ICC: క్రికెట్ పై ఒమిక్రాన్ తొలి దెబ్బ.. ఐసీసీ మహిళల ప్రపంచకప్ క్వాలిఫయింగ్ మ్యాచులు రద్దు

Published : Nov 27, 2021, 06:00 PM IST
ICC: క్రికెట్ పై ఒమిక్రాన్ తొలి దెబ్బ.. ఐసీసీ మహిళల ప్రపంచకప్ క్వాలిఫయింగ్ మ్యాచులు రద్దు

సారాంశం

ICC Women's Cricket World Cup 2021: ప్రపంచాన్ని మరోసారి కలవరపాటుకు గురి చేస్తున్న ఒమిక్రాన్ క్రికెట్ ను తొలి  దెబ్బ తీసింది. ఆఫ్రికా ఖండంలో విస్తరిస్తున్న ఈ కొత్త రకం కరోనా వేరియంట్ కారణంగా జింబాబ్వేలో జరుగుతున్న  మహిళల ప్రపంచకప్ అర్హత మ్యాచులు రద్దయ్యాయి. 

కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ (Omicron) క్రికెట్ కు తొలి షాక్ ఇచ్చింది. ఆఫ్రికా ఖండంలో విస్తృతంగా వ్యాప్తి చెందుతూ దక్షిణాఫ్రికా (South Africa), బోట్స్వానా, జింబాంబ్వే, నమీబియాలను ఆందోళనకు గురి చేస్తున్న ఈ వేరియంట్ (Corona New Varient).. మహిళల ప్రపంచకప్ పై తొలి పంజా విసిరింది. ఒమిక్రాన్ వ్యాప్తి కారణంగా జింబాబ్వే (Zimbabwe)లో జరుగుతున్న  మహిళల క్రికెట్ ప్రపంచకప్-2021 పోటీలను అర్థాంతరంగా రద్దు చేస్తున్నట్టు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. 

2022లో న్యూజిలాండ్ (New Zealand) వేదికగా జరుగబోయే వుమెన్స్ వరల్డ్ కప్ (Women's World Cup) కోసం జింబాబ్వేలో  క్వాలిఫయింగ్ పోటీలను నిర్వహిస్తున్నారు.  ఈ మెగా ఈవెంట్  కోసం ఇప్పటికే  ఆతిథ్య న్యూజిలాండ్ తో పాటు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, ఇండియా, సౌతాఫ్రికాలు అర్హత సాధించాయి. 

మొత్తం తొమ్మిది జట్లతో మహిళల ప్రపంచకప్ నిర్వహించనున్నారు. అయితే చివరి మూడు జట్ల కోసం జింబాబ్వేలో క్వాలిఫయింగ్ మ్యాచులు జరుగుతున్నాయి. ఇందుకోసం పాకిస్థాన్, బంగ్లాదేశ్, వెస్టిండీస్, శ్రీలంక తో పాటు థాయ్లాండ్, జింబాబ్వే, యూఎస్ఎ లు పోటీ పడుతున్నాయి. షెడ్యూల్ ప్రకారం.. శనివారం జింబాబ్వే వర్సెస్ పాకిస్థాన్, యూఎస్ఎ వర్సెస్ థాయ్లాండ్ జరగాల్సి ఉంది. మరోవైపు శ్రీలంక వర్సెస్ వెస్టిండీస్ మ్యాచ్ ఉన్నా.. లంకకు చెందిన ఓ సహాయక  సిబ్బందికి కొవిడ్ సోకడంతో ఆ మ్యాచ్ ను కూడా రద్దు చేశారు. 

 

కాగా.. క్వాలిఫయింగ్ మ్యాచులు రద్దు కావడంతో ఐసీసీ హెడ్ ఆఫ్ ఈవెంట్స్ క్రిస్ టెట్లీ మాట్లాడుతూ..  అర్హత పోటీలను రద్దు చేస్తున్నందుకు తీవ్ర నిరాశకు గురయ్యామని తెలిపాడు. ఒమిక్రాన్ కారణంగా చాలా ఆఫ్రికా దేశాలు ప్రయాణ ఆంక్షలను విధించడం.. వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఈ  మ్యాచులను రద్దు చేస్తున్నట్టు  చెప్పాడు. 

ఈ  మ్యాచులను కంప్లీట్ చేసేందుకు తాము ప్రయత్నించామని, కానీ అందుకు అనువైన పరిస్థితులు ప్రస్తుతం లేవని టెట్లీ వివరించాడు. ఆయా జట్ల ర్యాంకుల ఆధారంగా అర్హత పొందే జట్లు.. వచ్చే ఏడాది ప్రపంచకప్ లో పాల్గొంటాయని తెలిపాడు.  వచ్చే ఏడాది మార్చి 4 నుంచి ఏప్రిల్ 3 వరకు న్యూజిలాండ్ వేదికగా మహిళల వన్డే ప్రపంచకప్ జరగనుంది.

Also Read: అలా అయినా జరిపిస్తాం.. తొందరొద్దు చర్చించాక చెబుతాం.. దక్షిణాఫ్రికా సిరీస్ పై తేల్చుకోలేపోతున్న బోర్డులు

కాగా.. దక్షిణాఫ్రికాలో కోరలు చాస్తున్న ఈ వైరస్ వ్యాప్తితో వచ్చేనెలలో  ఇండియా-దక్షిణాఫ్రికా సిరీస్ పై కూడా నీలి నీడలు కమ్ముకున్నాయి.  సిరీస్ ను నిర్వహించాలా..? వద్దా..? అనే విషయమ్మీద రెండు దేశాల బోర్డులు చర్చోపచర్చలు సాగిస్తున్నాయి. అయితే ఇరు దేశాల ప్రభుత్వాలు ఓకే చెబితేనే సిరీస్ ముందుకెళ్లే అవకాశముంది. మరి దీనిపై కేంద్ర  ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. 

PREV
click me!

Recommended Stories

T20 World Cup: భారత జట్టులో శుభ్‌మన్ గిల్‌కు నో ఛాన్స్.. అసలు కారణం ఇదే !
T20 World Cup 2026: షాకిచ్చారు భయ్యా.. స్టార్ ప్లేయర్లను బయటకు పంపించేశారు !