
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులో తొలిసారి బ్యాటింగ్ కు అనుకూలిస్తున్న పిచ్ పై ఆసీస్ బ్యాటర్లు పండుగ చేసుకున్నారు. ఈ సిరీస్ లో సెంచరీ ముఖం చూడని కంగారు బ్యాటర్లు ఈసారి పరుగుల వరద పారించారు. ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా (180) డబుల్ సెంచరీ దగ్గరిదాకా వచ్చాడు. కామెరూన్ గ్రీన్ (114) సెంచరీతో చెలరేగాడు. ఆఖరికి 8వ వికెట్ గా వచ్చిన స్పిన్నర్ టాడ్ మర్ఫీ (41) తో పాటు నాథన్ లియాన్ (34) లను ఔట్ చేయడానికి భారత బ్యాటర్లు నానా తంటాలు పడ్డారు. మరి ఆసీస్ బ్యాటర్లు జిడ్డులా ఉండిపోయిన అహ్మదాబాద్ పిచ్‌పై భారత బ్యాటర్లు రాణిస్తారా..?
సిరీసీ లో ఇంతవరకు 300 స్కోరు చేయని ఆస్ట్రేలియా.. ఇప్పుడు ఏకంగా 480 పరుగులు చేయడంతో భారత బ్యాటింగ్ లైనప్ పై భారీ భారమే పడింది. ముఖ్యంగా భారత బ్యాటింగ్ దిగ్గజాలు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, ఛటేశ్వర్ పుజారాలు ఈ మ్యాచ్ లో రాణించడం అత్యావశ్యకం.. అవసరం కూడా..
సిరీస్ లో రోహిత్ తప్ప..
ఈ ముగ్గురిలో రోహిత్ శర్మ ఒక్కడే తొలి టెస్టులో సెంచరీతో కాస్త మెరుగ్గా రాణించాడు. కోహ్లీ, పుజారాలు దారుణంగా విఫలమవుతున్నారు. నాగ్‌పూర్ టెస్టులో రోహిత్ సెంచరీ (120) చేయగా.. పుజారా 7, కోహ్లీ 12 పరుగులే చేసి విఫలమయ్యారు. ఢిల్లీ టెస్టులో రోహిత్ మొదటి ఇన్నింగ్స్ లో 32 పరుగులే చేయగా పుజారా డకౌట్ అయ్యాడు. కోహ్లీ 44 రన్స్ చేశాడు. రెండో ఇన్నింగ్స్ లో హిట్‌మ్యాన్ 31 రన్స్ చేయగా కోహ్లీ 20, పుజారా 31 రన్స్ చేశారు. ఇక ఇండోర్ టెస్టులో రోహిత్ రెండు ఇన్నింగ్స్ లలో 24 రన్స్, పుజారా 60, కోహ్లీ 35 పరుగులే చేశారు.
మరి అహ్మదాబాద్ లో అయినా..
కంగారూ బ్యాటర్లలో తోక (లోయరార్డర్ బ్యాటర్లు) ను కత్తిరించడానికి ప్రపంచ నెంబర్ వన్ బౌలర్ అశ్విన్, నెంబర్ వన్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాలు నానా తంటాలు పడ్డారంటే పిచ్ బ్యాటింగ్ కు ఎంత సహకరిస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఇటువంటి పిచ్ లంటే సాధారణంగానే రెచ్చిపోయి ఆడే భారత బ్యాటర్లు ఈ మ్యాచ్ లో భారీ స్కోర్లు చేస్తేనే నాలుగో టెస్టులో భారత్ మెరుగైన స్థితిలో నిలుస్తుంది. అలాగాక తొలి మూడు టెస్టులలో విఫలమైనట్టుగానే ఆడితే ఇక అంతే సంగతులు.
అసలే కోహ్లీ టెస్టులలో సెంచరీ చేయక మూడేండ్లు దాటింది. పరిమిత ఓవర్ల క్రికెట్ లో ట్రాక్ లోకి వచ్చిన కోహ్లీ టెస్టులలో మాత్రం ఇంకా ఆ లయను అందుకోలేదు. ఇక ఇటీవలే వంద టెస్టులను పూర్తి చేసుకున్న పుజారా తన మునపటి ఆటను మరిచిపోయాడా..? లేక వయసు మీద పడి ఆడటం లేదా..? తెలియదు గానీ 2017లో రాంచీలో ఆడినట్టు (డబుల్ సెంచరీ చేశాడు) ఆడి కంగారూలకు కంగారు పుట్టించాలి. సారథిగా హిట్‌మ్యాన్ టీమ్ కు స్ఫూర్తినిచ్చే ఇన్నింగ్స్ ఆడటం ఎంతో అవసరం.
పిచ్ బ్యాటింగ్ కు అనుకూలంగా ఉండటం సానుకూలాంశమే అయినప్పటికీ గత మ్యాచ్ లలో ఆడినట్టు ఆడి వికెట్ పారేసుకుంటే మాత్రం ఈ ముగ్గురిపై విమర్శల జడివాన తప్పదు. తొలి రెండు టెస్టులలో అంటే ఏదో స్పిన్నర్ల పుణ్యాన గెలిచింది కాబట్టి ఎవరూ వ్యక్తిగత ప్రదర్శనల జోలికి పోలేదు. కానీ బ్యాటింగ్ కు అనుకూలించే పిచ్ పై కూడా విఫలమైతే రోహిత్, కోహ్లీ, పుజారాలను సోషల్ మీడియాలో కెఎల్ రాహుల్ కంటే దారుణంగా ఆడుకుంటారు నెటిజనులు.. ఇక మాజీ క్రికెటర్లు, విశ్లేషకుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు.
వీళ్లు కూడా..
ఈ బ్యాటింగ్ త్రయంతో పాటు యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్, శ్రేయాస్ అయ్యర్ ల మీద కూడా భారత్ భారీ ఆశలు పెట్టుకుంది. పంత్ గాయంతో టీమ్ లో లక్కీగా ఛాన్స్ కొట్టేసినా అసలు ఎందుకు ఆడుతున్నాడో తనకైనా తెలుసో లేదో అన్నట్టుగా ఆడుతున్న ఆంధ్రా కుర్రాడు కెఎస్ భరత్ కు కూడా ఇదే ఆఖరి ఛాన్స్. వీరికి తోడు రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, అశ్విన్ లు కూడా ఆపద్బాంధవుల పాత్ర పోషిస్తే అహ్మదాబాద్ లో ఆసీస్ పై పైచేయి సాధించడం పెద్ద కష్టమేమీ కాదు. కానీ మన ప్రపంచ స్థాయి బ్యాటర్లు ఎలా ఆడతారో చూడాలి మరి..!