అల్లాడించిన అశ్విన్.. ఒక్క సెషన్ లోనే తోక ముడిచిన కంగారూలు.. నాగ్‌పూర్ మనదే..

Published : Feb 11, 2023, 02:28 PM IST
అల్లాడించిన అశ్విన్.. ఒక్క సెషన్ లోనే తోక ముడిచిన కంగారూలు.. నాగ్‌పూర్ మనదే..

సారాంశం

INDvsAUS 1st Test Live: బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో భారత్ బోణీ కొట్టింది. స్పిన్ కు అనుకూలిస్తున్న నాగ్‌పూర్ పిచ్ పై  భారత స్పిన్ త్రయం రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ లు ఆసీస్ కు కళ్లెం వేశారు.  స్పిన్ ఉచ్చులో పడి  ఆసీస్ విలవిల్లాడింది.  

అనుకున్నదే అయింది.   మెలికలు తిరుగుతున్న నాగ్‌పూర్ పిచ్ ప పై  కంగారూలు కంగారెత్తిపోయారు.  క్రీజులోకి వచ్చిన బ్యాటర్లు  వచ్చినట్టే పెవిలియన్ కు   క్యూ కట్టారు.  స్పిన్ కు అనుకూలిస్తున్న పిచ్ పై  భారత స్పిన్ త్రయం రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ లు ఆసీస్ కు కళ్లెం వేశారు.  స్పిన్ ఉచ్చులో పడి  ఆసీస్ విలవిల్లాడింది.  ముఖ్యంగా  అశ్విన్  వేసింది తక్కువ ఓవర్లే అయినా  ఆసీస్ పతనాన్ని  శాసించాడు.  అశ్విన్ దాటికి  ఉస్మాన్ ఖవాజా, డేవిడ్ వార్నర్,   రెన్షా,  హ్యాండ్స్‌కాంబ్, అలెక్స్ క్యారీ లు  అలా వచ్చి ఇలా వెళ్లారు. ఒక్క స్టీవ్ స్మిత్ (51 బంతుల్లో 25 నాటౌట్,  2 ఫోర్లు, 1 సిక్సర్) మినహా  మిగిలిన ఆసీస్ బ్యాటర్లంతా  స్పిన్ కు దాసోహమయ్యారు. ఫలితంగా భారత్ ఈ మ్యాచ్ లో ఇన్నింగ్స్ 132 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుని మూడు రోజుల్లోనే టెస్టును ముగించింది. 

నాగ్‌పూర్ టెస్టులో తొలి ఇన్నింగ్స్ లో ఆసీస్.. 177 పరుగులకే కుప్పకూలిన విషయం తెలిసిందే.  బదులుగా భారత్..  ఫస్ట్ ఇన్నింగ్స్ లో 400 పరుగులకు ఆలౌట్ అయింది. తొలి ఇన్నింగ్స్ లో  223 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది.   సెకండ్ ఇన్నింగ్స్ లో ఆసీస్..  91 పరుగులకే కుప్పకూలింది. ఫలితంగా నాలుగు టెస్టుల సిరీస్ లో  భారత్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. 

అశ్విన్ మాయ.. 

స్పిన్ కు అనుకూలిస్తున్న పిచ్ పై సెకండ్ ఇన్నింగ్స్ లో   బ్యాటింగ్ కు వచ్చిన  ఆసీస్ రెండో ఓవర్లోనే తొలి వికెట్ ను కోల్పోయింది.  అశ్విన్ వేసిన   రెండో ఓవర్లో  ఉస్మాన్ ఖవాజా (5) ఔటయ్యాడు. ఖవాజా ఇచ్చిన క్యాచ్ ను  స్లిప్స్ లో కోహ్లీ అందుకున్నాడు.   వన్ డౌన్ లో వచ్చిన లబూషేన్ (17)  మూడు ఫోర్లు  కొట్టి  జోరుమీదే కనిపించాడు. కానీ  జడేజా  అతడి ఆట కట్టించాడు.  జడేజా వేసిన  11వ ఓవర్ లో  ఐదో బంతికి లబూషేన్ ఎల్బీడబ్ల్యూ  అయ్యాడు.   

ఆ తర్వాత డేవిడ్ వార్నర్ వంతు.  అశ్విన్ వేసిన  14వ ఓవర్లో  వరుసగా రెండు ఫోర్లు కొట్టిన వార్నర్.. ఐదో బంతికి వికెట్ల ముందు దొరికిపోయాడు.  15 ఓవర్లు కూడా ముగియకముందే  ఆసీస్.. 35 పరుగులకే మూడు కీలక వికెట్లను కోల్పోయింది.  

వార్నర్ స్థానంలో  క్రీజులోకి వచ్చిన మాథ్యూ రెన్షా (2)  కూడా  తన సహచరుడినే అనుసరించాడు.   15వ ఓవర్లో  అశ్విన్ వేసిన  రెండో బంతికి  రెన్షా ఎల్బీ రూపంలో పెవిలియన్ చేరాడు.  అతడి స్థానంలో వచ్చిన హ్యాండ్స్‌కాంబ్  (6) కూడా  అశ్విన్ బౌలింగ్ లోనే బలయ్యాడు.  వికెట్ కీపర్  అలెక్స్ క్యారీ (10)ని కూడా అశ్విన్..  19వ ఓవర్లో ఎల్బీగా ఔట్ చేశాడు.  క్యారీ వికెట్ కు ఈ ఇన్నింగ్స్ లో అశ్విన్ కు  ఐదో వికెట్ కావడం గమనార్హం. 

తోకను కత్తిరించిన జడ్డూ.. అక్షర్.. షమీ.. 

ఆస్ట్రేలియా సారథి  పాట్ కమిన్స్  (10)  కూడా   అలా వచ్చి ఇలా వెళ్లాడు.   రవీంద్ర జడేజా వేసిన   23వ ఓవర్ నాలుగో బంతి కమిన్స్ బ్యాట్ ను తాకుతూ వెళ్లి వికెట్ కీపర్ శ్రీకర్ భరత్ చేతుల్లో పడింది.  అతడి స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన  మర్ఫీ (2).. అక్షర్ పటేల్ వేసిన  26వ ఓవర్లో మూడో బంతికి   రోహిత్ శర్మ కు క్యాచ్ ఇచ్చాడు. నాథన్ లియాన్ (8),  స్కాట్ బొలాండ్ లను షమీ ఔట్ చేసి ఆసీస్ ఇన్నింగ్స్ కు తెరదించాడు.  ఒక్క సెషన్ కూడా పూర్తిగా ఆడకముందే  ఆసీస్ ఇన్నింగ్స్ ముగియడం గమనార్హం.   

అంతకుముందు మూడోరోజు ఉదయపు సెషన్ లో  భారత్ ఓవర్ నైట్ స్కోరు  (321) కి మరో 71 పరుగులు జోడించిన  టీమిండియా.. 400 పరుగుల వద్ద ఆలౌట్ అయింది.  అక్షర్ పటేల్ (84) సెంచరీ మిస్ చేసుకున్నాడు. షమీ (37) రాణించాడు. ఆసీస్ బౌలర్లలో టాడ్ మర్ఫీ ఏడు వికెట్లు తీశాడు. కమిన్స్ కు రెండు, లియాన్ కు ఒక వికెట్ దక్కింది. 

సంక్షిప్త స్కోర్లు : 

ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ : 177 ఆలౌట్ 
భారత్ తొలి ఇన్నింగ్స్ :  400 ఆలౌట్  
ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ :  91 ఆలౌట్ 
ఫలితం : ఇన్నింగ్స్ 132  పరుగుల తేడాతో భారత్ ఘన విజయం 

PREV
click me!

Recommended Stories

IND vs SA : జైస్వాల్ తొలి సెంచరీ.. విశాఖలో సౌతాఫ్రికా చిత్తు
Rohit Sharma: వైజాగ్ వన్డేలో రోహిత్ చరిత్ర.. 20 వేల పరుగుల క్లబ్‌లో మనోడి మాస్ ఎంట్రీ !