Ind Vs Nz: ఆ విషయంలో ధోని, విరాట్ బాటలోనే నడుస్తున్న కొత్త సారథి.. రోహిత్ చేసిన పనికి ప్రశంసల వెల్లువ

By team teluguFirst Published Nov 22, 2021, 12:08 PM IST
Highlights

Rohit Sharma: నాయకుడిగా తొలి సిరీస్ విజయం ఎప్పటికీ మదురమే. దానిని ఘనంగా సెలబ్రేట్ చేసుకోవాలని ఆ ఆటగాళ్లతో పాటు వాళ్ల అభిమానులూ భావిస్తారు. కానీ రోహిత్ శర్మ మాత్రం... 

న్యూజిలాండ్ తో జరిగిన మూడు మ్యాచుల టీ20 సిరీస్ ను టీమిండియా 3-0తో గెలుచుకుంది. టీమిండియా కొత్త కెప్టెన్ (టీ20లకు) రోహిత్ శర్మతో పాటు కొత్త కోచ్ ద్రావిడ్ లకు ఇదే తొలి సవాల్. ద్రావిడ్ విషయం పక్కనబెడితే రోహిత కు పూర్తిస్థాయి కెప్టెన్ గా ఇదే తొలి  సిరీస్ విజయం. అయితే నాయకుడిగా తొలి సిరీస్ విజయం ఎప్పటికీ మదురమే. దానిని సెలబ్రేట్ చేసుకోవాలని ఆ ఆటగాళ్లతో పాటు వాళ్ల అభిమానులూ భావిస్తారు. కానీ రోహిత్ శర్మ మాత్రం ఈ విషయంలో తన పూర్వపు సారథుల బాటలోనే నడుస్తున్నాడు. విరాట్ కోహ్లి, మహేంద్ర సింగ్ ధోని ల మాదిరిగానే తాను కూడా ట్రోఫీ తీసుకున్న వెంటనే జట్టులోని యువ ఆటగాళ్లకు ఇచ్చి వాళ్లను ఉత్సాహపరుస్తున్నాడు.

ఆదివారం కోల్కతాలోని ప్రతిష్టాత్మక ఈడెన్ గార్డెన్ లో జరిగిన ఆఖరుదైన మూడో టీ20లో భారత జట్టు అద్భుత విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ విజయం అనంతరం ట్రోపీ తీసుకున్న రోహిత్ శర్మ.. దానిని తీసుకెళ్లి నేరుగా అక్కడే ఉన్న యువ ఆటగాళ్లు వెంకటేష్ అయ్యర్, హర్షల్ పటేల్ లకు అందించాడు. వాళ్లిద్దరూ ఇదే సిరీస్ లో టీమిండియాకు అరంగ్రేటం చేశారు. జైపూర్లో జరిగిన తొలి టీ20 లో అయ్యర్ ఎంట్రీ ఇవ్వగా.. రాంచీ లో జరిగిన రెండో టీ20లో హర్షల్ పటేల్ తుది జట్టులోకి వచ్చాడు. ట్రోఫీ ప్రెజెంటేషన్ సందర్భంగా.. రోహిత్ కప్పు తీసుకుని వాళ్లిద్దరికే అందిచ్చి చివర్లో నిల్చోవడం గమనార్హం. 

గతంలో విరాట్  కోహ్లి గానీ.. మాజీ సారథి ధోని గానీ ట్రోఫీ గెలిచిన అనంతరం దానిని తీసుకొచ్చి జట్టులో యువ ఆటగాళ్లకు అందించేవాళ్లు. ముఖ్యంగా ధోని అయితే  ఈ విషయంలో చాలా మంది కెప్టెన్లకు ఆదర్శంగా నిలిచాడు.  2011 వన్డే ప్రపంచకప్ నెగ్గిన తర్వాత  ధోని.. దానిని సహచరులకు అందించి కామ్ గా పక్కన వెళ్లి నిల్చున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ట్రోఫీలు గెలిచినప్పుడు కూడా ఆటగాళ్లంతా విజయసంబురాల్లో ఉంటే ధోని మాత్రం తన కూతురు జీవాతో ఆడుకున్న వీడియోలు ఇప్పటికీ యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉన్నాయి. 

ఓ సందర్భంలో దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి  అయితే ధోనిని కర్మయోగి అని పిలిచిన విషయం తెలిసిందే. ఇక నిన్నటి మ్యాచ్ లో రోహిత్ కూడా తన పాత కెప్టెన్ల సంప్రదాయాన్నే కొనసాగించి అందరి ప్రశంసలు పొందాడు.   

 

CHAMPIONS pic.twitter.com/UI5askB5y4

— BCCI (@BCCI)

ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ తన సామాజిక మాధ్యమాల ఖాతాలలో పోస్టు చేసింది. ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతున్నది.  కాగా.. నిన్నటి మ్యాచ్ లో టాస్ నెగ్గిన టీమిండియా.. తొలుత  బ్యాటింగ్ చేసి 184 పరుగులు చేసింది. రోహిత్, ఇషాన్, శ్రేయస్, హర్షల్ పటేల్, దీపక్ చాహర్ లు దుమ్ము రేపారు. అనంతరం కివీస్ జట్టు 111 పరుగులకే ఆలౌట్ అయింది. స్పిన్నర్ అక్షర్ పటేల్ 3/9 మ్యాజికల్ స్పెల్ తో న్యూజిలాండ్ ను కోలుకోలేని దెబ్బ కొట్టాడు.

click me!