టీమిండియా మేనేజర్ అతి ప్రవర్తన... బిసిసిఐ సీరియస్

By Arun Kumar PFirst Published Aug 15, 2019, 5:18 PM IST
Highlights

వెస్టిండిస్ పర్యటనలో భారత జట్టు మేనేజర్  గా వ్యవహరిస్తున్న సునీల్ పై బిసిసిఐ సరియస్ అయ్యింది. ఏకంగా అతడిపై వేటు వేసేందుకు సిద్దపడింది. 

వెస్టిండిస్ పర్యటనలో టీమిండియా వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ సునీల్ సుబ్రహ్మణ్యంపై బిసిసిఐ సీరియస్ అయ్యింది. విండీస్ లోని భారత హైకమీషన్ అధికారులతో అమర్యాదగా ప్రవర్తించిన అతడిపై వేటు వేసేందుకు సిద్దపడింది. అయితే తన తప్పును ఒప్పుకుని సునీల్  బేషరతుగా క్షమాపణ కోరడంతో మనసు మార్చుకున్న బిసిసిఐ ఈ పర్యటనలో అతడికి కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది. 

సునీల్ వ్యవహారంపై క్రికెట్ పరిపాలనా కమిటీ(సీవోఏ) చీఫ్ వినోద్ రాయ్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా భారత హైకమీషన్ అధికారులతో  అతడికి ఏర్పడ్డ వివాదం గురించి వివరించారు. '' ప్రభుత్వ ఆదేశాల మేరకు వెస్టిండిస్ లోని భారత హైకమీషన్ అధికారులు టీమిండియా ఆటగాళ్లతో ఓ వీడియో షూట్ చేయాలని భావించారు. జల సంరక్షణ పై ప్రజల్లో అవగాహన కల్పించాలన్న సామాజిక బాధ్యతతో హైకమీషన్ ఆ పని చేయాలనుకుంది. దీనికి సహకరించాల్సిందిగా వెస్టిండిస్ పర్యటనలో టీమిండియా వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న సునీల్ కు అధికారులు సమాచారం అందించారు.

కానీ సునీల్ వారికి సహకరించపోగా కాస్త దురుసుగా ప్రవర్తించాడు. ఈ విషయంపై తనకు మెసేజ్ లు చేయడం ఆపాలంటూ హైకమీషన్ ఉన్నతాధికారులకు హెచ్చరించాడు. దీంతో వారు భారత ప్రభుత్వానికి...ప్రభుత్వం తమకు సమాచారం అందించింది. 

భారత ప్రభుత్వం  ఈ విషయంపై సీరియస్ అవ్వడంతో సునీల్ పై వేటు వేయాలని భావించాం. అతడికి వెంటనే విండీస్ టూర్ నుండి వెనక్కి రప్పించాలని అనుకున్నాం. ఆ మేరకు ఆదేశాలు కూడా జారీ చేశాం. అయితే అతడు తన తప్పుకు ఒప్పుకుని బేషరతుగా క్షమాపణ చెప్పడంతో కేవలం మంతలింపుతో వదిలేశాం. ఈ సీరిస్ ముగిసేవరకు అతడు టీమిండియా మేనేజర్ గానే వ్యవహరించనున్నాడు.'' అని  రాయ్ వెల్లడించాడు. 

click me!