
నాగ్‌పూర్ టెస్టులో టీమిండియా నిలకడగా ఆడుతోంది. ఆట రెండోరోజు లంచ్ సమయానికి భారత్.. 52 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (142 బంతుల్లో 85 నాటౌట్, 12 ఫోర్లు, 2 సిక్సర్లు), విరాట్ కోహ్లీ (25 బంతుల్లో 12 నాటౌట్, 2 ఫోర్లు) క్రీజులో ఉన్నారు. రెండో రోజు తొలి సెషన్ లో ఆసీస్ స్పిన్నర్ టాడ్ మర్ఫీ భారత్ కు డబుల్ షాకులిచ్చాడు. నైట్ వాచ్‌మన్ గా వచ్చి ఆసీస్ ను విసిగించిన అశ్విన్ తో పాటు నయావాల్ ఛటేశ్వర్ పుజారాను ఔట్ చేశాడు.
ఓవర్ నైట్ స్కోరు 77 వద్ద రెండో రోజు ఆట ఆరంభించిన టీమిండియా.. తొలి ఓవర్లలో ఆసీస్ కు ఎలాంటి అవకాశమూ ఇవ్వలేదు. రోహిత్, అశ్విన్ (23) లు స్వేచ్ఛగా బ్యాటింగ్ చేశారు. ఆసీస్ సారథి పాట్ కమిన్స్.. బౌలర్లను మార్చి మార్చి బౌలింగ్ చేయించినా ఈ ఇద్దరూ ధీటుగా ఎదుర్కొన్నారు.
కమిన్స్ వేసిన ఇండియా ఇన్నింగ్స్ 32వ ఓవర్ లో ఆఖరుబంతికి రోహిత్ డీప్ స్క్వేర్ లెగ్ లో భారీ సిక్స్ బాదాడు. ఆ తర్వాత నాథన్ లియాన్ వేసిన ఓవర్లో అశ్విన్ కూడా లెగ్ సైడ్ స్లాగ్ స్వీప్ ద్వారా భారీ సిక్స్ కొట్టాడు. 33వ ఓవర్లో భారత్ స్కోరు 100 పరుగులు దాటింది. లియాన్ వేసిన 35వ ఓవర్లో ఫోర్ కొట్టి రోహిత్ 70లలోకి వచ్చాడు.
అశ్విన్ విసిగిస్తుండటంతో కమిన్స్.. స్పిన్నర్ మర్పీతోనే ఎక్కువ ఓవర్లు వేయించాడు. అతడి బౌలింగ్ లో అశ్విన్ కాస్త ఇబ్బందిపడ్డాడు. అతడే వేసిన 41వ ఓవర్లో తొలి బంతికి అశ్విన్.. ఎల్బీడబ్ల్యూ రూపంలో పెవిలియన్ చేరాడు. అశ్విన్, రోహిత్ లు రెండో వికెట్ కు 42 పరుగులు జోడించారు. అశ్విన్ నిష్క్రమించడంతో టీమిండియా నయా వాల్ ఛటేశ్వర్ పుజారా క్రీజులోకి వచ్చాడు. 14 బంతులాడిన పుజారా ఏడు పరుగులు చేసి లెగ్ సైడ్ వెళ్తున్న బంతిని అనవసరంగా ఆడి వికెట్ సమర్పించుకున్నాడు. మర్ఫీ వేసిన 44వ ఓవర్లో తొలి బంతి తక్కువ ఎత్తులో రాగా దానిని షాట్ ఆడేందుకు పుజారా యత్నించాడు. కానీ అది కాస్తా బ్యాట్ ఎడ్జ్ కు తాకి షార్ట్ ఫైన్ లెగ్ వద్ద ఉన్న స్కాట్ బొలాండ్ చేతిలో పడింది. దీంతో భారత్ మూడో వికెట్ కోల్పోయింది. ఆ క్రమంలో క్రీజులోకి వచ్చిన కోహ్లీ.. మర్ఫీ, లియాన్ బౌలింగ్ లలో ఫోర్ బాదాడు. భారత బ్యాటర్లలో కెఎల్ రాహుల్ (20) తో పాటు అశ్విన్, పుజారా వికెట్లు మర్ఫీకే దక్కడం గమనార్హం.
లంచ్ తర్వాత సెంచరీ దిశగా సాగుతున్న రోహిత్.. టెస్టులలో చాలాకాలంగా సెంచరీ లేక విమర్శలు ఎదుర్కుంటున్న విరాట్ కోహ్లీలు ఆసీస్ బౌలింగ్ ను ఎలా ఎదుర్కుంటారనేది ఆసక్తికరం.