India vs South Africa 3rd ODI: పార్ల్ లోని బోలాండ్ పార్క్ లో దక్షిణాఫ్రికాతో గురువారం జరిగే వన్డే సిరీస్ నిర్ణయాత్మక మూడో వన్డే భారత ప్లేయింగ్ ఎలెవన్ లో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ కు చోటు దక్కలేదు.
Ruturaj Gaikwad: ప్రస్తుతం దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న భారత్ క్రికెట్ జట్టు వన్డే సిరీస్ ను అడుతోంది. ఈ సిరీస్ లో మొదటి వన్డేలో భారత్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇక రెండో వన్డేలో సౌతాఫ్రికా 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో 1-1తో సమం అయింది. కీలకమైన మూడో మ్యాచ్ గురువారం పార్ల్ లోని బోలాండ్ పార్క్‌లో జరుగుతోంది అయితే, దక్షిణాఫ్రికాతో సిరీస్ నిర్ణయాత్మక మూడో వన్డే ఆడే భారత్ జట్టులో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ చోటుదక్కలేదు.
ఈ సిరీస్ మొదటి వన్డే మ్యాచ్ లో రుగురాజ్ గైక్వాడ్ సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యాడు. అలాగే, రెండో వన్డేలోనూ 4 పరుగులు చేసి వేలి గాయం కారణంగా వెనుదిరిగాడు. గాయం కారణంగా రుతురాజ్ కు మూడడో వన్డేలో చోటుకల్పించలేదు. టాస్ వేసిన సందర్భంగా భారత కెప్టెన్ కేఎల్ రాహుల్ ఇదే విషయాన్ని ధృవీకరించాడు. రుతురాజ్ గాయం కారణంగా జట్టులో చోటు కోల్పోవడంతో మరో భారత ప్లేయర్ రజత్ పాటిదార్ అంతర్జాతీయ వన్డే క్రికెట్ లోకి అరంగేట్రం చేశాడు.
మ్యాచ్‌కు ముందు గైక్వాడ్ టేప్ చేసిన వేలి ఫొటో వైరల్‌గా మారింది. చెన్నై సూపర్ కింగ్స్ ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ.. బ్యాటింగ్ సమయంలో అతని కుడి చేతి వేలికి గాయం అయినట్లు పేర్కొంది. మహారాష్ట్రకు చెందిన 26 ఏళ్ల ఈ బ్యాట్స్‌మన్ కూడా భారత టెస్టు జట్టులో చోటు దక్కించుకున్నాడు. గాయం ఏ స్థాయిలో ఉందనేదానిపై ఇంకా బీసీసీఐ నుంచి అధికారిక ప్రకటన రాలేదు. దీంతో డిసెంబర్ 26 నుండి సెంచూరియన్‌లో ప్రారంభమయ్యే బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్‌కు అందుబాటులో ఉంటాడా? లేదో తెలియాల్సి ఉంది.
మూడో వన్డే జట్టు గురించి కేఎల్ రాహుల్ మాట్లాడుతూ.. జట్టు ప్రధానంగా రెండు మార్పులు చేశామనీ, ఈ మ్యాచ్ లో రజత్ పాటిదార్ తన వన్డే క్రికెట్ అరంగేట్రం చేస్తాడని పేర్కొన్నాడు. వేలికి గాయం కావడంతో రుతురాజ్ గైక్వాడ్ ను మూడో వన్డే టీం నుంచి తప్పించామని తెలిపారు. అలాగే, కుల్దీప్ కు విశ్రాంతి ఇచ్చామనీ, వాషింగ్టన్ సుందర్ ను జట్టులోకి తీసుకున్నామని తెలిపారు. దేశవాళీ క్రికెట్ లో మధ్యప్రదేశ్‌కు, ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఆడుతున్న రజత్ పాటిదార్, సాయి సుదర్శన్‌తో కలిసి మ్యాచ్‌లో ఓపెనింగ్ చేశారు. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ 1-1తో సమం కాగా, మూడో వన్డేలో గెలిచిన జట్టు 2-1తో సిరీస్‌ని కైవసం చేసుకుంటుంది. అంతకుముందు 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్ 1-1తో ముగిసింది.