India vs New Zealand: మయాంక్ అగర్వాల్ సెంచరీ... అజాజ్ పటేల్ స్పిన్ మ్యాజిక్...

By Chinthakindhi RamuFirst Published Dec 3, 2021, 4:42 PM IST
Highlights

India vs New Zealand: 80 పరుగుల వద్ద మూడు వికెట్లు కోల్పోయిన టీమిండియా... మయాంక్ అగర్వాల్ అద్భుత సెంచరీ... అజాజ్ పటేల్‌కి నాలుగు వికెట్లు...

ఇండియా, న్యూజిలాండ్ మధ్య ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరుగతున్న రెండో టెస్టులో భారత జట్టు ఓపెనర్ మయాంక్ అగర్వాల్ సెంచరీ అందుకున్నాడు. కివీస్ స్పిన్ బౌలర్ అజాజ్ పటేల్ మ్యాజిక్ స్పెల్‌కి టీమిండియా టాపార్డర్ బ్యాట్స్‌మెన్ స్పల్ప స్కోరుకే పెవిలియన్ చేరినా... మయాంక్ అగర్వాల్ ఒక్కడూ క్రీజులో నిలబడి శతకాన్ని పూర్తి చేసుకున్నాడు...

196 బంతుల్లో 13 ఫోర్లు, 3 సిక్సర్లతో టెస్టుల్లో నాలుగో సెంచరీ అందుకున్నాడు మయాంక్ అగర్వాల్. ఆరంభం నుంచి దూకుడుగా ఇన్నింగ్స్ ఆరంభించిన శుబ్‌మన్ గిల్, మయాంక్ అగర్వాల్ తొలి వికెట్‌కి 80 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. 71 బంతుల్లో 7 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 44 పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్, అజాజ్ పటేల్ బౌలింగ్‌లో రాస్ టేలర్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు...

ఇదీ చదవండి: ఇదేం చెత్త అంపైరింగ్, బ్యాటుకి తగులుతున్నట్టు కనిపించినా... విరాట్ కోహ్లీ అవుట్‌పై వివాదం...

ఆ తర్వాత ఛతేశ్వర్ పూజారా ఐదు బంతులు ఎదుర్కొని, ఒక్క పరుగు కూడా చేయకుండా అజాజ్ పటేల్ బౌలింగ్‌లో డకౌట్ అయ్యాడు. అదే ఓవర్‌లో ఆఖరి బంతికి విరాట్ కోహ్లీ కూడా అంపైర్ వివాదాస్పద నిర్ణయానికి పెవిలియన్ చేరాడు...

విరాట్ కోహ్లీని ఎల్బీడబ్ల్యూ అవుట్‌గా ప్రకటించాడు అంపైర్. అయితే వెంటనే డీఆర్‌ఎస్ తీసుకున్నాడు విరాట్ కోహ్లీ. టీవీ రిప్లైలో బంతి ముందుగా బ్యాటుకి తగులుతున్నట్టు స్పష్టంగా కనిపించినా, థర్డ్ అంపైర్ అవుట్‌గా ప్రకటించాడు...

దీంతో 80/0 పరుగుల వద్ద పటిష్టంగా ఉన్న టీమిండియా, వెంటవెంటనే అదే స్కోరు వద్ద మూడు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో మయాంక్ అగర్వాల్, శ్రేయాస్ అయ్యర్ కలిసి నాలుగో వికెట్‌కి 80 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు...

160 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది భారత జట్టు. ఈ దశలో మయాంక్ అగర్వాల్ మాత్రం దూకుడు తగ్గించకుండా బౌండరీలు బాదుతూ న్యూజిలాండ్ బౌలర్లపై ఆధిపత్యం ప్రదర్శించాడు. టెస్టు ఓపెనర్‌గా అత్యంత వేగంగా నాలుగు సెంచరీలు బాదిన ఏడో భారత బ్యాటర్‌గా నిలిచాడు మయాంక్ అగర్వాల్...

సునీల్ గవాస్కర్ 8 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఫీట్ సాధించగా, రోహిత్ శర్మ 13, కెఎల్ రాహుల్ 17, రవిశాస్త్రి 20, రాహుల్ ద్రావిడ్ 22, వీరేంద్ర సెహ్వాగ్ 23 ఇన్నింగ్స్‌ల్లో నాలుగు సెంచరీలు పూర్తి చేసుకోగా, మయాంక్ అగర్వాల్‌కి ఈ ఫీట్ అందుకోవడానికి 24 ఇన్నింగ్స్‌లు కావాల్సి వచ్చాయి...

ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో మయాంక్ అగర్వాల్‌కి ఇది నాలుగో సెంచరీ, కేవలం ఐదు సెంచరీలు చేసిన రోహిత్ శర్మ మాత్రమే మయాంక్ అగర్వాల్ కంటే ముందున్నాడు. 

Read Also: ఆ సమయంలో విరాట్ కోహ్లీతో ఆ అంపైర్‌కి గొడవలు... ఆ పగతోనే అవుట్ ఇచ్చాడా...

మయాంక్ అగర్వాల్ చేసిన నాలుగు సెంచరీలు స్వదేశంలో సాధించనవే కాగా, టెస్టుల్లో మయాంక్ చేసిన నాలుగు హాఫ్ సెంచరీలు విదేశాల్లో వచ్చినవి కావడం మరో విశేషం... స్వదేశంలో మయాంక్ అగర్వాల్‌ టెస్టు రికార్డు అసాధారణంగా ఉంది. స్వదేశంలో 90.22 యావరేజ్‌తో 722 పరుగులు చేశాడు మయాంక్ అగర్వాల్...

సిక్సర్‌తో ఖాతా తెరిచిన వృద్ధిమాన్ సాహా, మయాంక్ అగర్వాల్ క్రీజులో కుదురుకోవడంతో 62 ఓవర్లు ఓవర్లు ముగిసే సమయానికి 200 పరుగులను చేరుకుంది భారత జట్టు. 

click me!