
India vs South Africa 3rd ODI: గురువారం పార్ల్‌లోని బోలాండ్ పార్క్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో వన్డేలో భారత బ్యాటర్ సంజూ శాంసన్ బ్యాట్ అదరగొట్టాడు. వన్డేల్లో తన తొలి సెంచరీని నమోదుచేశాడు. 2015లో అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టిన సంజూ శాంసన్.. 2021లో వన్డేల్లో తొలి అవకాశం దక్కించుకున్నాడు. ఇప్పటివరకు అవకాశాలు అంతంతమాత్రంగానే ఉండటంతో కెరీర్ ఒడిదుడుకులతో సాగింది. స్లోగా సాగుతున్న పిచ్ పై అద్భుతమైన ఆటతో శాంసన్ తొలి వన్డే సెంచరీ కొట్టాడు. 114 బంతుల్లో 108 పరుగులు చేసిన సంజూ శాంసన్.. విలియమ్స్ బౌలింగ్ లో ఔట్ అయ్యాడు. శాంసన్ ఇన్నింగ్స్ లో 6 ఫోర్లు, 3 సిక్సులు ఉన్నాయి.
తిలక్ వర్మ ఫిఫ్టి..
మరో భారత బ్యాటర్ తిలక్ వర్మ తన తొలి వన్డే ఇంటర్నేషనల్ హాఫ్ సెంచరీని నమోదు చేశాడు. ఈ ఎడమచేతి వాటం ఆటగాడు తన నాలుగో వన్డే మ్యాచ్ లో తన తొలి ఆఫ్ సెంచరీని సాధించాడు. ఇప్పటివరకు 15 టీ20 మ్యాచ్ లను ఆడిన తిలక్ వర్మ.. రెండు అర్ధ సెంచరీలు కొట్టాడు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో వన్డే మ్యాచ్ లో భారత ఇన్నింగ్స్‌లో 41వ ఓవర్‌లో నాంద్రే బర్గర్ బౌలింగ్‌లో ఫోర్ కొట్టి 75 బంతుల్లో తన తొలి ఫిఫ్టికి చేరుకున్నాడు.