
ఐర్లాండ్ టూర్‌ని వర్షంతో మొదలెట్టిన టీమిండియా, వర్షంతోనే ముగించింది. ఇరు జట్ల మధ్య జరగాల్సిన మూడో టీ20 మ్యాచ్, వర్షం కారణంగా ఒక్క బంతి కూడా వేయకుండానే రద్దయ్యింది. ఏడాది తర్వాత రీఎంట్రీ ఇస్తూనే టీ20 కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్న జస్ప్రిత్ బుమ్రా, సారథిగా ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌ని 2-0 తేడాతో కైవసం చేసుకున్నాడు..
భారత కాలమానం ప్రకారం సాయంత్రం 7 గంటలకు టాస్ వేయాల్సి ఉంది. అయితే వర్షం కారణంగా టాస్‌ని వాయిదా వేస్తూ వెళ్లారు అంపైర్లు. రాత్రి 10:08 నిమిషాలకు వర్షం తగ్గడంతో 20 నిమిషాల తర్వాత గ్రౌండ్‌ని సమీక్షించారు అంపైర్లు. అయితే పిచ్ చిత్తడిగా మారడంతో మ్యాచ్ నిర్వహించడం సాధ్యం కాదని తేలిపోయింది. దీంతో మూడో టీ20ని రద్దు చేస్తున్నట్టు ప్రకటించక తప్పలేదు..
వర్షం కారణంగా తొలి టీ20 మ్యాచ్ పూర్తిగా సాగలేదు. ఐర్లాండ్ తొలుత బ్యాటింగ్ 139 పరుగుల స్కోరు చేసినా, ఈ లక్ష్యఛేదనలో టీమిండియా 6.2 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 47 పరుగులు చేసింది. ఈ సమయంలో ఎడతెడపి లేకుండా వర్షం కురవడంతో మ్యాచ్‌ని నిలిపివేశారు అంపైర్లు. డక్ వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం 2 పరుగుల తేడాతో టీమిండియా గెలిచినట్టు ప్రకటించారు..
రెండో టీ20 మ్యాచ్ మాత్రం పూర్తిగా సాగి, క్రికెట్ ఫ్యాన్స్‌కి కావాల్సినంత మజాని అందించింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా, నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 185 పరుగులు చేసింది. ఐర్లాండ్ లక్ష్యఛేదనలో 20 ఓవర్లు ఆడినా 8 వికెట్లు కోల్పోయి 152 పరుగులు మాత్రమే చేయగలిగింది..
మొదటి టీ20లో అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసినా వర్షం కారణంగా బ్యాటింగ్‌కి వచ్చే అవకాశాన్ని దక్కించుకోలేకపోయాడు రింకూ సింగ్. రెండో టీ20లో ఐదో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చిన రింకూ సింగ్ 21 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 38 పరుగులు చేసి, మొదటి మ్యాచ్‌లోనే ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డును దక్కించుకున్నాడు..
ఆసియా క్రీడల్లో భారత జట్టుకి రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్‌గా వ్యవహరించబోతున్నాడు. దీంతో మూడో టీ20లో జస్ప్రిత్ బుమ్రాకి రెస్ట్ ఇచ్చి, రుతురాజ్ గైక్వాడ్‌ని కెప్టెన్‌గా ఆడించాలని టీమ్ మేనేజ్‌మెంట్ భావించినట్టు వార్తలు వచ్చాయి. అయితే మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో ఈ వార్తల్లో నిజం ఎంతనే విషయం కూడా తెలియలేదు.
మూడో టీ20 ప్రారంభానికి ముందు టీమిండియా క్రికెటర్లందరూ కలిసి చంద్రయాన్-3, చంద్రుడి ఉపరితలంపై దిగుతున్న దృశ్యాలను లైవ్ చూశారు. ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది బీసీసీఐ. ఐర్లాండ్ టూర్‌లో ఉన్న జస్ప్రిత్ బుమ్రా, తిలక్ వర్మ, ప్రసిద్ధ్ కృష్ణ, సంజూ శాంసన్, నేరుగా బెంగళూరు చేరుకుని బీసీసీఐ ఏర్పాటు చేసే ఆసియా కప్ క్యాంపులో పాల్గొంటారు. మిగిలిన టీమ్, ఆసియా క్రీడలకు సిద్ధం కానుంది.