసుకున్నారు. సీనియర్ బౌలర్ ఇషాంత్ శర్మ వికెట్లేమీ దక్కలేదు...
ఇంగ్లాండ్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్లు రోరీ బర్న్స్ 61, హసీబ్ హమీద్ 68 పరుగులు చేసి తొలి వికెట్‌కి 135 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పగా, డేవిడ్ మలాన్ 70 పరుగులు చేశాడు. కెప్టెన్ జో రూట్ మరోసారి సెంచరీతో అదరగొట్టి 165 బంతుల్లో 14 ఫోర్లతో 121 పరుగులు చేశాడు...