IPL: ఇక డౌటే.. కానీ ఆ జ్ఞాపకాలను జీవితాంతం గుర్తుంచుకుంటా..! హార్ధిక్ పాండ్యా భావోద్వేగ పోస్టు

By team teluguFirst Published Dec 3, 2021, 2:59 PM IST
Highlights

Hardik Pandya: సోషల్ మీడియా వేదికగా చేసిన ఓ  పోస్టుతో హార్ధిక్ పాండ్యా.. ముంబై ఇండియన్స్ తనను మళ్లీ తీసుకోవడం లేదని చెప్పకనే చెప్పాడు. ముంబైతో తన జర్నీని భావోద్వేగంగా పంచుకున్నాడు.   

ఐపీఎల్ తో గుర్తింపు పొంది టీమిండియాలో చోటు సంపాదించడమే గాక కీలక ఆల్ రౌండర్ గా పేరు పొందిన హార్ధిక్ పాండ్యా  లైఫ్ లో బ్యాడ్ టైమ్ స్టార్ట్ అయినట్టుంది. ఇప్పటికే గాయం కారణంగా ఫామ్ కోల్పోయి భారత జట్టు నుంచి ఉద్వాసనకు గురైన  ఈ బరోడా బాంబర్.. తాజాగా తనకు గుర్తింపునిచ్చిన ముంబై ఇండియన్స్ జట్టు నుంచి తప్పుకోనున్నాడు..? తాజాగా సోషల్ మీడియా వేదికగా పాండ్యా చేసిన ఓ  పోస్టు  ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నది. ముంబై ఇండియన్స్ తో తన ప్రయాణం ముగిసిందని పాండ్యా చెప్పకనే చెప్పాడు. 

ఇన్స్టాగ్రామ్ వేదికగా ఓ పోస్టు చేసిన పాండ్యా.. ‘ఈ జ్ఞాపకాలను జీవితాంతం నాతో పాటు పదిలపరుచుకుంటాను. ఎన్నో ఆశలతో ఒక యంగ్ స్టర్ గా 2015లో ముంబై ఇండియన్స్  తో ప్రయాణం ప్రారంభించిన నేను.. ఇవాళ అంతర్జాతీయ క్రికెటర్ గా గుర్తింపు సాధించాను. ఈ ఆరేండ్లలో మంచి ఆల్ రౌండర్ గా  పనిచేశాను. జట్టు ఆటగాళ్లతో స్నేహం, ముంబై ఫ్యాన్స్ అభిమానం.. ఒకరకంగా ముంబై ఇండియన్స్ తో  నాకు ఎమోషనల్ బాండింగ్ ఏర్పడింది. మేము కలిసి గెలిచాం.. కలిసి ఓడిపోయాము.. కలిసి పోరాడాము.. ఈ టీమ్ తో గడిపిన ప్రతి క్షణానికి నా హృదయంలో ప్రత్యేకస్థానం ఉంటుంది. మంచి విషయాలు ఎప్పటికైనా ముగియాలని వారు చెప్పారు. కానీ ముంబై ఇండియన్స్ మత్రం నా హృదయంలో ఎప్పటికీ ఉంటుంది..’ అని రాసుకొచ్చాడు. 

 

ఈ పోస్టుకు.. తాను ముంబై ఇండియన్స్ కు ఎంపికైనప్పట్నుంచి తన ప్రయాణం ఎలా సాగిందనే దానిమీద ఓ వీడియోను రూపొందించిన పాండ్యా.. దానికి పైన పేర్కొన్న భావోద్వేగపూరితమైన సందేశం రాశాడు. 

2015లో ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడుతూ కెరీర్  మొదలుపెట్టిన పాండ్యా.. ఇప్పటివరకు ఆ జట్టు తరఫున 92 మ్యాచులాడాడు. 2015లో ఆ జట్టు హార్ధిక్ ను రూ. 10 లక్షలకే దక్కించుకుంది. కానీ ఆ తర్వాత  పాండ్యా తనను తాను నిరూపించుకున్నాడు. ఇక 2017 నుంచి అతడికి యేటా రూ. 11 కోట్లు చెల్లించింది. ముంబై ఇండియన్స్ గెలిచిన నాలుగు కప్పు (2015, 2017, 2019, 2020 సీజన్లలో) లలో హార్ధిక్  కీలక పాత్ర పోషించాడు. 

ముఖ్యంగా 2019, 2020 లో ముంబై ట్రోఫీ నెగ్గడంలో పాండ్యా ది కీ రోల్. మొత్తంగా ముంబై తరఫున 92 మ్యాచులాడిన పాండ్యా.. ఆ జట్టు తరఫున 1,476 పరుగులు చేశాడు. ఇక బాల్ తో 42 వికెట్లు పడగొట్టాడు. కానీ గతేడాది గాయం కారణంగా శస్త్ర చికిత్స చేయించుకున్న అనంతరం పాండ్యా కు బ్యాడ్ టైమ్ స్టార్ట్ అయింది. ఆల్ రౌండర్ కోటాలో  టీ20 ప్రపంచకప్ కు ఎంపికైనా.. ఆ టోర్నీలో కూడా పెద్దగా రాణించలేదు. దీంతో ఇటీవల ముగిసిన న్యూజిలాండ్ తో మూడు మ్యాచుల టీ20  సిరీస్ కు సెలెక్టర్లు అతడిని పట్టించుకోలేదు.  దీంతో అతడి భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. 

ఇక ఇటీవలే ముగిసిన ఐపీఎల్ రిటెన్షన్ ప్రక్రియలో ముంబై ఇండియన్స్.. కెప్టెన్ రోహిత్ శర్మ (రూ. 16 కోట్లు), జస్ప్రీత్ బుమ్రా (రూ. 12 కోట్లు), సూర్యకుమార్ యాదవ్ (రూ. 8 కోట్లు), కీరన్ పొలార్డ్ (రూ. 6 కోట్లు) లను  రిటైన్ చేసుకున్న విషయం తెలిసిందే. పాండ్యా బ్రదర్స్ ఐపీఎల్ 2022 మెగా యాక్షన్ లో పాల్గొననున్నారు. 

click me!