86 పరుగులు చేసి, అవుటైన రోహిత్ శర్మ, 14 పరుగుల తేడాతో సెంచరీ మిస్.. ఐసీసీ వన్డే వరల్డ్ కప్ టోర్నీలో పాకిస్తాన్‌పై 8వ విజయం...
వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో ఇండియా- పాకిస్తాన్ మ్యాచ్‌కి బీభత్సమైన హైప్ వచ్చింది. ఇరుజట్ల మధ్య హోరాహోరీ ఫైట్ ఉంటుందని ఎంతో ఆశపడి, భారీగా ఖర్చుపెట్టి స్టేడియానికి వచ్చిన క్రికెట్ ఫ్యాన్స్... టీమిండియా కంప్లీట్ డామినేషన్ కనిపించింది. ఐసీసీ వన్డే వరల్డ్ కప్ టోర్నీల్లో టీమిండియా రికార్డుని బ్రేక్ చేస్తామని పాకిస్తాన్ భీరాలు పోయింది. అయితే అహ్మదాబాద్‌లో పాక్ పప్పులు ఉడకలేదు. ఐసీసీ వన్డే వరల్డ్ కప్‌లో టీమిండియా, పాక్‌పై 8వ విజయాన్ని అందుకుంది.
టీమిండియా ఆల్‌రౌండ్ పర్ఫామెన్స్‌తో అదరగొట్టడంతో వార్ వన్‌సైడ్ అయిపోయింది. పాకిస్తాన్‌ని 191 పరుగులకు ఆలౌట్ చేసిన టీమిండియా, ఆ లక్ష్యాన్ని ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. 2023 వన్డే వరల్డ్ కప్‌లో టీమిండియాకి ఇది వరుసగా మూడో విజయం..
రీఎంట్రీ హీరో శుబ్‌మన్ గిల్ పెద్దగా మెరుపులు మెరిపించకుండానే అవుట్ కాగా విరాట్ కోహ్లీ 16 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. 10 ఓవర్లు ముగిసే సమయానికి 2 వికెట్లు కోల్పోయి 79 పరుగులు చేసింది భారత జట్టు..
తొలి బంతి ఫోర్ బాది, ఇన్నింగ్స్‌ని ఘనంగా మొదలెట్టాడు రోహిత్ శర్మ. శుబ్‌మన్ గిల్ కూడా తాను ఎదుర్కొన్న మొదటి బంతికి ఫోర్ బాదాడు. హసన్ ఆలీ వేసిన ఇన్నింగ్స్ రెండో ఓవర్‌లో 3 ఫోర్లు బాదిన శుబ్‌మన్ గిల్, షాహీన్ ఆఫ్రిదీ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు..
11 బంతుల్లో 4 ఫోర్లతో 16 పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్, బౌండరీ బాదేందుకు ప్రయత్నించి షాదబ్ ఖాన్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 23 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది టీమిండియా... ఐసీసీ వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో నెం.2లో ఉన్న శుబ్‌మన్ గిల్, నేటి మ్యాచ్‌లో 70+ పరుగులు చేసి ఉంటే.. నెం.1 వన్డే బ్యాటర్‌గా నిలిచి ఉండేవాడు..
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కలిసి రెండో వికెట్‌కి 56 పరుగుల భాగస్వామ్యం జోడించారు. మిస్ కమ్యూనికేషన్ కారణంగా రనౌట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న విరాట్ కోహ్లీ.. దాన్ని పెద్దగా వినియోగించుకోలేకపోయాడు..
18 బంతుల్లో 3 ఫోర్లతో 16 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ, హసన్ ఆలీ బౌలింగ్‌లో మహ్మద్ నవాజ్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 79 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది భారత జట్టు. మరో ఎండ్‌లో హారీస్ రౌఫ్ బౌలింగ్‌లో 2 సిక్సర్లు బాదిన రోహిత్ శర్మ, వన్డేల్లో 300 సిక్సర్లను పూర్తి చేసుకున్నాడు..
షాహిదీ ఆఫ్రిదీ 351, క్రిస్ గేల్ 331 వన్డే సిక్సర్లతో రోహిత్ శర్మ కంటే ముందున్నారు. ఓవరాల్‌గా 555+ అంతర్జాతీయ సిక్సర్లు బాదిన రోహిత్ శర్మ, అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాటర్‌గా టాప్‌లో ఉన్నాడు.
36 బంతుల్లో హాఫ్ సెంచరీ అందుకున్న రోహిత్ శర్మ, సిక్సర్ల మోత మోగించాడు. మరో ఎండ్‌లో శ్రేయాస్ అయ్యర్ కూడా దూకుడుగా ఆడడంతో టీమిండియా స్కోరు పరుగులు పెట్టింది. ఈ ఇద్దరూ కలిసి మూడో వికెట్‌కి 71 బంతుల్లో 77 పరుగుల భాగస్వామ్యం జోడించారు...
63 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సర్లతో 86 పరుగులు చేసిన రోహిత్ శర్మ, షాహీన్ ఆఫ్రిదీ బౌలింగ్‌లో ఇఫ్తికర్ అహ్మద్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అయితే అప్పటికే టీమిండియా 28.2 ఓవర్లలో 36 పరుగులు చేయాల్సిన స్థితికి చేరుకుంది..
శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ కలిసి మరో వికెట్ పడకుండా మ్యాచ్‌ని ముగించారు. శ్రేయాస్ అయ్యర్ 61 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో హాఫ్ సెంచరీ పూర్తి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కెఎల్ రాహుల్ 19 పరుగులు చేశాడు.