ఆమె రనౌట్ విషయంలో వివాదం... భారతజట్టు క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా నడుచుకుందా?...

By Chinthakindhi RamuFirst Published Jul 12, 2021, 1:20 PM IST
Highlights

ఇంగ్లాండ్ జట్టులో ఏకంగా నలుగురు ప్లేయర్లు రనౌట్... కెప్టెన్ హీథర్ నైట్ రనౌట్ విషయంలో వివాదం...

బంతిని ఆపే క్రమంలో ఇంగ్లాండ్ కెప్టెన్‌కి అడ్డంగా పడిపోయిన బౌలర్ దీప్తి శర్మ... వీడియో వైరల్...

ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో భారత మహిళా జట్టు 8 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 148 పరుగులు చేయగా 149 పరుగుల లక్ష్యఛేదనతో బరిలో దిగిన ఇంగ్లాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 140 పరుగులకే పరిమితమైంది...

ఒకానొక దశలో 106/2 స్కోరు చేసి విజయానికి 41 బంతుల్లో 43 పరుగులు కావాల్సిన స్థితిలో ఉన్న ఇంగ్లాండ్ వుమెన్స్ జట్టు, ఆ తర్వాత వరుస వికెట్లు కోల్పోయి ఓటమి పాలైంది. ఇంగ్లాండ్ జట్టులో ఏకంగా నలుగురు ప్లేయర్లు రనౌట్ కాగా, కెప్టెన్ హీథర్ నైట్ రనౌట్ విషయంలో వివాదం నెలకొంది.

28 బంతుల్లో 4 ఫోర్లతో 30 పరుగులు చేసిన హీథర్ నైట్, కీలక సమయంలో రనౌట్ కావడంతో మ్యాచ్‌పై పట్టు కోల్పోయింది ఇంగ్లాండ్. దీప్తి శర్మ బౌలింగ్‌లో వికెట్ కీపర్ అమీ ఎలెన్ జోన్స్ ఓ స్ట్రైయిట్ షాట్ ఆడింది. బంతిని ఆపేందుకు ప్రయత్నించిన దీప్తి శర్మ కింద పడిపోవడం, బంతి ఆమె కాలిని తాకుతూ వెళ్లి, వికెట్లకు తగలడం జరిగిపోయాయి.

పరుగు తీసేందుకు లైన్ దాటిన హీథర్ నైట్ కాళ్ల దగ్గరే దీప్తి శర్మ పడిపోవడంతో ఆమె సమయానికి క్రీజులోకి వెళ్లలేకపోయింది. టీమిండియా అప్పీలు చేయడంతో థర్డ్ అంపైర్ అవుట్‌గా ప్రకటించాడు. దీప్తి శర్మ ఉద్దేశపూర్వకంగా హీథర్ నైట్‌కి అడ్డు రాకపోయినా, ఆమె పడిపోవడం వల్లే ఇంగ్లాండ్ కెప్టెన్ రనౌట్ అవ్వాల్సి వచ్చింది.

ఈ విషయాన్నే అంపైర్‌కి విన్నవించి, భారత జట్టుతో వాదించింది హీథర్ నైట్. అయితే భారత మహిళా జట్టు ప్రవర్తించిన తీరుపై మాజీ క్రికెటర్లు అలెక్స్ హార్ట్‌లీ, మార్క్ బ్రౌచర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘ఇది క్రీడా స్ఫూర్తికి విరుద్ధం’ అంటూ కామెంట్లు చేశారు.

అయితే దీప్తి శర్మకు అదృష్టం కలిసి వచ్చిందని, హీథర్ నైట్‌కి కావాలని ఆమె అడ్డురాలేదని బంతి ఆపేందుకు ప్రయత్నిస్తే, అది రనౌట్‌గా మారిందని అంటున్నారు టీమిండియా అభిమానులు...

 

click me!