
కాన్పూర్ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా 234/7 పరుగుల వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో దక్కిన 49 పరుగుల ఆధిక్యంతో కలిపి న్యూజిలాండ్ ముందు 283 పరుగుల ఊరించే టార్గెట్ పెట్టింది భారత జట్టు. రెండో ఇన్నింగ్స్‌లో భారత బ్యాటింగ్ తలబడి నిలబడింది. ఒకానొకదశలో 51 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన టీమిండియాను లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ ఆదుకున్నారు.
తొలి టెస్టు ఆడుతున్న శ్రేయాస్ అయ్యర్‌తో పాటు సీనియర్లు రవిచంద్రన్ అశ్విన్, వృద్ధిమాన్ సాహా, యంగ్ బౌలర్ అక్షర్ పటేల్ బ్యాటుతో రాణించి టీమిండియాకి మంచి స్కోరు అందించారు. 51/5 కోల్పోయి కష్టాల్లో పడిన దశలో శ్రేయాస్ అయ్యర్, రవిచంద్రన్ అశ్విన్ కలిసి ఆరో వికెట్‌కి 52 పరుగులు జోడించారు. 62 బంతుల్లో 5 ఫోర్లతో 32 పరుగులు చేసిన రవి అశ్విన్, జెమ్మీసన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత శ్రేయాస్ అయ్యర్, వృద్ధిమాన్ సాహా కలిసి ఏడో వికెట్‌కి 64 పరుగుల భాగస్వామ్యం జోడించారు..
125 బంతుల్లో 8 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 65 పరుగులు చేసిన శ్రేయాస్ అయ్యర్, టిమ్ సౌథీ బౌలింగ్‌లో వికెట్ కీపర్ టామ్ బ్లండెల్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.
ఆరంగ్రేటం టెస్టులోనే ఓ సెంచరీ+ ఓ హాఫ్ సెంచరీ నమోదుచేసిన మొట్టమొదటి భారత బ్యాట్స్‌మెన్‌గా సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు శ్రేయాస్ అయ్యర్...
తొలి టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లో 50+ స్కోర్లు చేసిన మూడో భారత బ్యాట్స్‌మెన్ శ్రేయాస్ అయ్యర్. ఇంతకుముందు 1934లో దిల్వార్ హుస్సేన్, 1971లో సునీల్ గవాస్కర్ మాత్రమే ఈ ఫీట్ సాధించారు...
తొలి ఇన్నింగ్స్‌లో 105, రెండో ఇన్నింగ్స్‌లో 65 పరుగులు చేసిన శ్రేయాస్ అయ్యర్... ఆరంగ్రేటం టెస్టులో 170 పరుగులు చేసి తొలి టెస్టులో అత్యధిక పరుగులు చేసిన మూడో భారత బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు...
శిఖర్ ధావన్ 187, రోహిత్ శర్మ 177 పరుగులు చేసి టాప్‌లో ఉండగా, శ్రేయాస్ అయ్యర్ 170 పరుగులతో టాప్ 3లో నిలిచాడు. ధావన్, రోహిత్ ఒకే ఇన్నింగ్స్‌లో ఆ పరుగులు చేయగా, శ్రేయాస్ అయ్యర్ రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 170 రన్స్ చేశారు...
ఆరంగ్రేటం టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లో 100+ కి పైగా బంతులు ఎదుర్కొన్న రెండో భారత బ్యాట్స్‌మెన్ శ్రేయాస్ అయ్యర్. ఇంతకుముందు 2018లో మయాంక్ అగర్వాల్ ఈ ఫీట్ సాధించాడు...
ఓవరాల్‌గా కాన్పూర్ టెస్టులో 296 బంతులు ఎదుర్కొన్న శ్రేయాస్ అయ్యర్, మహ్మద్ అజారుద్దీన్ (322), సౌరవ్ గంగూలీ (301), రోహిత్ శర్మ (301), ప్రవీణ్ అమ్రే (299) తర్వాత అత్యధిక బంతులు ఎదుర్కొన్న భారత బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు...
అయ్యర్ అవుటైన తర్వాత వృద్ధిమాన్ సాహా, అక్షర్ పటేల్ కలిసి ఎనిమిదో వికెట్‌కి 67 భాగస్వామ్యం నమోదుచేశారు. మొదటి ఐదు వికెట్లు 51 పరుగులకే కోల్పోగా, 6, 7, 8వ వికెట్లకు 50+ భాగస్వామ్యాలు నమోదయ్యాయి. 2007లో ఓవల్ టెస్టులో ఇంగ్లాండ్‌పై ఆరు, ఏడు, ఎనిమిదో వికెట్లకు 50+ భాగస్వామ్యాలు రాగా, ఇది రెండోసారి...
167/7 స్కోరు వద్ద డ్రింక్స్ బ్రేక్‌కి వెళ్లిన టీమిండియా, నాలుగో రోజు మూడో సెషన్‌లో వికెట్లేమీ కోల్పోకుండా పరుగులు చేసిన ఇండియా 234/7 వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. అక్షర్ పటేల్ 67 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 28 పరుగులు, సాహా 126 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 61 పరుగులు చేసి అజేయంగా నిలిచారు.
నాలుగేళ్ల తర్వాత హాఫ్ సెంచరీ అందుకున్న వృద్ధిమాన్ సాహా, న్యూజిలాండ్‌పై మూడో హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. మెడ పట్టేయడంతో తొలి ఇన్నింగ్స్‌లో వికెట్ కీపింగ్‌కి రాని సాహా కెరీర్‌లో ఇది ఆరో టెస్టు హాఫ్ సెంచరీ కావడం విశేషం.
అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 14/1 వద్ద నాలుగో రోజు బ్యాటింగ్ మొదలెట్టిన టీమిండియా... 51 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కేల్ జెమ్మీసన్ వేసిన నాలుగో రోజు మొదటి ఓవర్‌లో ఛతేశ్వర్ పూజారా, మయాంక్ అగర్వాల్ చెరో ఫోర్ బాదాడు...
జెమ్మీసన్ ఓవర్‌లో పూజారా అవుట్ కావడంతో 32 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది భారత జట్టు. జెమ్మీసన్ బౌలింగ్‌లో కీపర్ క్యాచ్‌కి అప్పీలు చేసింది న్యూజిలాండ్. అంపైర్ నాటౌట్‌గా ప్రకటించినా, డీఆర్‌ఎస్ తీసుకున్న కివీస్‌కి అనుకూలంగా ఫలితం దక్కింది.
ఆ తర్వాత అజింకా రహానే 15 బంతులాడి 4 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. తాను ఆడిన మొదటి 13 బంతుల్లో పరుగులేమీ చేయలేకపోయిన అజింకా రహానే, 14వ బంతికి ఫోర్ బాది, 15వ బంతికి అజాజ్ పటేల్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరాడు...
53 బంతుల్లో 3 ఫోర్లతో 17 పరుగులు చేసిన మయాంక్ అగర్వాల్, టిమ్ సౌథీ బౌలింగ్‌లో టామ్ లాథమ్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత రెండో బంతికే రవీంద్ర జడేజా ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరాడు...