దాయాాది పాకిస్థాన్ జట్టును చిత్తుచిత్తుగా ఓడించి స్వదేశంలో జరుగుతున్న ఐసిసి వన్డే ప్రపంచ కప్ టోర్నీలో మరో చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసిన టీమిండియాను ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహింద్రా అభినందించారు.
ముంబై : చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ ను చిత్తుచిత్తుగా ఓడించి ఐసిసి వన్డే ప్రపంచ కప్ 2023లో మరో అద్భుత విజయాన్ని అందుకుంది టీమిండియా. భారత బౌలర్ల బౌలింగ్ ఎటాక్, రోహిత్ శర్మ కెప్టెన్ ఇన్నింగ్స్ తోడవడంతో పాక్ పై భారత్ సునాయాసంగా గెలిచింది. అహ్మదాబాద్ లో దాయాదుల మధ్య జరిగిన ఈ మ్యాచ్ కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూసిన టీమిండియా అభిమానులు గెలుపు సంబరాల్లో మునిగిపోయారు. సామాన్యుల నుండి విఐపి ల వరకు పాక్ పై భారత్ విజయాన్ని ఆస్వాదిస్తున్నారు.
ఇక దేశమంటే వీరాభిమానం ప్రదర్శించే ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహింద్రా కూడా పాకిస్థాన్ పై భారత్ సూపర్ విక్టరీపై ఆసక్తికరంగా స్పందించారు. ఓ ఆఫ్రికన్ అద్భుతమైన సాంప్రదాయ నృత్యం చేస్తున్న వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు మహింద్రా గ్రూప్స్ అధినేత. పాకిస్థాన్ ను టీమిండియా చారిత్రాత్మక విజయం తర్వాత తన పరిస్థితి కూడా ఇలాగే వుందని... ఆనంద తాండవం చేస్తున్నానంటూ ఆనంద్ మహింద్రా పేర్కొన్నారు.
Seriously, that’s me doing my victory jig after our epic win pic.twitter.com/qoFyFHlTrN
— anand mahindra (@anandmahindra)
భారత్-పాక్ మ్యాచ్ సాగిందిలా :
చాలాకాలం తర్వాత భారత గడ్డపై అడుగుపెట్టింది పాకిస్థాన్ క్రికెట్ టీం. ఐసిసి భారత్ లో నిర్వహిస్తున్న ప్రపంచ కప్ కోసం భారత్ కు విచ్చేసిన పాకిస్థాన్ నిన్న(శనివారం) అత్యంత కీలకమైన మ్యాచ్ ఆడింది. అతిథ్య భారత్ తో తలపడ్డ బాబర్ సేన అన్ని విభాగాల్లోనూ చెత్త ప్రదర్శన కనబర్చింది. ఈ మ్యాచ్ లో రోహిత్ సేన పూర్తిగా ఆధిపత్యాన్ని ప్రదర్శించి అభిమానులను ఖుషీ చేసారు. మొదట టీమిండియా బౌలర్లు ఆ తర్వాత బ్యాటర్ల సూపర్ షో తో పాక్ జట్టు విలవిల్లాడిపోయింది. సమఉజ్జీల సమరం అనుకున్న మ్యాచ్ కాస్త పవర్ ఫుల్ టీం, పసికూన మధ్య మ్యాచ్ లా సాగింది.
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్ ఆరంభమేమీ అంత గొప్పగా జరగలేదు. 150 పరుగుల వరకు పాక్ జట్టు కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి పటిష్టంగా కనిపించింది. అప్పుడే భారత బౌలర్ల మ్యాజిక్ ప్రారంభమయ్యింది. చూస్తుండగానే టకటకా పాక్ వికెట్లు పడగొడుతూ పేకమేడలా కూల్చేసారు. దీంతో పాక్ కేవలం 191 పరుగులకే ఆలౌట్ అయ్యింది.
Read More 2011 వరల్డ్ కప్ ఆడి ఉంటే, రోహిత్ శర్మ ఇలా మారేవాడు కాదు! వీరేంద్ర సెహ్వాగ్ కామెంట్..
192 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ బ్యాటింగ్ లోనూ అదరగొట్టింది. కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి ఆకాశమే హద్దుగా చెలరేగి కేవలం 63 బంతుల్లోనే 86 పరుగులు (6 సిక్సులు, 6 ఫోర్లు) చేసాడు. కొద్దిలో మరో సెంచరీ చేసే అద్భుత అవకాశాన్ని మిస్ అయ్యాడు. ఆ తర్వాత శ్రేయాస్ అయ్యర్ సమయోచితంగా ఆడి హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. దీంతో మరో 20 ఓవర్లు మిగిలి వుండగానే టీమిండియా విజయతీరాలకు చేరుకుంది. పాక్ పై భారత్ గెలుపుతో యావత్ భారత ప్రజలు దసరా ముందే వచ్చిందన్నట్లు సంబరాలు జరుపుకున్నారు.