INDvsBAN 3rd ODI: మరోసారి టాస్ గెలిచిన బంగ్లాదేశ్... పరువు కోసం టీమిండియా పోరాటం...

By Chinthakindhi RamuFirst Published Dec 10, 2022, 11:07 AM IST
Highlights

మూడో వన్డేలో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్... రాహుల్ త్రిపాఠి, రజత్ పటిదార్‌లకు మరోసారి నిరాశే!  ఇషాన్ కిషన్, కుల్దీప్ యాదవ్‌లకు ఛాన్స్.. 

బంగ్లాదేశ్ పర్యటనలో టీమిండియా మ్యాచులు మాత్రమే కాదు, టాస్ కూడా గెలవలేకపోతోంది. తొలి రెండు వన్డేల్లో టాస్ ఓడిపోయిన భారత జట్టు, మూడో వన్డేలోనూ టాస్ ఓడింది. ఛట్టోంగ్రామ్‌లో జరుగుతున్న మూడో వన్డేలో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ బౌలింగ్ ఎంచుకుంది. టీమిండియా తొలుత బ్యాటింగ్ చేయనుంది..

ఛట్టోంగ్రామ్‌లో టీమిండియా ఇప్పటిదాకా ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. కాబట్టి కొత్త పిచ్‌లో భారత జట్టు బ్యాటర్లు, బౌలర్లు ఎలా రాణిస్తారనేది ఆసక్తికరంగా మారింది. టీమిండియాకి ఈ ఏడాదిలో ఇదే ఆఖరి వైట్ బాల్ గేమ్ కూడా కావడం విశేషం... సౌతాఫ్రికా టూర్‌లో మూడు వన్డేల్లో ఓడి 2022 ఏడాదిని ప్రారంభించిన భారత జట్టు, బంగ్లా టూర్‌లో మొదటి రెండు వన్డేల్లోనూ ఓడింది. కనీసం ఆఖరి మ్యాచ్‌లో గెలిచి, విజయంతో ఈ ఏడాదిలో వైట్ బాల్ క్రికెట్‌ని ముగించాలని భావిస్తోంది భారత జట్టు.. 

బంగ్లాదేశ్ పర్యటనలో మొదటి రెండు వన్డేల్లో ఓడి సిరీస్ కోల్పోయిన భారత జట్టు, ఆఖరి వన్డేలో గెలిచి పరువు కాపాడుకోవాలని భావిస్తోంది. టాపార్డర్ వైఫల్యంతో పాటు చెత్త ఫీల్డింగ్‌‌తో భారీ మూల్యం చెల్లించుకున్న భారత జట్టును గాయాలు కూడా వెంటాడుతూ వేధిస్తున్నాయి... భారత కెప్టెన్ రోహిత్ శర్మ గాయం కారణంగా తప్పుకోవడంతో మూడో వన్డేకి కెఎల్ రాహుల్ సారథిగా వ్యవహరిస్తున్నాడు.

రెండో వన్డేలో గాయపడిన దీపక్ చాహార్ స్థానంలో సీనియర్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌కి అవకాశం ఇచ్చిన టీమిండియా... రోహిత్ శర్మ స్థానంలో ఇషాన్ కిషన్‌ని తుది జట్టులోకి తీసుకొచ్చింది. బంగ్లాదేశ్‌లో వన్డే సిరీస్‌కి ఎంపికైన రాహుల్ త్రిపాఠి, రజత్ పటిదార్.. మరోసారి నిరాశగా స్వదేశం చేరబోతున్నారు. గత ఏడాదిగా రాహుల్ త్రిపాఠిని సెలక్ట్ చేస్తున్నా, ఒక్క మ్యాచ్ ఆడే అవకాశం కూడా ఇవ్వకుండా రిజర్వు బెంచ్‌కే పరిమితం చేస్తోంది టీమిండియా...

తొలి రెండు వన్డేల్లో ఫెయిల్ అయిన శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీలపై భారీ అంచనాలే పెట్టుకుంది టీమిండియా. రోహిత్ శర్మ గాయపడడంతో రెండో వన్డేలో ఓపెనర్‌గా వచ్చిన విరాట్ కోహ్లీ, ఇషాన్ కిషన్ ఎంట్రీ ఇవ్వడంతో నేటి మ్యాచ్‌లో వన్‌డౌన్‌లోనే బ్యాటింగ్ రాబోతున్నాడు. గాయం కారణంగా తొలి రెండు వన్డేలకు దూరంగా ఉన్న బంగ్లా స్టార్ బౌలర్ టస్కీన్ అహ్మద్, నేటి మ్యాచ్ ద్వారా రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు. 

భారత జట్టు: శిఖర్ ధావన్, ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్

 బంగ్లాదేశ్ జట్టు: అనమోల్ హక్, లిటన్ దాస్, షకీబ్ అల్ హసన్, ముస్తిఫికర్ రహీం, మహ్మదుల్లా, అఫిఫ్ హుస్సేన్, మెహిదీ హసన్ మిరాజ్, ఎబదత్ హుస్సేన్, ముస్తాఫిజుర్ రహ్మాన్, టస్కిన్ అహ్మద్ 

click me!