పతనం ప్రారంభం.. ఇప్పటికే సగం వికెట్లు కోల్పోయిన ఆసీస్.. ఇవాళే ముగిస్తారా..?

Published : Feb 11, 2023, 01:25 PM IST
పతనం ప్రారంభం.. ఇప్పటికే సగం వికెట్లు కోల్పోయిన ఆసీస్.. ఇవాళే ముగిస్తారా..?

సారాంశం

INDvsAUS 1st Test Live: నాగ్‌పూర్ టెస్టులో  తొలి ఇన్నింగ్స్ లో భారత్ నిర్దేశించిన  లక్ష్యాన్ని  ఛేదించడం పక్కనబెడితే ఆసీస్ కనీసం  అందులో సగమైనా సాధించగలదా..? అన్నది ఇప్పుడు ఆసక్తికరం.   


బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్ - ఆస్ట్రేలియా  మధ్య జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా విజయానికి బాటలు వేసుకుంటున్నది.  తొలి ఇన్నింగ్స్ లో  ఆసీస్ ను  177 పరుగులకే ఆలౌట్ చేసిన టీమిండియా.. తర్వాత బ్యాటింగ్ లో  400 పరుగులకు ఆలౌట్ అయింది.  తద్వారా  ఆసీస్ ముందు 223 పరుగుల ఆధిక్యాన్ని నిలిపింది. అయితే  రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఆసీస్.. తమ ముందున్న   223 పరుగులను ఛేదించడం పక్కనబెడితే   కనీసం అందులో సగం అయినా సాధిస్తుందా..? అన్నది అనుమానమే.  లంచ్ తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన ఆసీస్.. ఇప్పటికే ఐదు  కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.  

లంచ్ కు కొద్దిసేపు ముందే భారత్ ను ఆలౌట్ చేసి  సెకండ్ ఇన్నింగ్స్ ఆరంభించిన ఆసీస్ కు  భారత స్పిన్నర్లు షాకులిస్తున్నారు. మెలికలు తిరుగుతున్న  నాగ్‌పూర్ పిచ్ పై  అశ్విన్, జడేజాలు రెచ్చిపోతున్నారు. 

స్పిన్ కు అనుకూలిస్తున్న పిచ్ పై సెకండ్ ఇన్నింగ్స్ లో   బ్యాటింగ్ కు వచ్చిన  ఆసీస్ రెండో ఓవర్లోనే తొలి వికెట్ ను కోల్పోయింది.  అశ్విన్ వేసిన   రెండో ఓవర్లో  ఉస్మాన్ ఖవాజా (5) ఔటయ్యాడు. ఖవాజా ఇచ్చిన క్యాచ్ ను  స్లిప్స్ లో కోహ్లీ అందుకున్నాడు.   వన్ డౌన్ లో వచ్చిన లబూషేన్ (17)  మూడు ఫోర్లు  కొట్టి  జోరుమీదే కనిపించాడు. కానీ  జడేజా  అతడి ఆట కట్టించాడు.  జడేజా వేసిన  11వ ఓవర్ లో  ఐదో బంతికి లబూషేన్ ఎల్బీడబ్ల్యూ  అయ్యాడు.   

ఆ తర్వాత డేవిడ్ వార్నర్ వంతు.  అశ్విన్ వేసిన  14వ ఓవర్లో  వరుసగా రెండు ఫోర్లు కొట్టిన వార్నర్.. ఐదో బంతికి వికెట్ల ముందు దొరికిపోయాడు.  15 ఓవర్లు కూడా ముగియకముందే  ఆసీస్.. 35 పరుగులకే మూడు కీలక వికెట్లను కోల్పోయింది.  

 

వార్నర్ స్థానంలో  క్రీజులోకి వచ్చిన మాథ్యూ రెన్షా (2)  కూడా  తన సహచరుడినే అనుసరించాడు.   15వ ఓవర్లో  అశ్విన్ వేసిన  రెండో బంతికి  రెన్షా ఎల్బీ రూపంలో పెవిలియన్ చేరాడు.  అతడి స్థానంలో వచ్చిన హ్యాండ్స్‌కాంబ్  (6) కూడా  అశ్విన్ బౌలింగ్ లోనే బలయ్యాడు. 

ప్రస్తుతం స్టీవ్  స్మిత్ (10 నాటౌట్)తో పాటు  అలెక్స్ క్యారీ (4 నాటౌట్) క్రీజులో ఉన్నారు.  18 ఓవర్లు ముగిసేటప్పటికీ  ఆసీస్..  5 వికెట్ల నష్టానికి 56 పరుగులు చేసింది.  తొలి ఇన్నింగ్స్ లో ఇంకా 167  పరుగులు వెనుకబడి ఉంది.  స్పిన్ కు అనుకూలిస్తున్న పిచ్ పై రెచ్చిపోతున్న భారత బౌలర్ల ధాటిని తట్టుకుని మిగిలిన ఆసీస్ బ్యాటర్లు ఏ మేరకు నిలబడగలరనేది వేచి చూడాలి.  భారత స్పిన్నర్ల జోరు చూస్తుంటే  సెకండ్ ఇన్నింగ్స్  ను ఆసీస్ రేపటి వరకు కొనసాగించేది అనుమానమే.  మరో రెండు వికెట్లు పడితే ఆసీస్  కథ కంచికే..

PREV
click me!

Recommended Stories

IND vs SA : జైస్వాల్ తొలి సెంచరీ.. విశాఖలో సౌతాఫ్రికా చిత్తు
Rohit Sharma: వైజాగ్ వన్డేలో రోహిత్ చరిత్ర.. 20 వేల పరుగుల క్లబ్‌లో మనోడి మాస్ ఎంట్రీ !