ఒక్కో టికెట్‌కి రూ.2.5 లక్షలు... ఇండియా - న్యూజిలాండ్ సెమీస్ మ్యాచ్‌ క్రేజ్‌కి బ్లాక్ మార్కెట్‌లో టికెట్లు..

By Chinthakindhi Ramu  |  First Published Nov 14, 2023, 5:53 PM IST

ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ సెమీ ఫైనల్ మ్యాచ్... ఇప్పటికే అమ్ముడైపోయిన టికెట్లు, బ్లాక్‌లో రూ.27 వేల నుంచి రూ.2.5 లక్షల దాకా విక్రయిస్తున్న కేటుగాళ్లు.. 


భారతీయులకు సినిమాల తర్వాత క్రికెట్ అంటేనే పిచ్చి. అందుకే ఐపీఎల్ బ్రాండ్ వాల్యూ లక్ష కోట్లకు చేరింది.  భారత జట్టు, లీగ్ స్టేజీలో అన్ని మ్యాచుల్లో గెలిచి రికార్డు దుమ్ము దులిపింది. దీంతో ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ సెమీ ఫైనల్ మ్యాచ్‌కి బీభత్సమైన క్రేజ్ ఏర్పడింది.

ఈ క్రేజ్‌ని క్యాష్ చేసుకునేందుకు కొందరు బ్లాక్ మార్కెట్‌లో టికెట్లను విక్రయిస్తున్నారు. ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరగబోయే ఈ మ్యాచ్‌కి రూ.2500- రూ.4 వేలుగా టికెట్ ధరను నిర్ణయించింది ముంబై క్రికెట్ అసోసియేషన్. ఆన్‌లైన్‌లో విక్రయానికి వచ్చిన కొన్ని నిమిషాల్లోనే టికెట్లన్నీ అమ్ముడైపోయాయి. ఈ టికెట్లలో చాలా వరకూ ఎంసీఏ అధికారులు, పోలీసులు, వారి కుటుంబాలకు వెళ్లినట్టు సమాచారం..

Latest Videos

ఈ టికెట్లు బ్లాక్ మార్కెట్‌లో రూ.27 వేల నుంచి రూ.2.5 లక్షల దాకా విక్రయిస్తున్నారు కొందరు కేటుగాళ్లు.  బ్లాక్ మార్కెట్‌లో ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ టికెట్లను 100 రెట్లు అధిక ధరకు విక్రయిస్తున్న ఓ ముంబై వాసిని మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. అకాశ్ కొత్తారి అనే ముంబైకి చెందిన యువకుడు, వాట్సాప్ గ్రూప్‌లో తన దగ్గర ఉన్న ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ సెమీ ఫైనల్ మ్యాచ్ టికెట్లను విక్రయిస్తున్నట్టు పోస్ట్ చేశాడు. వీటికి రూ.27 వేల నుంచి రూ.2.5 లక్షల ధర డిమాండ్ చేస్తుండడంతో మ్యాటర్... పోలీసుల దాకా వెళ్లింది.

అతనిపై 420, 511 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు, అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇలా దాదాపు 10 టికెట్లను విక్రయించిన ఆకాశ్, దాదాపు రూ.5 లక్షల వరకూ వసూలు చేసినట్టు సమాచారం.
 

click me!