INDvsNZ 1st T20I: గప్టిల్, ఛాప్‌మన్ హాఫ్ సెంచరీలు... టీమిండియా ముందు ఊరించే టార్గెట్...

By Chinthakindhi RamuFirst Published Nov 17, 2021, 8:49 PM IST
Highlights

INDvsNZ 1st T20I: 70 పరుగులు చేసిన మార్టిన్ గప్టిల్, హాఫ్ సెంచరీ చేసిన ఛాప్‌మన్... రెండేసి వికెట్లు తీసిన భువీ, రవిచంద్రన్ అశ్విన్...

జైపూర్ టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ ఆకట్టుకున్నారు. తొలి ఓవర్‌లోనే వికెట్ దక్కినా, భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ టీమిండియా ముందు 165 పరుగుల టార్గెట్ ఉంచారు. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది న్యూజిలాండ్. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టుకి తొలి ఓవర్‌లోనే ఊహించని షాక్ తగిలింది. తొలి ఓవర్ వేసిన భారత సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్, మూడో బంతికే డార్ల్ మిచెల్‌ని గోల్డెన్ డకౌట్‌గా పెవిలియన్ చేర్చాడు. భువీ వేసిన యార్కర్‌ను ఎదుర్కోవడంలో మిచెల్ విఫలం కావడంతో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు...

ఇన్నింగ్స్ మొదటి ఓవర్‌లోనే వికెట్ తీయడం భువనేశ్వర్ కుమార్‌కి ఇది 8వ సారి. రవిచంద్రన్ అశ్విన్ నాలుగు సార్లు, ఆశీష్ నెహ్రా మూడుసార్లు టీ20ల్లో ఫస్ట్ ఓవర్‌లోనే వికెట్లు తీసిన భారత టాప్ 3 బౌలర్లుగా ఉన్నారు.. 2021లో టీ20ల్లో తొలి ఓవర్‌లో వికెట్ తీయడం భువీకి ఇది మూడోసారి కావడం విశేషం.

Read: రోహిత్ శర్మ వర్సెస్ విరాట్ కోహ్లీ... వారి విషయంలో టీమిండియాకి కలిసిరాని ఇద్దరు కెప్టెన్ల ఫార్ములా...

ఒక్క పరుగు వద్ద తొలి వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్ జట్టుని మార్క్ ఛాప్‌మన్, మార్టిన్ గప్టిల్ కలిసి ఆదుకున్నారు. ఈ ఇద్దరూ రెండో వికెట్‌కి 109 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. తొలుత నెమ్మదిగా బ్యాటింగ్ చేసిన మార్క్ ఛాప్‌మన్, ఆ తర్వాత వేగం పెంచి, బౌండరీలతో ఎదురుదాడి చేశాడు..

50 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 63 పరుగులు చేసి ప్రమాదకరంగా మారుతున్న మార్క్ ఛాప్‌మన్‌ని రవిచంద్రన్ అశ్విన్ క్లీన్ బౌల్డ్ చేశాడు. ఛాప్‌మన్‌ని క్లీన్ బౌల్డ్ చేసిన అశ్విన్, అదే ఓవర్‌లో గ్లెన్ ఫిలిప్స్‌ని పెవిలియన్ చేర్చాడు. మూడు బంతులాడిన గ్లెన్ ఫిలిప్స్, అశ్విన్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. ఫిలిప్స్ రివ్యూ తీసుకున్నా, ఇంపాక్ట్ అంపైర్ కాల్స్ రావడంతో కివీస్‌కి ఫలితం దక్కలేదు.

సిరాజ్ బౌలింగ్‌లో సిక్సర్ బాది, టీ20ల్లో మార్టిన్ గప్టిల్ 21వ హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. టీ20ల్లో ఓపెనర్‌గా అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన ప్లేయర్‌గా రోహిత్ శర్మ (23 హాఫ్ సెంచరీలు) తర్వాతి స్థానంలో నిలిచాడు గప్టిల్.. 42 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 70 పరుగులు చేసిన మార్టిన్ గుప్టిల్, దీపక్ చాహార్ బౌలింగ్‌లో శ్రేయాస్ అయ్యర్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.  

తాను ఎదుర్కొన్న మొదటి 20 బంతుల్లో 20 పరుగులు మాత్రమే చేసిన మార్టిన్ గుప్టిల్, ఆ తర్వాత 22 బంతుల్లో 50 పరుగులు రాబట్టడం విశేషం. భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో సీఫర్ట్ ఇచ్చిన క్యాచ్‌ను బౌండరీ లైన్ దగ్గర జారవిడిచాడు అక్షర్ పటేల్. 11 బంతుల్లో 2 ఫోర్లతో 12 పరుగులు చేసిన టిమ్ సిఫర్ట్, భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో భారీ షాట్‌కి ప్రయత్నించి సూర్యకుమార్ యాదవ్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు...

ఆఖరి ఓవర్‌లో తొలి బంతికి బ్యాట్స్‌మెన్ కొట్టిన ఆపే క్రమంలో సిరాజ్ చేతికి గాయమైంది. అయితే ఫిజియో చికిత్స తర్వాత బౌలింగ్ కొనసాగించిన సిరాజ్, ఆ తర్వాత ఐదో బంతికి 7 పరుగులు చేసిన రచిన్ రవీంద్రని క్లీన్ బౌల్డ్ చేశాడు. 

click me!