మళ్లీ తిప్పేసిన పూనమ్: బంగ్లాదేశ్ పై ఇండియా మహిళల గెలుపు

By telugu teamFirst Published Feb 24, 2020, 8:31 PM IST
Highlights

ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ పోటీల్లో భాగంగా జరిగిన మ్యాచులో బంగ్లాదేశ్ పై భారత్ 18 పరుగుల తేడాతో విజయం సాధించింది. పూనమ్ యాదవ్ బంతిని తిప్పేసి విజయంలో కీలక పాత్ర పోషించింది.

పెర్త్: భారత బౌలర్లు మరోసారి తమ సత్తా చాటడంతో మహిళల టీ20 ప్రపంచ కప్ పోటీల్లో టీమిండియా మరో విజయాన్ని అందుకుంది. మరోసారి పూనమ్ యాదవ్ బంతిని తిప్పేసి విజయంలో కీలక పాత్ర పోషించింది. పెర్త్ వేదికగా సోమవారం జరిగిన టీ20 మ్యాచులో భారత్ బంగ్లాదేశ్ పై 18 పరుగుల తేడాతో విజయం సాధించింది. 

మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది. షెఫాలిీవర్మ 17 బంతుల్లో 39 పరుగులు, జెమియా రోడ్రిగ్స్ 37 బంతుల్లో 34 పరుగులు చేయడంతో భారత గౌరవప్రదమైన లక్ష్యాన్ని బంగ్లాదేశ్ ముందు ఉంచగలిగింది. 

ఆ తర్వాత లక్ష్యఛేదనకు దిగిన బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 124 పరుగులు చేసింది. దీంతో బంగ్లాదేశ్ కు ఓటమి తప్పలేదు. ముర్షిదా 26 బంతుల్లో 30 పరుగులు, నిగర్ సుల్తానా 26 బంతుల్లో 35 పరుగులు చేశారు. ఈ విజయంతో ప్రపంచ కప్ గ్రూప్ - ఏలో పాయింట్ల పట్టికలో నాలుగు పాయింట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచింది. 

మరోసారి పునామ్ యాదవ్ తన స్పిన్ బౌలింగ్ తో బంగ్లాదేశ్ కు చుక్కలు చూపించింది. 143 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ ఓపెనర్ షమియా (3)ను శిఖ పాండే ఔట్ చేసింది. శిఖ పాండేకు 2 వికెట్లు దక్కాయి. సంజిదా (10)తో కలిసి ముర్షిదా ఇన్నింగ్సును నిర్మించింది. అయితే అరుంధతి, పూనమ్ కలిసి వారిద్దరిని పెవిలియన్ కు చేర్చారు. అరుంధతికి 2 వికెట్లు లభించగా, పూనమ్ 3 వికెట్లు తీసింది. 

ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన ఫాహిమా (17)తో కలిసి నిగర్ సుల్తానా రన్ రేట్ తగ్గకుండా జాగ్రత్తగా ఆడుతూ ముందుకు సాగింది. భారత బౌలర్లు పుంజుకుని క్రమం తప్పకుండా బంగ్లా బ్యాట్స్ వుమెన్ ను పెవిలియన్ కు చేర్చారు. చివరలో జహారానా, రుమానా పోరాడినా ఫలితం లభించలేదు.

టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత్ కు కూడా ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. స్మృతి మంథానా మ్యాచుకు దూరం కావడంతో తానియా భాటియా (2)తో కలిసి షెఫాలీ ఇన్నింగ్సులు ప్రారంభించారు. సెఫాలీ బౌండరీలు కొడుతూ స్కోరును పెంచుతూ వెళ్లింది. భారత బ్యాట్స్ వుమెన్ లో వేద కృష్ణమూర్తి 11 బంతుల్లో 20 పరుగులు చేయడంతో స్కోరు పెరిగింది. బంగ్లాదేశ్ బౌలర్లలో బంగ్లా బౌలర్లలో సల్మకు 2 వికెట్లు, పన్నా ఘోష్ కు రెండు వికెట్లు లభించాయి. 

click me!