టీమిండియాకి ఊహించని షాక్... టీ20 సిరీస్ నుంచి కెఎల్ రాహుల్, అక్షర్ పటేల్ అవుట్...

Published : Feb 11, 2022, 07:16 PM ISTUpdated : Feb 11, 2022, 07:20 PM IST
టీమిండియాకి ఊహించని షాక్... టీ20 సిరీస్ నుంచి కెఎల్ రాహుల్, అక్షర్ పటేల్ అవుట్...

సారాంశం

రెండో వన్డేలో ఫీల్డింగ్ చేస్తూ గాయపడిన కెఎల్ రాహుల్... కరోనా నుంచి కోలుకున్నా, పూర్తి ఫిట్‌నెస్ సాధించని అక్షర్ పటేల్... రుతురాజ్ గైక్వాడ్, దీపక్ హుడాలకు అవకాశం...

వెస్టిండీస్‌పై వన్డే సిరీస్ గెలిచి జోరు మీదున్న భారత జట్టుకి టీ20 సిరీస్ ముందు ఊహించని షాక్ తగిలింది. కెఎల్ రాహుల్‌తో పాటు అక్షర్ పటేల్, టీ20 సిరీస్ మొత్తానికి దూరం కానున్నారు. రెండో వన్డేలో ఫీల్డింగ్ చేస్తూ గాయపడిన కెఎల్ రాహుల్, మూడో వన్డేలో బరిలో దిగలేదు...

కెఎల్ రాహుల్‌కి అయిన గాయం మానడానికి విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించడంతో అతను టీ20 సిరీస్‌కి దూరం కానున్నాడు. అలాగే స్పిన్నర్ అక్షర్ పటేల్ కూడా టీ20 సిరీస్‌కి దూరమయ్యాడు. కరోనా నుంచి కోలుకున్న అక్షర్ పటేల్, ఇంకా పూర్తి ఫిట్‌నెస్ సాధించలేదు...

కెఎల్ రాహుల్ స్థానంలో యంగ్ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్‌కి టీ20 సిరీస్ జట్టులో అవకాశం కల్పించిన సెలక్టర్లు, స్పిన్నర్ అక్షర్ పటేల్ స్థానంలో ఆల్‌రౌండర్ దీపక్ హుడాను టీ20 సిరీస్ జట్టులో చోటు కల్పించారు. గాయపడిన కెఎల్ రాహుల్, అక్షర్ పటేల్ ఇద్దరూ కూడా బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ)కి వెళ్లి, తిరిగి ఫిట్‌నెస్ సాధించబోతున్నారు..

సౌతాఫ్రికా టూర్‌లో పెద్దగా సక్సెస్ కాలేకపోయిన ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్‌, వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌కి ఎంపికయ్యాడు... అతనితో పాటు యంగ్ స్పిన్నర్ రవిభిష్ణోయ్, ఆవేశ్ ఖాన్‌లకు టీ20 సిరీస్ జట్టులో చోటు దక్కింది. ఐపీఎల్ 2021 సీజన్‌లో ఆరెంజ్ క్యాప్ గెలిచిన తర్వాత, విజయ్ హాజారే ట్రోఫీ, సయ్యద్ ముస్తాక్ ఆలీ టీ20 టోర్నీల్లో అదరగొట్టినప్పటికీ టీమిండియాలో చోటు దక్కించుకోలేకపోయాడు యంగ్ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్...

వన్డే సిరీస్ ఆరంభానికి ముందు కరోనా బారిన పడిన రుతురాజ్ గైక్వాడ్, టీ20 సిరీస్‌లో ఆడే అవకాశం ఉంది. కెఎల్ రాహుల్ గాయంతో సిరీస్‌కి దూరం కావడంతో రుతురాజ్ గైక్వాడ్‌తో కలిసి రోహిత్ శర్మ ఓపెనింగ్ చేయొచ్చు. ఇషాన్ కిషన్‌తో పాటు వెంకటేశ్ అయ్యర్‌కి కూడా టీ20ల్లో ఓపెనింగ్ చేసిన అనుభవం ఉంది... 

భువనేశ్వర్ కుమార్‌తో ఐపీఎల్ 2021 సీజన్ పర్పుల్ క్యాప్ విన్నర్ హర్షల్ పటేల్ కూడా టీ20 సిరీస్‌లో అందుబాటులోకి రానున్నారు. జస్ప్రిత్ బుమ్రా, మహ్మద్ షమీలకు విశ్రాంతినివ్వడంతో ఈ సిరీస్‌లో శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్‌తో పాటు భువనేశ్వర్ కుమార్, దీపక్ చాహార్, హర్షల్ పటేల్, ఆవేశ్ ఖాన్ ఫాస్ట్ బౌలింగ్‌ యూనిట్‌ను మోయనున్నారు. 

వన్డే సిరీస్‌లో చిత్తుగా ఓడినప్పటికీ టీ20ల్లో వెస్టిండీస్‌కి ఘనమైన రికార్డు ఉంది. గత టీ20 వరల్డ్‌ కప్ 2021 టోర్నీలో గ్రూప్ స్టేజీకే పరిమితమైనప్పటికీ ఆ తర్వాత ఇంగ్లాండ్‌పై టీ20 సిరీస్‌ గెలిచింది వెస్టిండీస్. టీ20 సిరీస్‌లో విండీస్‌ను ఓడించడం అంటే భారత జట్టు శక్తిమేర రాణించాల్సి ఉంటుంది...

వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌కి భారత జట్టు ఇది: రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, వెంకటేశ్ అయ్యర్, దీపక్ చాహార్, శార్దూల్ ఠాకూర్, రవి భిష్ణోయ్, యజ్వేంద్ర చాహాల్, వాషింగ్టన్ సుందర్, మహ్మద్ సిరాజ్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, ఆవేశ్ ఖాన్, రుతురాజ్ గైక్వాడ్, దీపక్ హుడా

PREV
click me!

Recommended Stories

India : షెఫాలీ వర్మ విధ్వంసం.. శ్రీలంక బేజారు! రెండో టీ20 టీమిండియాదే
5 Wickets in 1 Over : W W W W W... ఒకే ఓవర్‌లో 5 వికెట్లు.. అంతర్జాతీయ క్రికెట్ లో కొత్త చరిత్ర