
వెస్టిండిస్ తో జరుగుతున్న మొదటిటెస్ట్ లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పంతం నెగ్గించుకున్నాడు. క్రికెట్ పండితులు, మాజీ సీనియర్ల సూచనలను పక్కనబెట్టి సాహసోపేత నిర్ణయం తీసుకున్నాడు. మొదటి నుండి అనుకుంటున్నట్లుగానే సీనియర్ ఆటగాడు రోహిత్ శర్మకు తుది జట్టులో చోటు కల్పించలేదు.
పరిమిత ఓవర్ల క్రికెట్లో ఓపెనర్ రోహిత్ ను ఈ టెస్ట్ సీరిస్ ఆడించకపోవచ్చని అందరూ అనుమానిస్తూ వస్తున్నారు. ఐదుగురు బౌలర్లతో బరిలోకి దిగాలన్న ఉద్దేశంతో స్పెషలిస్ట్ బ్యాట్స్ మెన్ అయిన రోహిత్ ను పక్కనబెట్టే అవకాశాలున్నాయని ప్రచారం కూడా జరిగింది. అందుకు భిన్నంగా కేవలం ముగ్గురు బౌలర్లతోనే బరిలోకి దిగినా రోహిత్ కు తుది జట్టులో చోటు దక్కలేదు.
సీనియర్ ప్లేయర్ రోహిత్ ను కాదని హనుమ విహారికి వెస్టిండిస్ తో తలపడే అవకాశాన్ని కల్పించారు. ఇక వైస్ కెప్టెన్ అంజింక్యా రహానే కు కాకుండా రోహిత్ ను ఐదో స్థానంలో ఆడించవచ్చన్న ప్రచారం జరిగింది. కానీ అలా జరగలేదు.
రోహిత్ తో పాటు రవిచంద్రన్ అశ్విన్, వృద్దిమాన్ సాహా, కుల్దీప్ యాదవ్, ఉమేశ్ యాదవ్ లకు తుది జట్టులో చోటు లభించలేదు. కెఎల్ రాహుల్, మయాంక్ అగర్వాలు ఓపెనర్లుగా బరిలోకి దిగనుండగా చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ మూడు, నాలుగు స్థానాల్లో బ్యాటింగ్ చేయనున్నారు. ఐదో స్థానంలో రహానే, ఆరో స్థానంలో విహారి, ఏడో స్ధానంలో రిషబ్ పంత్ బరిలోకి దిగనున్నాడు. ఇక ఆలౌ రౌండర్ కోటాలో రవీంద్ర జడేజాకు, బౌలర్ల కోటాలో ఇషాంత్, షమీ, బుమ్రాలకు తుది జట్టులో చోటు దక్కింది.
సంబంధిత వార్తలు
రోహిత్ విషయంలో కోహ్లీ ఆలోచన మారాలి... సీనియర్ల సూచన
ఇండియా-వెస్టిండిస్ ఫస్ట్ టెస్ట్: రోహిత్ విషయంలో కోహ్లీ ఆలోచన అదేనా...?