T20 Worldcup: బంగ్లా పులులను మట్టికరిపించిన లంక సింహాలు.. వీర బాదుడు బాదిన అసలంక, రాజపక్స

By team teluguFirst Published Oct 24, 2021, 7:17 PM IST
Highlights

Srinlaka vs Bangladesh: బంగ్లాదేశ్ తో జరిగిన ఉత్కంఠ మ్యాచ్ లో  శ్రీలంక ఘన విజయం సాధించింది. బ్యాటింగ్ లో రెచ్చిపోయి ఆడిన బంగ్లాదేశ్ ఆటగాళ్లు.. బౌలింగ్ లో విఫలమయ్యారు. శ్రీలంక బ్యాటర్లలో చరిత్ అసలంక, భానుక రాజపక్స ఆ జట్టుకు విజయాన్ని అందించారు. 

ఐసీసీ టీ20 ప్రపంచకప్ లో భాగంగా బంగ్లాదేశ్ తో జరిగిన ఉత్కంఠ మ్యాచ్ లో  శ్రీలంక ఘన విజయం సాధించింది. బ్యాటింగ్ లో రెచ్చిపోయి ఆడిన బంగ్లాదేశ్ ఆటగాళ్లు.. బౌలింగ్ లో విఫలమయ్యారు. శ్రీలంక బ్యాటర్లలో చరిత్ అసలంక, భానుక రాజపక్స విజృంభించడంతో.. 172 పరుగుల లక్ష్యాన్ని ఆ జట్టు మరో 7 బంతులు  మిగిలి ఉండగానే ఛేదించింది. బంగ్లా బౌలర్లకు చుక్కలు చూపించిన  అసలంకకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. 

172 పరుగుల లక్ష్యంతో  బ్యాటింగ్ ప్రారంభించిన శ్రీలంకకు తొలి ఓవర్ లోనే షాక్ తగిలింది. ఆ జట్టు ఓపెనర్, ఫామ్ లో ఉన్న కుశాల్ పెరీరా (1)  ఇన్నింగ్స్ నాలుగో బంతికే బౌల్డ్ అయ్యాడు. బంగ్లా పేసర్ టస్కిన్ అహ్మద్ స్థానంలో తుది జట్టులోకి వచ్చిన నసుమ్ అహ్మద్ వేసిన స్లో డెలివరీకి పెరీరా ఔట్ అయ్యాడు. 

స్కోరు బోర్డుపై పరుగులేమీ చేరకుండానే వికెట్ కోల్పోవడంతో వచ్చిన వన్ డౌన్ బ్యాట్స్మెన్ అసలంక (49 బంతుల్లో 80.. 5 ఫోర్లు, 5 సిక్సర్లు).. మరో ఓపెనర్ నిస్సాంక (24) సాయంతో శ్రీలంకను ఆదుకున్నాడు.  ఇద్దరూ కలిసి  తొలుత ఆచి తూచి ఆడినా తర్వాత బ్యాటు ఝుళిపించారు. రెండో వికెట్ కు ఈ ఇద్దరూ 69 పరుగులు జోడించారు. ముఖ్యంగా అసలంక బెదురు లేకుండా ఆడాడు.

భారీ లక్ష్యాన్ని ఛేధించే దిశగా వెళ్తున్న శ్రీలంక.. 8 వ ఓవర్ తర్వాత తడబడింది. బంగ్లా తరఫున బంతిని అందుకున్న షకిబ్ ఉల్ హసన్.. ఒకే ఓవర్ లో రెండు కీలక వికెట్లు తీసి లంకను దెబ్బకొట్టాడు. 8.1 ఓవర్లో నిస్సాంకను బౌల్డ్ చేసిన షకిబ్..  అదే ఓవర్లో నాలుగో బంతికి ఫెర్నాండో (0) ను కూడా బోల్తా కొట్టించాడు. ఫెర్నాండోను ఔట్ చేయగానే టీ20లలో అత్యధిక వికెట్లు (41) తీసిన బౌలర్ గా హసన్ రికార్డు సృష్టించాడు.  ఈ జాబితాలో తర్వాత స్థానంలో పాక్ బౌలర్ షాహిద్ అఫ్రిది (39), లసిత్ మలింగ (38) ఉన్నారు. 

ఫెర్నాండో అవుటయ్యాక  మ్యాచ్ బంగ్లాదేశ్ వైపునకు మొగ్గు చూపింది. కానీ ఐదో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన భానుక రాజపక్స (31 బంతుల్లో 53.. 3 ఫోర్లు, 3 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఫోర్లు, సిక్సర్లతో బంగ్లా బౌలర్లకు చుక్కలు చూపించాడు.  రాజపక్స రెచ్చిపోవడంతో అసలంక కూడా దూకుడు పెంచాడు.  ఇద్దరూ కలిసి ఐదో వికెట్ కు 86 పరుగులు జోడించారు. వీరి దూకుడుతో 10 ఓవర్లకు 4 వికెట్లు కోల్పోయి 80 పరుగులు చేసిన శ్రీలంక ఓటమి వైపుగా పయనించినట్టు అనిపించింది. కానీ రాజపక్స, అసలంకల బాదుడుతో 18 ఓవర్లు ముగిసేసరికి 163-4 గా ఉంది. 

చివరి రెండు ఓవర్లలో పది పరుగులు అవసరం కాగా.. నసుమ్ అహ్మద్ వేసిన 19వ ఓవర్లో భారీ షాట్ కు యత్నించిన రాజపక్స.. క్లీన్ బౌల్డ్ అయ్యాడు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అదే ఓవర్లో ఐదో బంతికి ఫోర్ కొట్టిన అసలంక.. లంకకు చారిత్రక విజయాన్ని అందించాడు. 

బంగ్లా బౌలర్లలో షకిబ్ ఉల్ హసన్ ఒక్కడే పొదుపుగా  బౌలింగ్ చేశాడు. 3 ఓవర్లు వేసిన షకిబ్.. 17 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు. నసుమ్ రెండు వికెట్లు పడగొట్టాడు. సైఫుద్దీన్, ముస్తాఫిజుర్ భారీగా పరుగులిచ్చుకున్నారు. 

click me!