గిల్‌కు గాయం.. కొద్దిసేపు ఆగొచ్చుగా అంటూ గవాస్కర్ ఆగ్రహం

Published : Mar 01, 2023, 12:44 PM IST
గిల్‌కు గాయం.. కొద్దిసేపు ఆగొచ్చుగా అంటూ గవాస్కర్ ఆగ్రహం

సారాంశం

INDvsAUS 3rd Test:  బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో  భాగంగా ఇండోర్ లో భారత్ - ఆస్ట్రేలియా మధ్య   జరుగుతున్న మూడో టెస్టులో  టీమిండియా తడబడుతోంది. ఈ మ్యాచ్  లో రాహుల్ స్థానంలో వచ్చిన గిల్ గాయపడ్డాడు. 

మూడో టెస్టులో కెఎల్ రాహుల్ స్థానంలో  తుది జట్టులో చోటు దక్కించుకున్న యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ కు గాయమైంది. భారత జట్టు స్కోరు  32-1 వద్ద ఉండగా గిల్  గాయపడ్డాడు. స్టార్క్ వేసిన  భారత్ ఇన్నింగ్స్ ఆరో ఓవర్లో   మూడో బంతికి గిల్ పరుగుతీశాడు. ఈ క్రమంలో   అతడు  ముందుకు డైవ్ చేస్తుండగా  పొత్తి కడుపు కింద గాయమైంది. డైవ్ చేసే క్రమంలో చర్మం ఊడొచ్చి గిల్ ఇబ్బందిపడ్డాడు. 

అదే సమయంలో  గిల్  సాయం కోసం  డ్రెస్సింగ్ రూమ్  వైపునకు చూశాడు. దీంతో టీమిండియా మెడికల్ టీమ్..  హుటాహుటిన వచ్చి అతడికి  గాయానికి చికిత్స చేసింది. అయితే దీనిని టీమిండియా దిగ్గజ క్రికెటర్  సునీల్ గవాస్కర్ తప్పుబట్టాడు. మరో రెండు బంతులాగితే ఓవర్ ముగిసేదని, అప్పుడు మెడికల్ సిబ్బందిని పిలిస్తే బాగుండేదని చెప్పాడు. 

గిల్ కు గాయమై అతడు  చికిత్స తీసుకుంటుండగా కామెంట్రీ బాక్స్ లో ఉన్న గవాస్కర్ మాట్లాడుతూ... ‘డైవ్ చేస్తుండగా  గిల్ కు గాయమైంది.   అదేం పెద్ద గాయం కాదని కనిపిస్తూనే ఉంది. గిల్ కొంతసేపు వేచి ఉంటే బాగుండేది.  ఎందుకంటే పైన ఎండ మండుతోంది.  ఫాస్ట్ బౌలర్ బౌలింగ్ చేస్తున్నాడు. అప్పటికీ నాలుగు బంతులు పడ్డాయి. మరో రెండు బంతులైతే ఓవర్ అయిపోయేది. అప్పుడు అతడు తీరిగ్గా చికిత్స చేయించుకున్నా వచ్చిన నష్టమేమీ  లేదు.  మీరు నాన్ స్ట్రైకర్ ఎండ్ లో ఉన్నప్పుడు  రెండు బంతుల కోసం వేచి చూడటంలో తప్పు లేదు కదా.   ఇలాంటి చిన్న చిన్న  విషయాలు  చాలా ముఖ్యం..’    అని  వ్యాఖ్యానించాడు. 

 

మూడో టెస్టులో టీమిండియా బ్యాటింగ్ లైనప్ పేకమేడలా  కుప్పకూలింది. ఆసీస్ స్పిన్నర్ల ధాటికి భారత జట్టు.. 30 ఓవర్లకే  8 వికెట్లు కోల్పోయి  102 పరుగులు చేసింది.  రోహిత్ శర్మ (12), శుభ్‌మన్ గిల్ (21), విరాట్ కోహ్లీ (22), పుజారా (1), రవీంద్ర జడేజా (4), శ్రేయాస్ అయ్యర్ (0), శ్రీకర్ భరత్ (17) లు  అలా వచ్చి ఇలా వెళ్లారు. ఆదుకుంటాడనుకున్న అశ్విన్ (3) నపు కున్హేమన్ ఔట్ చేశాడు.  ప్రస్తుతం  అక్షర్ (10 నాటౌట్) తో కలిసి ఉమేశ్ యాదవ్ (12 నాటౌట్) క్రీజులో ఉన్నారు.

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

India : షెఫాలీ వర్మ విధ్వంసం.. శ్రీలంక బేజారు! రెండో టీ20 టీమిండియాదే
5 Wickets in 1 Over : W W W W W... ఒకే ఓవర్‌లో 5 వికెట్లు.. అంతర్జాతీయ క్రికెట్ లో కొత్త చరిత్ర