India vs Pakistan: టీమిండియాను ఆదుకున్న కోహ్లీ, రిషబ్ పంత్... పాకిస్తాన్ ముందు...

By Chinthakindhi RamuFirst Published Oct 24, 2021, 9:18 PM IST
Highlights

India vs Pakistan: 6 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన దశ నుంచి కోలుకున్న టీమిండియా.. విరాట్ కోహ్లీ రికార్డు హాఫ్ సెంచరీ... పాక్ పేసర్ షాహీన్ ఆఫ్రిదీకి మూడు వికెట్లు...

టీ20 వరల్డ్‌కప్ 2021లో టీమిండియా ఆశించిన స్థాయిలో అదిరిపోయే ఆరంభం ఇవ్వలేకపోయింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా, నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 151 పరుగులు చేసింది. షాహీన్ ఆఫ్రిదీ మ్యాజిక్ స్పెల్‌తో 6 పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది టీమిండియా. పొట్టి ఫార్మాట్‌లో పాకిస్తాన్‌పై పెద్దగా రికార్డు లేని రోహిత్ శర్మ, షాహీన్ ఆఫ్రిదీ వేసిన రెండో బంతికే ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు.

పాక్‌పై టీ20 వరల్డ్‌కప్ మ్యాచుల్లో డకౌట్ అయిన రెండో భారత ఓపెనర్‌గా నిలిచాడు రోహిత్ శర్మ. 2007, 2012 టోర్నీల్లో గౌతమ్ గంభీర్ డకౌట్ కగా, రోహిత్ శర్మ దుబాయ్‌లో డకౌట్ అయ్యాడు... దినేశ్ కార్తీక్, మురళీ విజయ్, ఆశీష్ నెహ్రా, సురేష్ రైనా తర్వాత టీ20 వరల్డ్‌కప్ టోర్నీలో ఎదుర్కొన్న మొదటి బంతికే డకౌట్ అయిన ఐదో భారత బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు రోహిత్ శర్మ...

ఆ తర్వాత బీభత్సమైన ఫామ్‌లో ఉన్న కెఎల్ రాహుల్‌ను కూడా షాహీన్ ఆఫ్రిదీ క్లీన్‌బౌల్డ్ చేశాడు. 8 బంతుల్లో 3 పరుగులు చేసిన కెఎల్ రాహుల్, మూడో ఓవర్ తొలి బంతికే క్లీన్‌బౌల్డ్ అయ్యాడు.  8 బంతుల్లో ఓ ఫోర్, సిక్సర్‌తో 11 పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్, హసన్ ఆలీ బౌలింగ్‌లో కీపర్ రిజ్వాన్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. 5.4 ఓవర్లలోనే 31 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది టీమిండియా...

సూర్యకుమార్ యాదవ్ వికెట్‌తో టీ20ల్లో 100 క్యాచులు పూర్తిచేసుకున్నాడు పాకిస్తాన్ వికెట్ కీపర్ రిజ్వాన్... పవర్ ప్లే ముగిసే సమయానికి 3 వికెట్లు కోల్పోయి 36 పరుగులు మాత్రమే చేయగలిగింది భారత జట్టు...
రిషబ్ పంత్, విరాట్ కోహ్లీ కలిసి నాలగో వికెట్‌కి 53 పరుగుల భాగస్వామ్యం జోడించి ఆదుకునే ప్రయత్నిం చేశారు.

30 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 39 పరుగులు చేసిన రిషబ్ పంత్, షాదబ్ ఖాన్ బౌలింగ్‌లో భారీ షాట్‌కి ప్రయత్నించి అతనికే క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.. పాకిస్తాన్‌పై ఐసీసీ టోర్నీల్లో 500+ పరుగులు చేసిన మొట్టమొదటి బ్యాట్స్‌మెన్‌గా రికార్డు క్రియేట్ చేశాడు విరాట్ కోహ్లీ...

45 బంతుల్లో హాఫ్ సెంచరీ అందుకున్న విరాట్ కోహ్లీ, టీ20 వరల్డ్‌కప్ టోర్నీల్లో 10వ అర్ధశతకం నమోదుచేశాడు. క్రిస్ గేల్ 9 హాఫ్ సెంచరీలను అధిగమించిన విరాట్, అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన ప్లేయర్‌గా టాప్‌లో నిలిచాడు. 13 బంతుల్లో ఓ ఫోర్‌తో 13 పరుగులు చేసిన రవీంద్ర జడేజా, హసన్ ఆలీ బౌలింగ్‌లో భారీ షాట్‌కి ప్రయత్నించి అవుట్ అయ్యాడు...

టీ20 వరల్డ్‌కప్ టోర్నీలో హాఫ్ సెంచరీ చేసిన మొట్టమొదటి భారత కెప్టెన్ కూడా విరాట్ కోహ్లీ. గత ఆరు టీ20 వరల్డ్‌కప్ టోర్నీల్లో టీమిండియాకి కెప్టెన్‌గా వ్యవహరించిన ధోనీ, ఒక్క హాఫ్ సెంచరీ కూడా నమోదుచేయలేకపోయాడు...

49 బంతుల్లో 5 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 57 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ, షాహీన్ ఆఫ్రిదీ బౌలింగ్‌లో కీపర్ రిజ్వాన్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.. హార్ధిక్ పాండ్యా 8 బంతుల్లో 2 ఫోర్లతో 11 పరుగులు చేసి అవుట్ అయ్యాడు..

click me!