
భారత్ పర్యటనలో ఉన్న శ్రీలంక జట్టు, వరుసగా రెండు టీ20 మ్యాచుల్లో ఓడి సిరీస్ కోల్పోయింది. మూడో టీ20, ఆ తర్వాత రెండు టెస్టుల సిరీస్ ఆడనున్న లంక జట్టుకి ఊహించని అనుభవం ఎదురైంది... ప్రస్తుతం ధర్మశాలలో మూడో టీ20 మ్యాచ్ ఆడుతున్న శ్రీలంక జట్టు, పంజాబ్‌లోని మొహాలీ వేదికగా టీమిండియాలో తొలి టెస్టు ఆడబోతున్న విషయం తెలిసిందే...
భారత మాజీ సారథి విరాట్ కోహ్లీకి ఇది నూరో టెస్టు కూడా కావడంతో ఈ మ్యాచ్‌కి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నాయి బీసీసీఐ, పంజాబ్ క్రికెట్ అసోసియేషన్... పంజాబ్‌లో నమోదు అవుతున్న కరోనా కేసుల దృష్ట్యా, మొహాలీ టెస్టు మ్యాచ్‌కి ప్రేక్షకులను అనుమతించబోమని, ఖాళీ స్టేడియంలోనే మ్యాచ్ జరుగుతుందని తెలిపింది బీసీసీఐ...
టీ20 జట్టులో లేని శ్రీలంక టెస్టు స్పెషలిస్ట్ ప్లేయర్లు, ఇప్పటికే మొహాలీ చేరుకుని ప్రాక్టీస్ సెషన్స్‌లో పాల్గొంటున్నారు... తాజాగా వీరు ప్రయాణించేందుకు అద్దెకు తీసుకున్న బస్సులో రెండు బుల్లెట్ షెల్స్ కనిపించడంతో భయాందోళనలకు గురవుతున్నారు లంక ప్లేయర్లు... ప్రస్తుతం ఐటీ పార్కు సమీపంలోని లలిత్ హోటల్‌లో బస చేస్తున్న లంక క్రికెటర్లు, అక్కడి నుంచి మొహాలీలోని పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ (పీసీఏ) స్టేడియానికి వెళ్లి వస్తున్నారు...
ఛంఢీఘర్‌లోని సెక్టర్ 17లో గల తారా బ్రదర్స్ అనే ప్రైవేట్ ట్రాన్స్‌పోర్ట్ నుంచి బస్సును అద్దెకి తీసుకుని, లంక ప్లేయర్ల కోసం వాడుతున్నారు... తాజాగా ఈ బస్‌లో రొటీన్ చెక్ చేసిన పోలీసులకు అందులో రెండు ఖాళీ బుల్లెట్ షెల్స్ కనిపించడంతో అందరూ అవాక్కయ్యారు...
‘మెటల్ డిటెక్టర్, ఇతర గాడ్జెట్స్‌తో బస్సును పూర్తిగా తనిఖీ చేస్తున్న సమయంలో రెండు ఖాళీ బుల్లెట్ షెల్స్ కనిపించాయి. ఇవి బస్సు లగేజ్ కాంపార్ట్‌మెంట్‌లో పడి ఉన్నాయి.
లంక ప్లేయర్ల కోసం బస్సును అద్దెకి తీసుకోవడానికి ముందు ఓ మ్యారేజ్ ఫంక్షన్ కోసం వాడినట్టు తెలిసింది. బస్సు డ్రైవర్‌ని దీని గురించి ప్రశ్నిస్తున్నాం...’ అంటూ తెలిపారు సెక్యూరిటీ వింగ్ పోలీస్ అధికారి...
వందో టెస్టు ఆడబోతున్న భారత మాజీ సారథి విరాట్ కోహ్లీ, ఇప్పటికే మొహాలీ చేరుకుని ప్రాక్టీస్ మొదలెట్టేశాడు. మొహాలీ టెస్టు ముగిసిన తర్వాత బెంగళూరు వేదికగా ఇండియా, శ్రీలంక మధ్య డే నైట్ టెస్టు మ్యాచ్ జరగనుంది. సౌతాఫ్రికాలో కేప్ టౌన్ టెస్టు ముగిసిన తర్వాత టెస్టు కెప్టెన్సీ నుంచి కూడా తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు విరాట్ కోహ్లీ.
టెస్టు కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఏడేళ్లుగా తిరుగులేని విజయాలు అందించిన విరాట్ కోహ్లీ, టెస్టుల్లో అత్యధిక విజయాలు అందుకున్న భారత సారథిగా, విదేశాల్లో అత్యధిక విజయాలు అందుకున్న సారథిగా టాప్‌లో నిలిచాడు. టెస్టు కెప్టెన్‌గా 40 విజయాలు అందుకున్న విరాట్ కోహ్లీ, మరో రెండు విజయాలు అందుకుని ఉంటే ఓవరాల్‌గా అత్యధిక విజయాలు అందుకున్న మూడో సారథిగా నిలిచేవాడు...
తొలుత విరాట్ కోహ్లీ నూరో టెస్టు మ్యాచ్ బెంగళూరు వేదికగా, డే నైట్ ఫార్మాట్‌లో జరుగుతుందని భావించినా, శ్రీలంక క్రికెట్ జట్టు పర్యటనకు వచ్చే ముందు సిరీస్‌లో మార్పులు చేసింది బీసీసీఐ...