
ముంబైలో ముగిసిన రెండో టెస్టులో కివీస్ దారుణ పరాజయం మూటగట్టుకున్నది. ఈ టెస్టులో 372 పరుగుల తేడాతో టీమిండియా గెలిచింది. టెస్టు క్రికెట్ చరిత్రలో భారత్ కు ఇదే అతి పెద్ద విజయం. కాగా, ఈ మ్యాచ్ లో సభ్యుడు ఆడకున్నా.. తుది జట్టులో సభ్యుడు కాకున్నా.. న్యూజిలాండ్ ఆటగాడు మిచెల్ శాంట్నర్ మాత్రం లక్ష రూపాయల రివార్డు గెలుచుకున్నాడు. సబ్ స్టిట్యూట్ గా వచ్చి కూడా ఇలా రివార్డు పొందిన తొలి ఆటగాడు బహుశా శాంట్నరేనేమో మరి.. అసలు శాంట్నర్ కు లక్ష రూపాయలు ఎందుకిచ్చారంటే..?
రెండో టెస్టులో భాగంగా తొలి ఇన్నింగ్స్ లో భారత్ బ్యాటింగ్ చేస్తుండగా మిచెల్ శాంట్నర్ సబ్ స్టిట్యూట్ ఫీల్డర్ గా గ్రౌండ్ లోకి వచ్చాడు. ఇన్నింగ్స్ 46వ ఓవర్లో ఆ జట్టు లెఫ్టార్ట్ స్పిన్నర్ విలిమమ్ సోమర్విల్లె బౌలింగ్ చేస్తున్నాడు. మరో ఎండ్ లో బ్యాటింగ్ చేస్తున్న శ్రేయస్ అయ్యర్.. దానిని మిడ్ వికెట్ మీదుగా బాదాడు. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న శాంట్నర్.. ఆ బంతిని సిక్స్ వెళ్లకుండా అడ్డుకున్నాడు.
బౌండరీ లైన్ వద్ద ఉన్న శాంట్నర్.. అయ్యర్ కొట్టిన బంతిని ముందుగా పైకెగిరి చేతులతో దానిని పట్టుకుని గ్రౌండ్ లోకి విసిరేశాడు. దీంతో కివీస్ జట్టుకు 5 పరుగులు సేవ్ చేశాడు. అద్భుతమైన ఫీల్డింగ్ ప్రదర్శనతో ఆకట్టుకున్న శాంట్నర్ కు ‘బెస్ట్ సేవ్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. అవార్డుతో పాటు రూ. 1 లక్ష చెక్కును కూడా అందజేశారు.
కాగా.. మిచెల్ శాంట్నర్ ను కాదని సోమర్విల్లెను తుది జట్టులోకి ఎంపిక చేసినా అతడు పెద్దగా ప్రభావం చూపలేదు. రెండు టెస్టులలోనూ అతడు దారుణంగా విఫలమయ్యాడు. ఒకవైపు పిచ్ పై ఉన్న టర్న్ ను ఉపయోగించుకుని ఆ జట్టు స్పిన్నర్లు అజాజ్ పటేల్, రచిన్ రవీంద్ర అద్భుతంగా బౌలింగ్ చేస్తే.. విలియమ్ మాత్రం తేలిపోయాడు. కాన్పూర్ తో పాటు ముంబై టెస్టులో నాలుగు ఇన్నింగ్సులలో కలిపి 69 ఓవర్లు బౌలింగ్ చేసిన అతడు.. 237 పరుగులిచ్చాడు.
ఇక భారత్ లో టెస్టు విజయం కోసం 33 ఏండ్లుగా పడిగాపులు కాస్తున్న న్యూజిలాండ్ కు మరోసారి నిరాశే ఎదురైంది. చివరిసారిగా ఆ జట్టు.. 1988 లో వాంఖెడే స్టేడియంలోనే విజయం సాధించింది. ఆ తర్వాత ఇప్పటివరకు భారత్ లో భారత్ ను ఓడించలేదు. ఈసారైనా టెస్టు గెలుస్తామని భావించిన కివీస్ ఆటగాళ్లకు నిరాశే ఎదురైంది.