మహ్మద్ సిరాజ్‌ నెత్తి మీద ఒక్కటిచ్చిన రోహిత్ శర్మ... న్యూజిలాండ్‌తో మొదటి టీ20 మ్యాచ్ సమయంలో...

By Chinthakindhi RamuFirst Published Nov 18, 2021, 10:11 AM IST
Highlights

న్యూజిలాండ్‌తో జరిగిన మొదటి టీ20లో భారత జట్టు ఉత్కంఠ విజయం... ఆఖరి ఓవర్‌లో హై డ్రామా... డగౌట్‌లో సిరాజ్‌పై సరదాగా చేయి చేసుకున్న రోహిత్ శర్మ...

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో గ్రూప్ స్టేజీకే పరిమితమైన టీమిండియా, న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌ను ఘనంగా ప్రారంభించింది. జైపూర్ వేదికగా తొలి టీ20 మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది భారత జట్టు. ఈజీగా గెలవాల్సిన మ్యాచ్‌ కాస్తా ఆఖర్లో న్యూజిలాండ్ కట్టుదిట్టమైన బౌలింగ్, భారత బ్యాట్స్‌మెన్ అనవసర తప్పిదాల కారణంగా ఆఖరి ఓవర్ దాకా ఉత్కంఠభరితంగా సాగింది. 

అయితే ఈ మ్యాచ్ సందర్భంగా జరిగిన సరదా సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. విజయానికి 21 బంతుల్లో 20 పరుగులు కావాల్సిన దశలో సూర్యకుమార్ యాదవ్ అవుట్ కావడంతో మ్యాచ్ ఆసక్తికరంగా మారింది.

19వ ఓవర్ ఆఖరి బంతికి శ్రేయాస్ అయ్యర్ కూడా పెవిలియన్ చేరాడు.  ఆఖరి ఓవర్‌లో భారత జట్టు విజయానికి 10 పరుగులు కావాల్సి వచ్చింది. ఈ సమయంలో టీ20 పూర్తి స్థాయి కెప్టెన్‌గా మొదటి మ్యాచ్ ఆడుతున్న రోహిత్ శర్మ, భారత పూర్తి స్థాయి హెడ్‌కోచ్‌గా తొలి మ్యాచ్ ఆడుతున్న రాహుల్ ద్రావిడ్ డగౌట్‌లో కాస్త టెన్షన్ పడుతూ కనిపించారు.

ఈ సమయంలో డగౌట్‌లో ముందు వరుసలో కూర్చున్న రాహుల్ ద్రావిడ్, బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్‌తో ఏదో చెబుతున్న సమయంలో ఆ తర్వాతి వరుసలో ఉన్న కెఎల్ రాహుల్, పక్కనే ఉన్న మహ్మద్ సిరాజ్‌ని సడెన్‌గా చూశాడు. వీరి వెనకాల ఉన్న రోహిత్ శర్మ కూడా సిరాజ్‌ను చూసి, తల మీద ఒక్కటి ఇచ్చాడు...

Why did Rohit hit Siraj🤣🤣🙄 pic.twitter.com/EjqnUXts3v

— Bhanu🔔 (@its_mebhanu)

ఈ సీన్‌ మొత్తంలో మహ్మద్ సిరాజ్ నోరు విప్పి కామెంట్ చేసినట్టు కానీ, ఏదైనా సౌండ్ చేసినట్టు కానీ కనిపించలేదు. అయితే కెఎల్ రాహుల్ రియాక్షన్, రోహిత్ శర్మ తల మీద ఒక్కటివ్వడం చూస్తుంటే మాత్రం... ఆ సమయంలో సిరాజ్ ‘బాంబ్’ పేల్చి ఉంటాడని అనుమానిస్తున్నారు క్రికెట్ ఫ్యాన్స్. కెఎల్ రాహుల్ సడెన్‌గా ఇచ్చిన రియాక్షన్, రోహిత్ శర్మ తల మీద కొట్టిన తర్వాత మహ్మద్ సిరాజ్ నవ్వడం చూస్తుంటే, ఇది నిజమేనని అనిపించకమానదు.

ఈ ఫన్నీ సీన్‌కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇదిలా ఉంటే జైపూర్ టీ20 మ్యాచ్‌లో ఆఖరి ఓవర్‌లో భారీ హై డ్రామానే నడిచింది. విజయానికి 6 బంతుల్లో 10 పరుగులు కావాల్సిన దశలో బంతిని అందుకున్న పార్ట్ టైం బౌలర్ డార్ల్ మిచెల్, మొదటి బాల్ వైడ్‌గా వేశాడు.

ఆ తర్వాతి బంతిని ఎదుర్కొన్న మొట్టమొదటి మ్యాచ్ ఆడుతున్న వెంకటేశ్ అయ్యర్, బౌండరీ బాదాడు. దీంతో విజయానికి 5 బంతుల్లో 5 పరుగులు కావాల్సిన స్థితికి చేరుకుంది టీమిండియా... అయితే ఆ తర్వాతి బంతికి రివర్స్ స్వీప్ ఆడేందుకు ప్రయత్నించిన వెంకటేశ్ అయ్యర్, అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న రచిన్ రవీంద్రకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.

ఆ తర్వాతి బంతికి వైడ్ రూపంలో మరో ఎక్స్‌ట్రా పరుగు రాగా. మూడో బంతికి సింగిల్ తీశాడు అక్షర్ పటేల్. ఆఖర్లో విజయానికి 3 బంతుల్లో  3 పరుగులు కావాల్సిన దశలో రిషబ్ పంత్ బౌండరీ బాదడంతో భారత అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.  17వ నెంబర్ జెర్సీ ధరించే రిషబ్ పంత్, సరిగ్గా 17 బంతులుల ఎదుర్కొని 17 పరుగులు చేయడం మరో విశేషం.  

click me!