
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2023 సీజన్‌లో తొలి రెండు టెస్టుల్లో టాస్ ఓడిన రోహిత్ శర్మ, ఎట్టకేలకు మూడో టెస్టులో టాస్ గెలిచాడు. ఇండోర్‌లో జరుగుతున్న మూడో టెస్టులో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు...
తొలి రెండు టెస్టుల్లో ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ చేసింది. ఆ రెండు టెస్టులు కూడా రెండున్నర రోజుల్లోనే ముగిసిపోయాయి. భారత జట్టు తొలుత బ్యాటింగ్ చేస్తుండడంతో మూడో టెస్టుపై భారీ అంచనాలే పెట్టుకున్నారు అభిమానులు..
తొలి రెండు టెస్టుల్లో ఘోరంగా విఫలమైన కెఎల్ రాహుల్, మూడో టెస్టులో చోటు కోల్పోయాడు. అతని స్థానంలో శుబ్‌మన్ గిల్‌కి అవకాశం దక్కింది. అలాగే మహ్మద్ షమీకి విశ్రాంతినిచ్చిన టీమిండియా మేనేజ్‌మెంట్, ఉమేశ్ యాదవ్‌కి తుది జట్టులోకి తీసుకొచ్చింది..
ఆస్ట్రేలియా కూడా రెండు మార్పులతో బరిలో దిగుతోంది. టెస్టు కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ స్వదేశానికి వెళ్లిపోవడంతో అతని స్థానంలో మిచెల్ స్టార్క్ తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు. నేటి మ్యాచ్‌కి టెస్టు మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ సారథిగా వ్యవహరించబోతున్నాడు. రెండో టెస్టులో గాయపడిన డేవిడ్ వార్నర్ స్థానంలో కామెరూన్ గ్రీన్ తుది జట్టులోకి వచ్చాడు.
తొలి రెండు టెస్టుల్లో 7 వికెట్లు తీసి అత్యధిక వికెట్లు తీసిన ఫాస్ట్ బౌలర్‌గా నిలిచిన మహ్మద్ షమీకి విశ్రాంతినిస్తున్నట్టు ప్రకటించాడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ. రెండో టెస్టు ముగిసిన తర్వాత తండ్రిని కోల్పోయిన ఉమేశ్ యాదవ్, అంత్యక్రియల్లో పాల్గొన్న తర్వాత తిరిగి జట్టుతో కలిశాడు. స్వదేశంలో ఉమేశ్ యాదవ్‌కి మంచి రికార్డు ఉంది.
ఉస్మాన్ ఖవాజాతో కలిసి ట్రావిస్ హెడ్ ఓపెనింగ్ చేయబోతున్నాడు. మిడిల్ ఆర్డర్‌లో కామెరూన్ గ్రీన్ చేరికతో ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఆర్డర్ పటిష్టంగా మారింది. చేతి వేలి గాయంతో బాధపడుతున్న కామెరూన్ గ్రీన్ బౌలింగ్ చేస్తాడా? లేదా? అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది.
మొదటి రెండు టెస్టుల్లో ఓడిన ఆస్ట్రేలియా, సిరీస్‌ని సమం చేయాలంటే మిగిలిన రెండు టెస్టులు గెలవాల్సిందే. మరోవైపు తొలి రెండు టెస్టుల్లో నెగ్గిన భారత జట్టు, ఈ మ్యాచ్ గెలిస్తే సిరీస్ సొంతం చేసుకుంటుంది. అలాగే ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో టాప్‌లోకి ఎగబాకుతుంది. అదీకాకుండా ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కి నేరుగా అర్హత సాధిస్తుంది.
ఇన్ని ప్రత్యేకతలు ఉండడంతో ఇండోర్ టెస్టుపై అంచనాలు పెరిగిపోయాయి. వన్డేల్లో డబుల్ సెంచరీ, టీ20ల్లో సెంచరీ బాది బీభత్సమైన ఫామ్‌లో ఉన్న శుబ్‌మన్ గిల్ తుది జట్టులో చోటు దక్కించుకోవడంతో టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ కూడా బలం పుంజుకుంది..
ఆస్ట్రేలియా జట్టు: ఉస్మాన్ ఖవాజా, ట్రావిస్ హెడ్, మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్, పీటర్ హ్యాండ్స్‌కోంబ్, కామెరూన్ గ్రీన్, అలెక్స్ క్యారీ, మిచెల్ స్టార్క్, నాథన్ లియాన్, టాడ్ ముర్ఫీ, మాథ్యూ కుహ్నేమన్
భారత జట్టు: రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్, ఛతేశ్వర్ పూజారా, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, రవీంద్ర జడేజా, శ్రీకర్ భరత్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, ఉమేశ్ యాదవ్, మహ్మద్ సిరాజ్