IND vs ENG: భారత్-ఇంగ్లాండ్ టెస్టు సిరీస్ లో ఇరు జట్లు ఒక్కో మ్యాచ్ గెలిచి 1-1తో సమంగా ఉన్నాయి. అయితే, వ్యక్తిగత కారణాలతో ఈ సిరీస్ నుంచి విరాట్ కోహ్లీ తప్పుకోవడంపై ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ స్టువర్ట్ బ్రాడ్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
India vs England: భారత్-ఇంగ్లాండ్ మూడో టెస్టుకు భారత్ జట్టుకు బిగ్ షాక్ తగిలింది. పలువురు కీలక ప్లేయర్లు దూరం అయ్యారు. వారిలో టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ కూడా ఒకరు. ఈ క్రమంలోనే ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ స్టువర్ట్ బ్రాడ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ టెస్టు సిరీస్‌లో విరాట్ కోహ్లీ లేకపోవడం ఈ సిరీస్‌కు, ఆటకు మంచిది కాదని పేర్కొన్న బ్రాడ్.. కోహ్లి లేకపోవడంతో భారత్‌ను ఓడించే సువర్ణావకాశం ఇంగ్లండ్‌కు ఉందన్నాడు. విరాట్ కోహ్లి వ్యక్తిగత కారణాలతో సిరీస్‌కి దూరంగా ఉండగా, రెండో టెస్టులో విజయం సాధించి ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ 1-1తో సమం చేసింది. స్టువర్ట్ బ్రాడ్ మాట్లాడుతూ.. 'విరాట్ తన అభిరుచి, దూకుడు, అద్భుతమైన ఆటతో ఏదైనా పోటీని గొప్పగా చేస్తాడు. అతని ఆటను చూడటానికి ప్రేక్షకులు ఆసక్తి చూపుతారు, కానీ క్రికెట్ కంటే వ్యక్తిగత సమస్యలే ఎప్పుడూ పెద్దవిగా ఉంటాయని అన్నాడు.
కోహ్లీ గైర్హాజరీపై సంచలన వ్యాఖ్యలు
విరాట్ కోహ్లీ ఈ సిరీస్ నుంచి దూరం కావడంతో యువ ఆటగాళ్లకు తమ సత్తాను నిరూపించుకునేందుకు సువర్ణావకాశమని స్టువర్ట్ బ్రాడ్ అభిప్రాయపడ్డాడు. ఇంగ్లాండ్ తరఫున 167 టెస్టులాడి 604 వికెట్లు తీసిన ఈ ఫాస్ట్ బౌలర్.. 'గొప్ప ఆటగాళ్లు ఆడనప్పుడు.. యువకులు తమను తాము నిరూపించుకునే అవకాశం లభిస్తుంది. యశస్వి జైస్వాల్ డబుల్ సెంచరీ ఎలా సాధించాడో గత టెస్టులో చూశాం. మరికొందరు రాబోయే మూడు మ్యాచ్‌లలో భారత్ నుంచి బరిలోకి దిగబోతున్నారు. రాబోయే ప్లేయర్లు విరాట్ ప్లేస్ ను భర్తీ చేసే ప్లేయర్లు కూడా అయివుండవచ్చని అన్నాడు.
విరాట్ లేకపోవడం ఇంగ్లాండ్ కు మంచి ఛాన్స్.. !
టెస్టు సిరీస్‌ను కైవసం చేసుకునేందుకు ఇంగ్లాండ్ కు ఇది సువర్ణావకాశంగా బ్రాడ్ పేర్కొన్నాడు. భారత్ ఇంగ్లాండ్ లు బలమైన జట్లు అనీ, ఇరు టీమ్స్ మధ్య అత్యంత పోటీతత్వ సిరీస్‌లో ఇదొకటి అని పేర్కొన్న స్టువర్ట్ బ్రాడ్.. రాబోయే మూడు టెస్టుల్లో ఇంగ్లాండ్ గెలవడానికి మంచి అవకాశాలు ఉన్నాయని చెప్పాడు. 'విరాట్ లేనప్పుడు, ఇతర ఆటగాళ్ల ఫిట్‌నెస్‌పై చాలా ఆధారపడి ఉంటుంది. కోహ్లీ - ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్లు, ముఖ్యంగా జిమ్మీ ఆండర్సన్ మధ్య పోటీ ఆసక్తికరంగా ఉంటుంది. విరాట్ ఆడకపోవడం క్రికెట్‌కు, ఈ సిరీస్‌కు అవమానకరం. చివరి టెస్టులో భారత్ గెలిచింది, అయితే ఇంగ్లాండ్ బాజ్ బాల్ శైలి భారతదేశంలో ప్రభావవంతంగా ఉంది. వచ్చే మూడు మ్యాచ్‌లు భారత ఆటగాళ్ల ఫిట్‌నెస్‌పైనా, ఇంగ్లాండ్ కు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంపైనా ఆధారపడి ఉంటుందని అన్నాడు.